సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎంటీఏ) తొలిసారి అగ్రశ్రేణి ఆటగాళ్ల శిక్షణకు వేదికగా మారింది. నగర శివార్లలోని మొయినాబాద్‌లో గల ఈ అకాడమీలో భారత పురుషుల జట్టు సభ్యులకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ప్రస్తుతం వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణా కేంద్రంగానే ఉన్న అకాడమీ భవిష్యత్తులో మరిన్ని కీలక ఈవెంట్లకు ప్రధాన వేదిక అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ (ఐటీపీఏ) తాజాగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. భారత సింగిల్స్ టాప్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్న, యువ క్రీడాకారులు పురవ్ రాజా, సాకేత్ మైనేని, శ్రీరామ్ బాలాజీ, సనమ్ సింగ్ తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. రెండు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. ఆటగాళ్ల వ్యక్తిగత కోచ్‌లు ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తుండగా...సానియా మీర్జా అకాడమీ స్పెషల్ ట్రైనర్ రాబర్ట్ బలార్డ్ భారత ఆటగాళ్లకు కూడా ప్రత్యేకంగా సహకరించనున్నారు. కొత్త సీజన్‌లో జరిగే తొలి టోర్నీ చెన్నై ఓపెన్‌కు ముందు ఈ సన్నాహకాలు ఉపయోగపడతాయని ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై ఓపెన్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌కు కూడా సోమ్‌దేవ్, బొపన్న సిద్ధమవుతున్నారు. మరో వైపు సానియా మీర్జా డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) కూడా ఇక్కడే సాధన చేస్తోంది. వచ్చే ఏడాది అంతా బ్లాక్‌తోనే కలిసి బరిలోకి దిగనున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 15నుంచి ఎస్‌ఎంటీఏలో భారత ఫెడరేషన్ కప్ జట్టుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని కూడా నిర్వహించనుంది.