టూత్ బ్రష్ కూడా పట్టుకోలేకపోయా! | Even hold a toothbrush! | Sakshi
Sakshi News home page

టూత్ బ్రష్ కూడా పట్టుకోలేకపోయా!

Published Fri, Jul 18 2014 11:36 PM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

Even hold a toothbrush!

విజయమైనా, వివాదమైనా భారత టెన్నిస్‌లో సానియా మీర్జా ముద్ర స్పష్టం. ఆమె స్థానం పదిలం. దశాబ్ద కాలానికి పైగా భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ హైదరాబాదీ అంతర్జాతీయ టెన్నిస్‌లోనూ తన గుర్తింపును చాటుకుంది. ముఖ్యంగా మహిళల డబుల్స్‌లో గత కొన్నాళ్లుగా ఆమె తిరుగులేని విజయాలు సాధిస్తోంది. తాజాగా ప్రపంచ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఆమె ఐదో ర్యాంక్‌కు చేరుకుని అత్యుత్తమ స్థాయికి చేరింది. చాలా కాలం క్రితమే సింగిల్స్‌కు దూరమైనా తాను ఎంచుకున్న విభాగంలోనే 28 ఏళ్ల సానియా దూసుకుపోతోంది. అయితే దాదాపు నాలుగేళ్ల క్రితమే సానియా తన కెరీర్ ముగించాలని భావించింది. గాయాలను తట్టుకోలేక ఇక చాలనుకుంది. అయితే మొండి పట్టుదలతో ఆమె పోరాడింది. తన కెరీర్‌ను నిలబెట్టుకుంది.    
- మొహమ్మద్ అబ్దుల్ హాది
 
ఒకప్పుడు సానియా మీర్జా భారత్ తరఫున సింగిల్స్‌లోనూ సూపర్ స్టార్. కానీ ఎక్కువకాలం ఈ విభాగంలో నిలకడ చూపలేకపోయింది. అదృష్టం బాగుంటే రెండో రౌండ్, లేదంటే తొలి రౌండ్‌లో పరాజయం... ఒక దశలో సానియా సింగిల్స్ మ్యాచ్ ఫలితం అంటే ఇంతే అన్నట్లుగా ఉండేది. డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో ఉన్న పోటీని సానియా అందుకోలేకపోయింది.  మరోవైపు చూస్తే డబుల్స్‌లో అప్పుడప్పుడు కొన్ని మెరుపు విజయాలు దక్కుతున్నాయి.

ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉన్నా... చివరకు సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. ‘పూర్తిగా ఆడలేనని కాదు. సింగిల్స్‌లో 60-70 మధ్య ర్యాంకుల్లో ఉన్నాను. డెరైక్ట్ ఎంట్రీ కూడా లభిస్తోంది. కానీ నా ఆట గురించి నాకు తెలుసు. గాయాల తర్వాత సింగిల్స్ ఒత్తిడిని నా శరీరం భరించే స్థితిలో లేదు. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’ అని సానియా చెప్పింది. అయితే ఆ నిర్ణయం ఆమెకు ఎంతో మేలు చేసింది. పూర్తి స్థాయిలో డబుల్స్‌పై దృష్టి పెట్టేలా చేయగలిగింది. ‘ఆటను మొదలు పెట్టినప్పుడు అత్యుత్తమ స్థాయికి చేరాలని భావించాను. ఇప్పుడు ఐదో ర్యాంక్ అందుకోవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇక్కడి దాకా వచ్చినదాన్ని నంబర్‌వన్‌ను కూడా కాగలను‘ అని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.
 
భాగస్వాములు మారినా...
 
సాధారణంగా డబుల్స్‌లో ఒకే భాగస్వామితో ఎక్కువ కాలం ఆడితేనే మంచి ఫలితాలు వస్తాయంటారు. కానీ సానియా ఇది తప్పని నిరూపించింది. తనకు లభించిన అవకాశాలను ఉపయోగించుకుంది. గతంలో బెథాని మాతెక్‌తో కలిసి వరుస విజయాలు సాధించిన ఆమె ఇప్పుడు కారా బ్లాక్‌తో కలిసి అదే జోరును కొనసాగిస్తోంది. 2013లో సానియా ఐదుగురు వేర్వేరు భాగస్వాములతో ఐదు టైటిల్స్ గెలవడం విశేషం. ‘భాగస్వామి మారకుంటే మంచిదే. కానీ అదే ముఖ్యం కాదు. మనపై మనకు నమ్మకం ఉండాలి. పక్కన ఎవరు ఉన్నా సమన్వయానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బ్లాక్‌తో నాకు అలాగే జత కుదిరింది’ అని సానియా వెల్లడించింది.
 
సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్‌కు పెద్దగా గుర్తింపు ఉండదనేది వాస్తవం. అయితే సర్క్యూట్‌లో డబుల్స్‌ను తక్కువ చేసి చూడటం కూడా ఉండదు. ప్రపంచంలో  టాప్-30లో చాలా మంది క్రీడాకారులు డబుల్స్ ఆడటం దీనిని సూచిస్తోంది. ‘భారత టెన్నిస్‌కు గుర్తింపు తెచ్చిన పేస్, భూపతి కూడా ఆ ఘనతలన్నీ డబుల్స్‌లోనే సాధించారనేది మరచిపోవద్దు. అయినా సింగిల్స్‌లో ఎంత మందికి గ్రాండ్‌స్లామ్ గెలిచే అవకాశం ఉంటుంది. అది అంత సులువు కాదు’ అని ఈ హైదరాబాదీ తన మనోభావం వెల్లడించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా ఖాతాలో రెండు గ్రాండ్‌స్లామ్‌లు ఉన్నాయి.
 
నాలుగేళ్ల క్రితం నరకం
 
క్రీడాకారుల జీవితంలో చాలాసార్లు గాయాలు భాగంగా మారిపోతాయి. అయితే అవి కెరీర్‌పై ప్రభావం చూపించేవిగా ఉంటేనే సమస్య. సానియాను ఒకసారి కాదు మూడుసార్లు ఈ సమస్య వెంటాడింది. మోచేతికి గాయం, మూడు సర్జరీలు ఆమె ఆటను ఆపేశాయి. కనీసం టెన్నిస్ రాకెట్ కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఇక మళ్లీ కోర్టులోకి దిగడం కష్టమే అనిపించింది.

అయితే ఈ సమయంలోనూ ఆమె పట్టుదల కోల్పోలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్ఫూర్తితో ఆమె మళ్లీ బరిలోకి దిగింది. ‘టెన్నిస్ రాకెట్ సంగతేమో కానీ కనీసం టూత్‌బ్రష్‌ను కూడా నా చేతితో పట్టుకోలేని పరిస్థితి. ఇక ఆట ఏం ఆడతాం. రిటైర్ కావడమే మిగిలింది అనిపించింది.  అయితే అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటిద్దామని నిర్ణయించుకున్న సమయంలో నా మనసు చాలా బాధపడింది. కానీ ఇంట్లోవాళ్లు ‘ఒక ప్రయత్నం చేసి చూడవచ్చు కదా’ అన్నారు. దీంతో ఆరు నెలలు మళ్లీ శ్రమించాను.

అది ఇప్పుడు ఫలితాన్నిస్తోంది’ అని సానియా గర్వంగా చెబు తోంది.  ఈ ఘనతను ఆమె తన తండ్రి ఇమ్రాన్ మీర్జాకే ఇస్తోంది. ఎందుకంటే ఇంత సుదీర్ఘ కెరీర్‌లో సానియా ఎప్పుడూ పూర్తి స్థాయిలో వ్యక్తిగత కోచ్‌లను నియమించుకోలేదు. పరిమిత సమయానికి ఒకరిద్దరు ట్రావెల్ కోచ్‌లుగా పని చేసినా వారి అవసరం పెద్దగా రాలేదని, తన తండ్రే సూపర్ కోచ్ అనేది ఆమె నిశ్చితాభిప్రాయం.
 
ఆట మినహా అన్నీ దూరం
 
ఒకప్పుడు సానియా మీర్జా అంటే ఆమె వెంట వివాదం కూడా నడిచొచ్చేది. మక్కా మసీదులో షూటింగ్‌తోనో... జాతీయ పతాకానికి అవమానం అనో... లేదంటే ఏదో వ్యాఖ్య చేసో, తన డ్రెస్సింగ్‌తోనో ఆమె ఆటకంటే ఇతర అంశాలతోనే వార్తల్లో నిలిచేది. అయితే ఇప్పుడు చాలా కాలంగా సానియా వీటికి దూరంగా ఉంది. ఆమె మ్యాచ్‌ల ఫలితాలు తప్ప మరొకటి కనిపించడం లేదు. ‘మీడియా నా వెంట పడటం, నా గురించి పట్టించుకోవడం మానేసిందేమో.

అందుకే ఎలాంటి వార్తలు పుట్టడం లేదు. ఎందుకంటే నేను చేసిన దానికంటే మీడియా అనవసరపు ప్రచారంతోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది’ అని సానియా నవ్వుతూ చెప్పింది. అన్నట్లు ఇప్పుడు సానియా మీర్జా తన అకాడమీలో మరింత మంది యువ ఆటగాళ్లను తీర్చి దిద్దే పనిలో ఉంది. ఫలితాల సాధనకు ఏడాది కాలం చాలా చిన్న సమయమని, భవిష్యత్తులో మెరికల్లాంటి ఆటగాళ్లను తయారు చేస్తానంటూ టెన్నిస్ ప్రపంచానికి సానియా హామీ ఇస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement