సానియా మీర్జా అంటే మూడు డబుల్స్ గ్రాండ్‌స్లామ్, మూడు మిక్స్‌డ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 43 డబుల్స్ ట్రోఫీలు, 91 వారాలు వరల్డ్ నంబర్‌వన్ మాత్రమేనా? సానియా మీర్జా అంటే 20 ఏళ్ల పాటు టెన్నిస్ సర్క్యూట్‌లో ప్రొఫెషనల్‌గా కొనసాగడం మాత్రమేనా? వీటన్నింటికి సమాధానం ‘కాదు’ మాత్రమే!
మన దేశంలో అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టడమే అరుదుగా అనిపించిన సమయంలో సానియా టెన్నిస్‌ను ఎంచుకొని కొత్త బాటను వేసింది. తన ఆటను, తన సామర్థ్యాన్ని నమ్ముకొని ముందుకు వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది. ఆమె టెన్నిస్‌కే పరిమితం కాదు. భారత క్రీడలకే ఆమె ఒక ‘వండర్ ఉమన్’.
ఎన్నో ఏళ్లుగా మహిళల క్రీడలకు సంబంధించి ఉన్న మూసను సానియా బద్దలు కొట్టింది. ఆటతోనే కాకుండా అవసరమైతే మాటతోనూ తలపడింది. తన స్థాయి ప్లేయర్‌ను ఒక ‘ఎర’గా వేశారంటూ పురుషాధిక్య సమాజపు నైజాన్ని నేరుగా ప్రశంసించింది. తన ఆటలో సంధించిన ఏస్‌ల తరహాలోనే మాటల్లో కూడా అంతే పదును చూపించింది.
ఎలాంటి టెన్నిస్ నేపథ్యం లేని నగరం నుంచి, సాంప్రదాయ కట్టుబాట్లతో కూడిన తన సొంత నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింగిల్స్‌లో 27 వరకు, డబుల్స్‌లో నంబర్‌వన్ వరకు సానియా ఎదగగలిగింది. ఒక స్టార్‌గా, దిగ్గజంగా ఆటపై సానియా ముద్ర అసమానం. శ్రమించే తత్వం, పట్టుదలతో ఆమె సాధించిన ఘనతలు స్ఫూర్తిదాయకం.
టెన్నిస్‌లో ఉచ్ఛస్థితికి చేరుతున్న సమయంలో వెంట నడిచి వచ్చిన వివాదాలను ఆమె లెక్క చేయలేదు. చాలా మందిలా కన్నీళ్లు పెట్టుకొని కుప్పకూలిపోలేదు... మొండిగా నిలబడింది. అంతే వేగంగా వాటికి తగిన రీతిలో జవాబిచ్చింది. ఎవరి కోసమో తాను మారలేదు, తాను అనుకున్నట్లు ఆడింది, ఆటను ఆస్వాదించింది, అద్భుతాలు చేసింది.
సానియాకు పెద్ద సంఖ్యలో వీరాభిమానులున్నారు. వేర్వేరు కారణాలతో ఆమెను ద్వేషించే వారూ ఉన్నారు. కానీ అవునన్నా, కాదన్నా ఏ రూపంలోనైనా ఆమె గుర్తింపును మాత్రం ఎవరూ కాదనలేరు. దశాబ్ద కాలానికి పైగా భారత క్రీడల్లో ‘సానియా మానియా’ అన్ని చోట్లా కనిపించింది, వినిపించింది. ఆమె ఏం చేసినా అది వార్తగా నిలిచింది.
భారత టెన్నిస్ చరిత్రలో కేవలం ఐదుగురు మహిళలు మాత్రమే సింగిల్స్‌లో టాప్–200 వరకు రాగలిగారు. అందులో నలుగురు కనీసం వందో ర్యాంక్‌కు చేరువగా కూడా రాలేదు. అలా చూస్తే సానియా సాధించిన 27వ ర్యాంక్ విలువేమిటో అర్థమవుతుంది. దీంతో పాటు డబుల్స్‌లో శిఖరాన నిలిచి శాసించిన సానియా మీర్జా ఉజ్వల టెన్నిస్‌కు తెర పడింది. –సాక్షి క్రీడా విభాగం
అందని ఒలింపిక్ పతకం
సానియా కెరీర్‌లో ఎన్నో ఘనతలు ఉన్నా... ప్రతిష్టాత్మక ఒలింపిక్ పతకాన్ని మాత్రం ఆమె సొంతం చేసుకోలేకపోయింది. 2008, 2012, 2016, 2020ల్లో నాలుగు ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్నా ఆమెకు అది లోటుగా ఉండిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానం సాధించడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఆసియా క్రీడల్లో 2 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలతో పాటు కామన్వెల్త్ క్రీడల్లో ఒక రజతం, ఒక కాంస్యం ఆమె గెలుచుకుంది.
పురుషాహంకారాన్ని ప్రశ్నిస్తూ...
కెరీర్ ఆరంభంలో వచ్చిన కీర్తికనకాదులతో పాటు పలు వివాదాలు సానియాతో నడిచొచ్చాయి. జాతీయ జెండాను అవమానించినట్లు వార్తలు, స్కర్ట్‌లపై ‘ఫత్వా’లు జారీ, మసీదులో షూటింగ్, కొన్ని అసందర్భ వ్యాఖ్యలు, ఆ తర్వాత పాకిస్తానీ అయిన షోయబ్ మలిక్‌తో వివాహం... ఇలాంటివన్నీ ఆమెను ఒక వివాదాస్పదురాలిగా చిత్రీకరించాయి. వీటి వల్ల ఆమె చాలా సందర్భాల్లో ‘నెగెటివ్’ వార్తల్లో నిలిచింది. వాటిపై వివరణలు ఇచ్చుకునేందుకు ఆమె చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.
అయితే తర్వాతి రోజుల్లో తాను మరింత పరిణతి చెందానని, ఇలాంటివి పట్టించుకోవడం మానేశానని ఆమె చెప్పుకుంది. నిజంగా కూడా ఆపై కెరీర్ కీలక దశలో ఆమె తన ఆటతో మినహా మరే అంశంతోనూ ‘వార్త’గా మారలేదు. అయితే 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా రేగిన వివాదం సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం సానియా వ్యక్తిత్వం గురించి చెబుతాయి.
పురుషుల డబుల్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి బరిలోకి దిగేందుకు మహేశ్ భూపతి, రోహన్ బోపన్న నిరాకరించగా... విష్ణువర్ధన్‌ను ‘ఐటా’ ఎంపిక చేసింది. అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జా తనతో కలిసి ఆడతానని హామీ ఇస్తేనే విష్ణుతో కలిసి బరిలోకి దిగుతానని పేస్ షరతు పెట్టాడు.
ఈ విషయం తర్వాత తెలుసుకున్న సానియా దీనిని ‘పురుషా హంకారం’గా పేర్కొంది. పేస్ కోసం తనను ‘ఎర’గా వేశారంటూ విరుచుకుపడింది. వేర్వేరు సందర్భాల్లో కూడా ముక్కుసూటి జవాబులతో ఘాటుగా సమాధానాలు ఇవ్వడం సానియా శైలి. పెళ్లయిన ఆరేళ్ల తర్వాత కూడా ఇంకా ‘జీవితంలో స్థిరపడలేదేంటి’ అంటూ ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై... ‘నేను వరల్డ్‌నంబర్ కావడంకంటే తల్లిగా మారలేదేంటని మీరు అడుగుతున్నట్లున్నారు.
నేనే కాదు ప్రతీ మహిళకు ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతా యి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటే తప్ప స్థిరపడినట్లు కాదా. నేను ఎన్ని గ్రాండ్‌స్లామ్ గెలిచినా వాటికి విలువ లేనట్లుంది’ అని తీవ్రంగా జవాబిచ్చింది.
సానియా... ఓటమితో ముగింపు
తన ప్రొఫెషనల్ టెన్నిస్ కెరీర్ చివరి టోరీ్నలో భారత స్టార్ సానియా మీర్జాకు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన దుబాయ్ ఓపెన్ టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా మీర్జా (భారత్)–మాడిసన్ కీస్ (అమెరికా) జోడీ 4–6, 0–6తో వెరోనిక కుదెర్‌మెతోవా– సమ్‌సనోవా (రష్యా) ద్వయం చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా–కీస్ జోడీ తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. తొలి రౌండ్‌లో ఓడిన సానియా–కీస్‌లకు 7,900 డాలర్ల (రూ. 6 లక్షల 54 వేలు) ప్రైజ్‌మనీ లభించింది.
వ్యక్తిగతం...
1986 నవంబర్ 15న సానియా మీర్జా ముంబైలో పుట్టింది. 2010లో పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మలిక్‌ను వివాహం చేసుకున్న సానియాకు నాలుగేళ్ల కుమారుడు ఇజ్‌హాన్ ఉన్నాడు. ‘ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ వచ్చింది.
కెరీర్‌లో ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన సానియా జీవితాన్ని సినిమాగా తీయాలని ప్రతిపాదనలు వచ్చినా అవి ఫలించలేదు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు కలిసి ‘మీర్జా మలిక్ షో’ అనే చాట్ షోను సమర్పిస్తున్నారు. ఇది పాకిస్తాన్‌లోని ‘ఉర్దూ ఫ్లిక్స్’ ఓటీటీలో ప్రసారమవుతోంది. భారత ప్రభుత్వం ద్వారా అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఆమె అందుకుంది.
ఆ ఆరు గ్రాండ్‌స్లామ్‌లు...
మహిళల డబుల్స్: వింబుల్డన్ (2015), యూఎస్ ఓపెన్ (2015), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2016; అన్నీ మార్టినా హింగిస్‌తో).
మిక్స్‌డ్ డబుల్స్: ఆ్రస్టేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012; ఈ రెండూ మహేశ్ భూపతితో); యూఎస్ ఓపెన్ (2014; బ్రూనో సోరెస్‌తో).
కెరీర్ రికార్డ్
సింగిల్స్: విజయాలు 271, పరాజయాలు 161
డబుల్స్: విజయాలు 536, పరాజయాలు 248
కెరీర్ ప్రైజ్‌మనీ: 72 లక్షల 65 వేల 246 డాలర్లు (రూ. 60 కోట్ల 20 లక్షలు)
1 భారత్ నుంచి డబ్ల్యూటీఏ టైటిల్ (సింగిల్స్, డబుల్స్) గెలిచిన, గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో నాలుగో రౌండ్‌కు చేరిన, వరల్డ్ ర్యాంకింగ్ టాప్–50లో నిలిచిన, మహిళల గ్రాండ్‌స్లామ్ గెలిచిన, డబ్ల్యూటీఏ ఫైనల్స్ గెలిచిన, వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన తొలి భారత ప్లేయర్ సానియా మీర్జా.
పట్టుదలతో పైపైకి...
సానియా మీర్జాకు 11 ఏళ్ల వయసు... హైదరాబాద్‌లోని ఒక కోర్టులో ఆమె సాధన కొనసాగుతోంది... అప్పటికి ఆమె రాకెట్ పట్టుకొని ఐదేళ్లవుతోంది. అయితే ఆమె కెరీర్‌పై తండ్రి ఇమ్రాన్ మీర్జాకు ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. సానియా ఏమాత్రం ఆడగలదు, అసలు పోటీ ప్రపంచంలో నిలబడగలదా, భవిష్యత్తు ఉంటుందా అనే సందిగ్ధత... అప్పటికే సన్నిహితులు కొందరు ‘మన అమ్మాయికి ఇలాంటి చిన్న స్కర్ట్‌లతో టెన్నిస్ అవసరమా’ అంటూ మాటలు విసురుతూనే ఉన్నారు.
మరో మిత్రుడు వచ్చి ‘ఏంటి సానియాను మార్టినా హింగిస్‌ను చేద్దామనుకుంటున్నావా’ అంటూ వ్యంగ్య వ్యాఖ్య ఒకటి చేసి వెళ్లిపోయాడు. 16 ఏళ్ళ వయసుకే సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ గెలిచి హింగిస్ సంచలనం సృష్టించిన రోజులవి. అలాంటి మాటలతో ఒక దశలో ఇమ్రాన్‌లో ఆందోళన పెరిగింది. కానీ దానిని బయట పడనీయలేదు. తర్వాతి రోజుల్లో మార్టినా హింగిస్‌తోనే జత కట్టి వరల్డ్ నంబర్‌వన్ జోడీగా నిలవడంతో పాటు 14 డబుల్స్ టైటిల్స్ కలిసి సాధించడం విశేషం.
సహజసిద్ధమైన ప్రతిభకు తోడు కష్టపడే గుణం, పట్టుదల, పోరాటతత్వం, ఓటమిని అంగీకరించని నైజం వెరసి సానియాను అగ్ర స్థానానికి చేర్చాయి. కెరీర్ ఆరంభంలో విమానాలకు పెద్దగా ఖర్చు పెట్టలేని స్థితిలో దేశవ్యాప్తంగాటోర్నీ లు ఆడేందుకు ఆ కుటుంబం ఒక పాత కారును ఉపయోగించింది. అప్పుడు రోడ్డు ద్వారా ప్రయాణించిన దూరం ఎన్ని కిలోమీటర్లో కానీ... ఈ సుదీర్ఘ టెన్నిస్ ప్రయాణం మాత్రం వెలకట్టలేని విధంగా భారత క్రీడా చరిత్రలో నిలిచిపోయింది.
జూనియర్ వింబుల్డన్ విజేతగా...
ఆటలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత హైదరాబాద్‌లో చిన్నటోర్నీ లు మొదలు జాతీయ స్థాయిలో కూడా వేర్వేరు నగరాల్లో జరిగే పోటీల్లో సానియా పోటీ పడింది. వెంటనే విజయాలు రాకపోయినా ఆమె ఆటలో ప్రత్యేకత ఉందని, దూకుడు కనిపిస్తోందని మాత్రం భారత టెన్నిస్ వర్గాల్లో చర్చ మొదలైంది. 13 ఏళ్ల వయసులో జాతీయ అండర్–14, అండర్–16 టైటిల్స్ గెలవడంతో సానియాకు అసలైన గుర్తింపు లభించింది.
జూనియర్ స్థాయిలో ఆమె 10 సింగిల్స్, 13 డబుల్స్ టైటిల్స్ నెగ్గింది. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోయేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. 2003 వింబుల్డన్‌టోర్నీ లో జూనియర్ బాలికల డబుల్స్‌లో రష్యాకు చెందిన అలీసా క్లెబనోవాతో కలిసి సానియా విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో ఆమె భారత టెన్నిస్‌లో కొత్త తారగా అందరి దృష్టిలో పడింది.
సొంతగడ్డపై...
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2003లో తన సొంత నగరంలో జరిగిన హైదరాబాద్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డ్‌గా బరిలోకి దిగింది. అక్కడ తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైనా రెండేళ్ల తర్వాత ఇదే వేదికపై ఆమె తనకు కావాల్సిన ఫలితాన్ని అందుకుంది. ఇదే హైదరాబాద్ ఓపెన్‌లో విజేతగా నిలిచి సింగిల్స్‌లో డబ్ల్యూటీఏ తొలి టైటిల్ సొంతం చేసుకుంది. సానియా కెరీర్‌లో ఇదే ఏకైక సింగిల్స్ ట్రోఫీ. ఆపై మరో నాలుగు టోర్నీ ల్లో ఫైనల్ చేరినా, ఆమె రన్నరప్ స్థానానికే పరిమితమైంది.
27వ ర్యాంక్‌కు...
2005లో యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ వరకు చేరడంతో ‘డబ్ల్యూటీఏ న్యూ కమర్’గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సింగిల్స్‌లో కొంత కాలం సానియా జోరు కొనసాగింది. టైటిల్స్ లేకపోయినా పలువురు అగ్రశ్రేణి క్రీడాకారిణులపై సాధించిన కొన్ని సంచలన విజయాలు ఆమె సత్తాను చూపించాయి. ముఖ్యంగా హార్డ్ కోర్టుల్లో ప్రదర్శనతో ఆమె ర్యాంక్ మెరుగవుతూ వచ్చింది. ఎట్టకేలకు 2007 ఆగస్టులో సానియా సింగిల్స్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 27వ స్థానానికి చేరింది. ఇది ఆమె సింగిల్స్ కెరీర్‌లో అత్యుత్తమ దశ.
అయితే ఆ తర్వాత దీనిని నిలబెట్టుకోవడంలో ఆమె విఫలమైంది. వరుస పరాజయాలు, మణికట్టు గాయాలు ఆమె సింగిల్స్ ఆటకు ప్రతిబంధకంగా మారాయి. దాంతో సింగిల్స్‌కు పూర్తిగా గుడ్‌బై చెప్పి డబుల్స్‌పైనే దృష్టి పెట్టాలని సానియా నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న ఈ కీలక నిర్ణయం భవిష్యత్తులో ఆమె కెరీర్‌కు కొత్త ఊపిరి పోసింది.
డబుల్స్ స్టార్‌గా...
సొంతగడ్డపై హైదరాబాద్ ఓపెన్‌లోనే లీజెల్ హ్యూబర్ కలిసి డబుల్స్‌లోనూ తొలి టైటిల్ (2004) సాధించిన సానియా సింగిల్స్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత వరుస విజయాలు అందుకుంది. మహిళల డబుల్స్‌లో 82 మందితో జత కట్టిన సానియా 17 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఏకంగా 43 డబ్ల్యూటీఏ టైటిల్స్ గెలవగలిగింది.
వీరందరిలోనూ 70వ భాగస్వామి అయిన మార్టినా హింగిస్‌తో ఆమె అద్భుత ఫలితాలు సాధించింది. ఒక దశలో ఈ జోడీ ఓటమి అనేదే లేకుండా సాగింది. 2015–16 మధ్య కాలంలో వీరిద్దరు వరుసగా 41 మ్యాచ్‌లలో గెలుపొందడం పెద్ద విశేషం. గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో 14 మందితో ఆమె జోడీగా బరిలోకి దిగింది. ఇదే క్రమంలో 2015 ఏప్రిల్‌లో సానియా మొదటిసారి వరల్డ్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ‘వరల్డ్ నంబర్‌వన్’ స్థానానికి చేరింది.
అమ్మగా మారాక...
హింగిస్‌తో కలిసి గెలిచిన 14 టైటిల్స్‌ను పక్కన పెట్టినా... ఇతర భాగస్వాములతో కలిసి సానియా ఖాతాలో 29 ట్రోఫీలు ఉన్నాయి. అయినా సరే సానియా–హింగిస్ జోడీ ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. అగ్గికి కి వాయువు తోడైనట్లుగా సానియా అద్భుత ఫోర్‌హ్యాండ్, హింగిస్ బ్యాక్ హ్యాండ్ కలిసి ప్రత్యర్థులను పడగొట్టాయి. అయితే కారణాలేమైనా హింగిస్‌తో విడిపోయిన తర్వాత సానియాకు సంతృప్తికర ఫలితాలు రాలేదు. ఆ తర్వాత 4టోర్నీ ల్లోనే ఆమె విజేతగా నిలిచింది.
2018 ఆరంభంలో గాయాలతో కొన్నిటోర్నీ లకు దూరమైన సానియా అదే ఏడాది చివర్లో కొడుకు పుట్టడంతో టెన్నిస్‌కు నిరవధిక విరామం ఇచ్చింది. అయితే ఏడాదిన్నర తర్వాత మళ్లీ పూర్తి ఫిట్‌గా మారి పునరాగమనం చేసిన అనంతరం మరో రెండు టైటిల్స్ గెలవడం విశేషం. చివరకు ఈ ఏడాది జనవరిలో తన రిటైర్మెంట్ గురించి సానియా ప్రకటన చేసింది. దుబాయ్ ఓపెన్ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో చివరి టోర్నమెంట్ అని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment