అందుకే ఆ కృతజ్ఞత!
ప్రభుత్వం ఎంతో మద్దతిచ్చింది
‘ఏషియాడ్’కు దాదాపు దూరమైనట్లే
‘సాక్షి’తో సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాక తొలి టైటిల్ (యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్) గెలిచిన సానియా మీర్జాకు ఆదివారం నగరంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రొటోకాల్ ఉన్నతాధికారి అశ్వనీ కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. సానియా రాకతో శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి వరకు ఆమెను ర్యాలీగా తీసుకెళ్లారు. తనకు లభించిన స్వాగతంతో ఉబ్బితబ్బిబ్బయిన సానియా ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే...
భారీ స్వాగతం: నేనూ దీనిని ఊహించలేదు. నా శ్రేయోభిలాషులు కొంత మంది కలిసి దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నేను మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గడం పట్ల మా వాళ్లంతా ఆనందంగా ఉన్నారు. వాస్తవానికి యూఎస్ నుంచి నేను నేరుగా టోక్యో వెళ్లిపోవాల్సి ఉంది. అయితే వీసా సమస్య వల్ల రెండు రోజుల కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. హైదరాబాద్ రాకపోతే బహుశా దీనిని మిస్ అయ్యేదాన్ని.
మిక్స్‌డ్ టైటిల్ గెలవడం: నిజానికి నాకు, కారాకు మధ్య ఉన్న సమన్వయం, మా ఫామ్‌ను బట్టి మహిళల డబుల్స్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని భావించాను. అయితే చాలా శ్రమించినా సెమీస్‌లోనే ఓడిపోయాం. మిక్స్‌డ్‌లో మాత్రం విజయం దక్కింది. వింబుల్డన్ తర్వాతే తొలి సారి బ్రూనో సోరెస్‌తో పరిచయమైంది. చర్చోపర్చల తర్వాత యూఎస్ ఓపెన్‌లో కలిసి ఆడదామని నిర్ణయించుకున్నాం. అందు కోసం రెండు వారాల పాటు ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేశాం.
సోరెస్‌తో ఆడిన తొలి సారే టైటిల్ గెలుచుకోగలగడం ఆనందాన్నిచ్చింది.
మరో గ్రాండ్‌స్లామ్ విజయం: మహిళల డబుల్స్‌తో పోలిస్తే మిక్స్‌డ్‌లో తరచూ నా భాగస్వాములు మారారు. కొన్ని సార్లు ఫలితం దక్కితే మరి కొన్ని సార్లు విఫలమయ్యాం. ఇది నాకు తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ కాబట్టి ప్రత్యేకం. గతంలో రెండు సార్లు భారత భాగస్వామి (మహేశ్ భూపతి)తో గ్రాండ్‌స్లామ్ నెగ్గితే ఈ సారి విదేశీయుడితో జత కట్టాను. ఇక వింబుల్డన్ ఒకటే మిగిలింది. కానీ అప్పటి వరకు సోరెస్‌తో కొనసాగుతానో లేదో చెప్పలేను. అన్నట్లు... 2003లో జూనియర్ విభాగంలో వింబుల్డన్ కూడా గెలిచాను. కాబట్టి నా ఖాతాలో నాలుగు
స్లామ్ టైటిల్స్ ఉన్నట్లే లెక్క (సరదాగా)!
తెలంగాణకు అంకితమనే ప్రకటన: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన తర్వాత ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే నేను టైటిల్ సాధించగలిగాను. ముఖ్యమంత్రి నన్ను ఎంతో ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నగదు పురస్కారం నాకు యూఎస్ ఓపెన్‌కు ముందు శిక్షణ పొందేందుకు ఉపయోగపడింది. వివాదాల సమయంలో ప్రభుత్వం నాకు ఎంతో అండగా నిలిచింది. ఆ కృతజ్ఙతతోనే... గెలిచాక నా మనసులో మాటను బయట పెడుతూ తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చా.
ఆసియా క్రీడల్లో పాల్గొనడం: ఈ ఈవెంట్‌లో నేను పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్లే చెప్పగలను. కావాలని తప్పుకునే ఆలోచన నాకు లేదు. అయితే ఈ నెల 15 నుంచి పాన్ పసిఫిక్ ఓపెన్ (జపాన్), ఆ తర్వాత 27 నుంచి చైనా ఓపెన్ ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో గేమ్స్ జరుగుతున్నాయి. పై రెండు టోర్నీల్లో ఆడకుంటే నా పాయింట్లలో చాలా తేడా వస్తుంది.
వచ్చే నెలలో సింగపూర్‌లో జరిగే అతి పెద్ద టోర్నీ (టాప్-8) డబ్లూటీఏ ఫైనల్స్‌లో నేను పాల్గొనాలంటే నా ఖాతాలో తగినన్ని పాయింట్లు ఉండాలి. నేను పాల్గొనేదీ, లేనిదీ అధికారికంగా ఏఐటీఏ ప్రకటించాల్సిన విషయమే అయినా...నా సమస్యలు, పరిమితులు నాకున్నాయి. ఇప్పటికే కొంత మంది తప్పుకోవడంతో మన మెడల్ అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తుది నిర్ణయం నా చేతుల్లో లేదు. దేశం కోసం నేను అవసరమని సమాఖ్య భావిస్తే పునరాలోచిస్తానేమో..!