సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఈ తరుణంలో పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆయన ఏమన్నారంటే.. ‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. ముఖ్యమంత్రిగారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవ్వాళ మన సైన్యంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ప్రతీ దేశం పాక్‌ను వ్యతిరేకిస్తుంది. భారత్ కూడా అన్నిరకాల మద్దతును ఉపసంహరించుకుంది. మీరూ కూడా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డాను. సానియామీర్జాను ప్రచారకర్తగా తొలగించి పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లో ఒకరిని నియమించండి. ఈ విషయంపై ఒక సారి ఆలోచించండి’ అని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు.
భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగిన సానియా మీర్జాకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిఒక్కరు ఆమె దేశభక్తిని ప్రశ్నిస్తూ.. ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కూడా సానియా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ విషయంపై ఆమె ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ తన దేశభక్తిపై వివరణ కూడా ఇచ్చుకున్నారు. గొంతు చించుకుంటేనే దేశభక్తా? అంటూ ట్రోలింగ్ చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment