Telangana brand ambassador
-
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా పాక్ కోడలు అవసరమా?
-
పాక్ కోడలు అవసరమా?: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలను భారత ప్రజలు కోరుకోవడం లేదని, ఈ తరుణంలో పాకిస్తాన్ కోడలైన సానియా మీర్జాను తెలంగాణ ప్రచారకర్తగా తీసేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. ముఖ్యమంత్రిగారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవ్వాళ మన సైన్యంపై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ప్రతీ దేశం పాక్‌ను వ్యతిరేకిస్తుంది. భారత్ కూడా అన్నిరకాల మద్దతును ఉపసంహరించుకుంది. మీరూ కూడా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డాను. సానియామీర్జాను ప్రచారకర్తగా తొలగించి పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లో ఒకరిని నియమించండి. ఈ విషయంపై ఒక సారి ఆలోచించండి’ అని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగిన సానియా మీర్జాకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిఒక్కరు ఆమె దేశభక్తిని ప్రశ్నిస్తూ.. ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కూడా సానియా తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యారు. ఈ విషయంపై ఆమె ఒకింత అసహనాన్ని వ్యక్తం చేస్తూ తన దేశభక్తిపై వివరణ కూడా ఇచ్చుకున్నారు. గొంతు చించుకుంటేనే దేశభక్తా? అంటూ ట్రోలింగ్ చేసే వారిపై తీవ్రంగా మండిపడ్డారు. చదవండి: గొంతు చించుకొని అరవాలా: సానియా మీర్జా -
నా హబ్బీయే.. నా జేమ్స్‌బాండ్
టెన్నిస్ కోర్టులో దుమ్మురేపే సానియా మీర్జా.. ఆరేళ్ల వయసులో రాకెట్ పట్టింది. పదిహేనేళ్ల వయసులో ఫస్ట్ సక్సెస్ కొట్టింది.టెన్నిస్ స్టార్‌గా సెలబ్రిటీ లిస్ట్‌లో చేరిన సానియా.. తర్వాత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగింది. ప్రజెంట్ సోని పిక్స్ బాండ్ ఫెస్ట్ కోసం టీచర్‌గా మారింది. జేమ్స్‌బాండ్ స్టైల్స్‌ను వివరిస్తూ ఆమె నటించిన ప్రత్యేక షూట్‌ను బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ స్టార్ హోటల్లో శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సానియాను ‘సిటీప్లస్’ పలకరించింది. నేను పుట్టింది ముంబైలో అయినా.. ఐదు రోజుల పాపగా ఉన్నప్పుడే మా ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. నా స్కూలింగ్ అంతా ఖైరతాబాద్‌లోని నాసర్ స్కూల్లోనే సాగింది. టెన్నిస్‌లోనే కాదు చదువులోనూ యాక్టివ్‌గా ఉండేదాన్ని. ఇంటర్ యూసుఫ్‌గూడలోని ‘సెయింట్ మేరీస్ కాలేజ్’లో చదువుకున్నాను. పూర్తి టైం టెన్నిస్ మీదికి షిఫ్ట్ చేసే సరికి నా చదువుకు ఫుల్స్టాప్ పడింది. 15 ఏళ్లకే ఫస్ట్ కిక్.. నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి మా నాన్న టెన్నిస్ ట్రైనింగ్‌కు తీసుకెళ్లేవారు. నన్ను ఓ స్టెఫీగ్రాఫ్గా చూడాలని ఆశపడ్డారు. ప్రొఫెషనల్ కోచ్ దగ్గర ట్రైనింగ్ కోసం వెళ్లినప్పుడు ఇంత చిన్న వయసులో ‘ఎలా నేర్చుకుంటుంది..?’ అని మొదట రెఫ్యూజ్ చేశారు. తర్వాత టెన్నిస్‌పై నాకున్న ఏకాగ్రత, ఇష్టాన్ని చూసి ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ చేసుకున్నారు. తర్వాత సికింద్రాబాద్‌లోని ‘సిన్నేట్ టెన్నిస్ అకాడమీ’లో నా ప్రొఫెషనల్ ట్రైనింగ్ మొదలైంది. తర్వాత కొన్నాళ్లు అమెరికాలో కూడా కోచింగ్ తీసుకున్నాను. టెన్నిస్ కోర్టులో నా ఫస్ట్ సక్సెస్ 15 ఏళ్ల వయసులో సాధించాను. ఈజీగా బతికేయొచ్చు.. హైదరాబాద్ ఈజ్ గ్రేట్ సిటీ. ఇక్కడ పేద, గొప్ప తేడా లేకుండా ఎవరైనా ఈజీగా బతికేయొచ్చు. ప్రతి ఒక్కరినీ ఆదరించే గొప్పగుణం ఈ సిటీకి ఉంది. రంజాన్, న్యూ ఇయర్‌కి హైదరాబాద్‌లోనే ఉండాలనుకున్నా బిజీ షెడ్యూల్‌తో వీలుపడదు. గతేడాది మాత్రం రంజాన్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకునే అవకాశం దక్కింది. నా చిన్నప్పటికీ ఇప్పటికీ సిటీ పూర్తిగా మారిపోయింది. ఫ్యాషన్, ఎడ్యుకేషన్, కెరీర్ ఇలా ఏ రంగంలో చూసుకున్నా ముంబై, బెంగళూరుతో పోలిస్తే మన సిటీయే బెస్ట్ ఆప్షన్ అంటాను. ఇక ఫ్రెండ్స్‌తో కలసి ఓల్డ్ సిటీలోని రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసుకుని కారులోనే కూర్చుని తినడం సరదాగా ఉంటుంది. పిస్తా హౌస్‌లో హలీమ్ టేస్టీగా ఉంటుంది. నాకు మొబైల్స్ అంటే ఫుల్ క్రేజ్. ఏ మొబైల్ లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చినా అప్డేట్ అయిపోతాను. స్మార్ట్ గాడ్జెట్స్, స్పోర్ట్ కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువే. దీపికా అయితే ఓకే.. నా ఆటో బయోగ్రఫీ రాస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 2011లో మొదలుపెట్టాను. పూర్తి కావడానికి ఇంకో రెండేళ్లు పట్టొచ్చు. నా బయోపిక్ సినిమా తీస్తే అందులో నా రోల్ దీపికా పడుకొనే చేయాలని కోరుకుంటున్నాను. నాకైతే యాక్టింగ్ అంటే సిగ్గు. నేను సినిమాల్లోకి వచ్చే చాన్సే లేదు. ఇప్పుడు పిక్స్ స్కూల్ ఆప్ బాండింగ్ షూట్ కోసం మూడు రోజులు కష్టపడ్డాను. నాకు స్వతహాగా జేమ్స్ బాండ్ స్టైలంటే ఇష్టం. అందుకే ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను. ఒకటిన్నర నిమిషం నిడివున్న ఈ యాడ్‌లో బాండ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను, ఆయన ఆడవారి మనసులను దోచుకోవడం వెనుకున్న కిటుకులను నేర్పించే టీచర్‌గా నటించాను. ఇక నా లైఫ్ జేమ్స్‌బాండ్ మా వారే. -
తెలంగాణ లోగో ఎందుకు ధరించడం లేదు?
బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన టెన్నిస్ సానియా మీర్జా తెలంగాణ లోగోను ఎందుకు ధరించడం లేదు. లోగో ధరించి యూఎస్ ఓపెన్‌లో ఆడుంటే తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తంగా విస్తరించేదే కదా. సర్కారు ఔదార్యాన్ని కోట్ల రూపాయల్లో స్వీకరించిన ఈ క్రీడాకారిణికి లోగో ధరించాలనే నిబంధనను తెలంగాణా సర్కారు పెట్టలేదా? లేక సానియా నిరాకరించిందా? ఏదేమైనా క్రీడాకారుల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయడంలో తెలంగాణా క్రీడా శాఖ విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సమగ్ర క్రీడా పాలసీలు వస్తేనే ఇలాంటి పొరబాట్లను సవరించే వీలుంటుందని క్రీడా సంఘ బాధ్యుడు కె.పి.రావు అన్నారు. యూఎస్ ఓపెన్ లో తెలంగాణ లోగో ధరించకుండా సానియా ఆడడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి సాయం పొందినప్పుడు ఎందుకు లోగో ధరించలేదని ఆయన ప్రశ్నించారు. యూఎస్ ఓపెన్ టోర్నీ ఆరంభానికి ముందు సానియాకు రూ.కోటి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మిక్స్డ్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఆమెకు మరో కోటి రూపాయలు అందజేసింది. -
త్వరలో సానియాకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్‌లో టైటిల్ సాధించిన తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాను త్వరలో తెలంగాణ ప్రభుత్వం సన్మానించనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును మంగళవారం సానియా మీర్జా కలిసింది. భవిష్యత్‌లో సానియాకు ప్రభుత్వం తరఫున కావలసిన సహాయం అందిస్తామని కేసీఆర్ చెప్పారు. విజయాన్ని తెలంగాణ ప్రజలకు అంకితమివ్వడాన్ని కేసీఆర్ ప్రశంసించారు. -
అందుకే ఆ కృతజ్ఞత!
ప్రభుత్వం ఎంతో మద్దతిచ్చింది ‘ఏషియాడ్’కు దాదాపు దూరమైనట్లే ‘సాక్షి’తో సానియా మీర్జా సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యాక తొలి టైటిల్ (యూఎస్ ఓపెన్ మిక్స్డ్) గెలిచిన సానియా మీర్జాకు ఆదివారం నగరంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రొటోకాల్ ఉన్నతాధికారి అశ్వనీ కుమార్ ఆమెకు స్వాగతం పలికారు. సానియా రాకతో శంషాబాద్ విమానాశ్రయం ఒక్కసారిగా సందడిగా మారిపోయింది. విమానాశ్రయం నుంచి జాతీయ రహదారి వరకు ఆమెను ర్యాలీగా తీసుకెళ్లారు. తనకు లభించిన స్వాగతంతో ఉబ్బితబ్బిబ్బయిన సానియా ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... భారీ స్వాగతం: నేనూ దీనిని ఊహించలేదు. నా శ్రేయోభిలాషులు కొంత మంది కలిసి దీనిని ఏర్పాటు చేశారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత నేను మరో గ్రాండ్‌స్లామ్ నెగ్గడం పట్ల మా వాళ్లంతా ఆనందంగా ఉన్నారు. వాస్తవానికి యూఎస్ నుంచి నేను నేరుగా టోక్యో వెళ్లిపోవాల్సి ఉంది. అయితే వీసా సమస్య వల్ల రెండు రోజుల కోసం ఇక్కడికి రావాల్సి వచ్చింది. హైదరాబాద్ రాకపోతే బహుశా దీనిని మిస్ అయ్యేదాన్ని. మిక్స్డ్ టైటిల్ గెలవడం: నిజానికి నాకు, కారాకు మధ్య ఉన్న సమన్వయం, మా ఫామ్‌ను బట్టి మహిళల డబుల్స్‌లో మంచి అవకాశాలు ఉన్నాయని భావించాను. అయితే చాలా శ్రమించినా సెమీస్‌లోనే ఓడిపోయాం. మిక్స్‌డ్‌లో మాత్రం విజయం దక్కింది. వింబుల్డన్ తర్వాతే తొలి సారి బ్రూనో సోరెస్‌తో పరిచయమైంది. చర్చోపర్చల తర్వాత యూఎస్ ఓపెన్‌లో కలిసి ఆడదామని నిర్ణయించుకున్నాం. అందు కోసం రెండు వారాల పాటు ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేశాం. సోరెస్‌తో ఆడిన తొలి సారే టైటిల్ గెలుచుకోగలగడం ఆనందాన్నిచ్చింది. మరో గ్రాండ్‌స్లామ్ విజయం: మహిళల డబుల్స్‌తో పోలిస్తే మిక్స్‌డ్‌లో తరచూ నా భాగస్వాములు మారారు. కొన్ని సార్లు ఫలితం దక్కితే మరి కొన్ని సార్లు విఫలమయ్యాం. ఇది నాకు తొలి యూఎస్ ఓపెన్ టైటిల్ కాబట్టి ప్రత్యేకం. గతంలో రెండు సార్లు భారత భాగస్వామి (మహేశ్ భూపతి)తో గ్రాండ్‌స్లామ్ నెగ్గితే ఈ సారి విదేశీయుడితో జత కట్టాను. ఇక వింబుల్డన్ ఒకటే మిగిలింది. కానీ అప్పటి వరకు సోరెస్‌తో కొనసాగుతానో లేదో చెప్పలేను. అన్నట్లు... 2003లో జూనియర్ విభాగంలో వింబుల్డన్ కూడా గెలిచాను. కాబట్టి నా ఖాతాలో నాలుగు స్లామ్ టైటిల్స్ ఉన్నట్లే లెక్క (సరదాగా)! తెలంగాణకు అంకితమనే ప్రకటన: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నికైన తర్వాత ఆడిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే నేను టైటిల్ సాధించగలిగాను. ముఖ్యమంత్రి నన్ను ఎంతో ప్రోత్సహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నగదు పురస్కారం నాకు యూఎస్ ఓపెన్‌కు ముందు శిక్షణ పొందేందుకు ఉపయోగపడింది. వివాదాల సమయంలో ప్రభుత్వం నాకు ఎంతో అండగా నిలిచింది. ఆ కృతజ్ఙతతోనే... గెలిచాక నా మనసులో మాటను బయట పెడుతూ తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చా. ఆసియా క్రీడల్లో పాల్గొనడం: ఈ ఈవెంట్లో నేను పాల్గొనే అవకాశాలు దాదాపు లేనట్లే చెప్పగలను. కావాలని తప్పుకునే ఆలోచన నాకు లేదు. అయితే ఈ నెల 15 నుంచి పాన్ పసిఫిక్ ఓపెన్ (జపాన్), ఆ తర్వాత 27 నుంచి చైనా ఓపెన్ ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో గేమ్స్ జరుగుతున్నాయి. పై రెండు టోర్నీల్లో ఆడకుంటే నా పాయింట్లలో చాలా తేడా వస్తుంది. వచ్చే నెలలో సింగపూర్‌లో జరిగే అతి పెద్ద టోర్నీ (టాప్-8) డబ్లూటీఏ ఫైనల్స్‌లో నేను పాల్గొనాలంటే నా ఖాతాలో తగినన్ని పాయింట్లు ఉండాలి. నేను పాల్గొనేదీ, లేనిదీ అధికారికంగా ఏఐటీఏ ప్రకటించాల్సిన విషయమే అయినా...నా సమస్యలు, పరిమితులు నాకున్నాయి. ఇప్పటికే కొంత మంది తప్పుకోవడంతో మన మెడల్ అవకాశాలు కూడా తగ్గాయి. అయితే తుది నిర్ణయం నా చేతుల్లో లేదు. దేశం కోసం నేను అవసరమని సమాఖ్య భావిస్తే పునరాలోచిస్తానేమో..! -
'రాజధాని విషయంలో మా జోక్యముండదు'
-
'తెలంగాణ అంబాసిడర్ సానియాపై స్పందించను'
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఆయన మంత్రి వర్గం ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో వెంకయ్య మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి కూర్చుంటే చాలా వివాదాలు పరిష్కారమవుతాయని తెలిపారు. రుణమాఫీలో కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తాయని చెప్పారు. బ్రిక్స్ సమావేశాలు, యూపీఎస్పీ నిబంధనలు, రైలు ఛార్జీలు వంటి పలు అంశాలల్లో కేంద్రాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం సెల్ప్ గోల్ చేసుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్, ఇతర పక్షాలు తమ ఓటమిని జీర్ణించుకోలేకే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులైన క్రీడాకారిణి సానియా మీర్జా అంశంపై స్పందించేందుకు వెంకయ్య నిరాకరించారు. విభజన ద్వారా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే సదరు ఉద్యోగులు కమిటీకి విన్నవించుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు. -
ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేస్తారా?
హైదరాబాద్: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించడాన్ని వీహెచ్‌పీ నేతలు కేశవరాజు, సురేందర్‌రెడ్డి ఖండించారు. 52 రోజుల కేసీఆర్ పాలనలో కేవలం ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేయడం దారుణమని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియాను నియమించడాన్ని బీజేపీ నేతలు తప్పుబట్టారు. ఎవరెస్ట్ అధిరోహించిన మలావత్ పూర్ణ అనే తెలంగాణ బాలికకు కేవలం 25 లక్షలు మాత్రమే ఇచ్చి, సానియా మీర్జాకు మాత్రం కోటి రూపాయలు ఇవ్వడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 1956 తర్వాత తెలంగాణకు వచ్చిన వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేని ప్రభుత్వానికి.. సానియాకు ఇవ్వడానికి కోటి రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయని లక్ష్మణ్ నిలదీశారు. ఆమె ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని, బతుకమ్మ ఆడలేదని గుర్తుచేశారు. -
కన్నీళ్లుపెట్టిన సానియా మీర్జా
హైదరాబాద్: తనపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కలత చెందింది. తన భారతీయతను శంకించడంపై తీవ్ర ఆవేదన చెందుతున్నానని ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో వాపోయింది. ఎన్నిసార్లు తన భారతీయతను నిరూపించుకోవాలని ప్రశ్నించింది. మరే దేశంలోనైనా ఇలా జరగుతుందా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పెళ్లైన తర్వాత కూడా భారత్‌కోసమే ఆడానని, ఎన్నో పతకాలు సాధించానని తెలిపింది. తాను సిసలైన హైదరాబాదీనని, తనను బయటి వ్యక్తిగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నానని సానియా స్పష్టం చేశారు. వందేళ్లకు పైగా తమ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోందని గుర్తుచేశారు. విమర్శలను పట్టించుకోనని, తెలంగాణ గౌరవాన్ని నిలబెడతానని స్పష్టం చేసింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల క్రీడాకారులెవరూ అసంతృప్తి లేరని తెలిపింది. తన స్నేహితురాలు, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కు న్యాయం జరుగుతుందని పేర్కొంది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పాకిస్థాన్ కోడలు తప్ప మరెవ్వరూ దొరకలేదా అని బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమానికి సానియా చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు విమర్శించారు. -
'ఆమె దేశానికే గర్వకారణం'
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పుబడుతుంటే.. అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాత్రం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. సానియా లాంటి టెన్నిస్ స్టార్ మనదేశంలో ఉండడం గర్వించదగ్గ విషయమని జవదేకర్ అన్నారు. మనదేశానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ టెన్నిస్ లో స్వశక్తితో ఆమె విజయాలు సాధించిందని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పాకిస్థాన్ కోడలు తప్ప మరెవ్వరూ దొరకలేదా అని బీజేపీ జాతీయ కార్యదర్శి, అసెంబ్లీలో బీజేపీ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
'ఊపిరున్నంత వరకు అలాగే ఉంటా'
హైదరాబాద్: తాను భారతీయురాలినేనని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేసింది. తన ఊపిరున్నంత వరకు ఇండియన్ గానే ఉంటానని తెలిపింది. తనను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా తనను నియమించడంపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేయడం తనను బాధించిందని పేర్కొంది. ఈ విషయంపై ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయింది. తనను భారతీయురాలు కాదంటే ఒప్పుకోనని కుండబద్దలు కొట్టింది. తనపై బయటివ్యక్తి(అవుట్‌సైడర్) ముద్ర వేయడాన్ని సానియా ఖండించింది. తన కుటుంబం శతాబ్దకాలంగా హైదరాబాద్ లో నివసిస్తోందని తెలిపింది. అనవసర విషయాలపై సమయం వృధా చేయకుండా రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి పెడితే మంచిదని సూచించింది. సానియాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల బీజేపీ అభ్యంతరం చేసింది. పాకిస్థాన్ కోడలిని అంబాసిడర్ గా నియమించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.