'ఆమె దేశానికే గర్వకారణం'
న్యూఢిల్లీ: టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడాన్ని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు తప్పుబడుతుంటే.. అదే పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాత్రం ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. సానియా లాంటి టెన్నిస్ స్టార్ మనదేశంలో ఉండడం గర్వించదగ్గ విషయమని జవదేకర్ అన్నారు.
మనదేశానికి ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ టెన్నిస్ లో స్వశక్తితో ఆమె విజయాలు సాధించిందని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా పాకిస్థాన్ కోడలు తప్ప మరెవ్వరూ దొరకలేదా అని బీజేపీ జాతీయ కార్యదర్శి, అసెంబ్లీలో బీజేపీ నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.