'తెలంగాణ అంబాసిడర్ సానియాపై స్పందించను'
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ఆయన మంత్రి వర్గం ఎవరి ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో వెంకయ్య మాట్లాడుతూ... ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలిసి కూర్చుంటే చాలా వివాదాలు పరిష్కారమవుతాయని తెలిపారు. రుణమాఫీలో కూడా అన్ని రాష్ట్రాలకు వర్తించే నిబంధనలే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వర్తిస్తాయని చెప్పారు.
బ్రిక్స్ సమావేశాలు, యూపీఎస్పీ నిబంధనలు, రైలు ఛార్జీలు వంటి పలు అంశాలల్లో కేంద్రాన్ని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం సెల్ప్ గోల్ చేసుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్, ఇతర పక్షాలు తమ ఓటమిని జీర్ణించుకోలేకే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని అన్నారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా నియమితులైన క్రీడాకారిణి సానియా మీర్జా అంశంపై స్పందించేందుకు వెంకయ్య నిరాకరించారు. విభజన ద్వారా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే సదరు ఉద్యోగులు కమిటీకి విన్నవించుకోవచ్చని వెంకయ్యనాయుడు సూచించారు.