sania mirza tennis academy
-
చిన్నారులకు మార్టినా పాఠాలు
సానియా అకాడమీలో సందడి సాక్షి, హైదరాబాద్ : టెన్నిస్ దిగ్గజం మార్టినా నవ్రతిలోవా నగరంలో సందడి చేసింది. ‘డబ్ల్యూటీఏ-ఆసియా పసిఫిక్ టెన్నిస్ మాస్టర్ క్లాసెస్’ ప్రచారంలో భాగంగా వర్ధమాన క్రీడాకారులకు ఆమె పాఠాలు నేర్పించింది. సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు చిన్నారులతో ముచ్చటించిన మార్టినా, అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగేందుకు తీవ్రంగా శ్రమించాలంటూ వారిలో స్ఫూర్తి నింపింది. ఈ సందర్భంగా డబుల్స్ వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జాను ప్రత్యేకంగా అభినందించిన మార్టినా... డబ్ల్యూటీఏ తరఫున జ్ఞాపికను అందజేసింది. ఈ కార్యక్రమంలో డబ్ల్యూటీఏ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ మెలీసా పైన్, భారత యువ టెన్నిస్ క్రీడాకారిణి కర్మణ్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రార్థనకు టైటిల్
ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: టాప్ సీడ్ ప్రార్థన తొంబరే తన కెరీర్లో రెండో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్ ఫైనల్లో ఆమె ఢిల్లీకి చెందిన రిషిక సుంకరపై గెలిచింది. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ ప్రార్థన 6-7, (4/7), 6-4, 6-3తో నాలుగో సీడ్ రిషికపై చెమటోడ్చి నెగ్గింది. ఒక రకంగా ప్రార్థన... డబుల్స్‌లో రిషిక జోడి చేతిలో తనకెదురైన పరాజయానికి బదులు తీర్చుకుంది. శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిషిక-షర్మదా బాలు జంట... ప్రార్థన-శ్వేతా రాణా జోడిని కంగుతినిపించిన సంగతి తెలిసిందే. -
నిధి, భువన ముందంజ
ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ మొయినాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో నిధి చిలుముల, కాల్వ భువన ముందంజ వేశారు. ఇక్కడి సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో మంగళవారం జరిగిన సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో కాల్వ భువన 7-5, 6-4తో అర్షి బాసిన్‌పై, నిధి 6-0, 6-0తో సంస్కృతి రంజన్‌పై విజయం సాధించారు. ఇతర పోటీల్లో తింబరే 6-1, 6-1తో సృష్టి స్లారియాపై, శర్మదా బాలు 6-3, 4-6, 6-1తో జెనీ పటేల్‌పై, నటాషా పల్హా 6-1, 6-0తో సాహన్ శెట్టిపై, సంచన షరాన్ పాల్ 3-6, 6-1, 6-4తో వన్షిక సాహ్నేపై, రిషిక రవీంద్రన్ 6-2, 6-1తో తాన్వీ బోస్పై, ఇతీ మహిత 5-7, 6-1, 6-2తో స్నేహ పడమటపై, దామిని 3-6, 7-6 (7/0), 6-0తో ఉజ్జిని ప్రీతిపై, అమృత 6-2, 6-0తో ప్రీతి శ్రీనివాసన్‌పై, రిషిక సుంకర 6-2, 6-4తో చామంతిపై, శ్వేత రాణా 6-7 (3/7), 6-2, 6-3తో వైదేహి చౌదరిపై గెలుపొందారు. -
ఫైనల్లో శ్రీవత్స, దేదీప్య
ఎస్‌ఎమ్‌టీఏ-ఐటా టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ) - ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో రాతకొండ శ్రీవత్స, యెడ్ల కుశాల్ అండర్-14 బాలుర విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించారు. మొయినాబాద్‌లోని ఎస్ఎమ్టీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీవత్స 6-3, 6-2తో మెంగ రోహిత్‌పై గెలుపొందగా, కుశాల్ 6-4, 6-2తో తెయ్జో ఓజెస్ను కంగుతినిపించాడు. అండర్-12 బాలుర సెమీస్‌లో ఆర్యన్ జవేరి 7-5, 6-1తో దేవ్ జెవియాపై, మహేశ్ మహాపాత్ర 6-2, 4-6, 6-2తో ఎస్.భూపతిపై విజయం సాధించారు. బాలికల అండర్-12 సెమీస్‌లో రిచా చోగులే 4-6, 6-0, 6-0తో శ్రేయ కుదుమాలపై గెలుపొందగా, రేష్మ మారురి 6-1, 6-2తో ధ్రుతి కపూర్‌పై నెగ్గింది. బాలికల అండర్-14 సెమీఫైనల్లో సాయి దేదీప్య 6-1, 6-4తో అమినేని శివానిపై, ధరణ ముదలియార్ 7-6 (7/5), 6-1తో రితిక బాజర్పై విజయం సాధించారు. -
నిధి, సౌజన్య ముందంజ
ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) మహిళల చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 10 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గల ఈ టోర్నీలో బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో నిధి 7-6 (7/5), 6-4 స్కోరుతో మన రాష్ట్రానికే చెందిన కాల్వ భువనపై విజయం సాధించింది. సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న నిధి, క్వార్టర్స్‌లో మూడో సీడ్ రిషిక సుంకరతో తలపడుతుంది. ప్రిక్వార్టర్స్‌లో రిషిక 6-2, 6-2తో అమృత ముఖర్జీని ఓడించింది. మరో ఏపీ అమ్మాయి సౌజన్య భవిషెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్లో ఆమె 4-6, 6-2, 6-1 తేడాతో నాలుగో సీడ్ జపాన్ క్రీడాకారిణి ఎమి ముతగుచిని ఓడించింది. క్వార్టర్స్‌లో ఆమె రుతుజ భోంస్లేను ఎదుర్కొంటుంది. ఇతర క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో అంకితా రాణాతో ప్రేరణ బాంబ్రీ, నటాషా పల్హాతో ప్రార్థన తోంబరే తలపడతారు. డబుల్స్‌లో ఏపీకి చెందిన సౌజన్య భవిషెట్టి జోడి క్వార్టర్స్‌కు చేరగా, అక్షర ఇస్కా-తీర్థ ఇస్కా జంటకు పరాజయం ఎదురైంది. సౌజన్య-షర్మద 6-0, 6-0తో ముతగుచి-నునోమె (జపాన్)ను చిత్తు చేయగా, శ్వేత రాణా-రిషిక సుంకర జంట 6-4, 6-1తో ఇస్కా అక్షర-ఇస్కా తీర్థలపై నెగ్గింది. -
ఉత్సాహంగా...ఉల్లాసంగా..!
సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్ఎంటీఏ) తొలిసారి అగ్రశ్రేణి ఆటగాళ్ల శిక్షణకు వేదికగా మారింది. నగర శివార్లలోని మొయినాబాద్‌లో గల ఈ అకాడమీలో భారత పురుషుల జట్టు సభ్యులకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ ప్రారంభమైంది. ప్రస్తుతం వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణా కేంద్రంగానే ఉన్న అకాడమీ భవిష్యత్తులో మరిన్ని కీలక ఈవెంట్లకు ప్రధాన వేదిక అయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే ఇండియన్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ (ఐటీపీఏ) తాజాగా శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. భారత సింగిల్స్ టాప్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, డబుల్స్ స్పెషలిస్ట్ రోహన్ బొపన్న, యువ క్రీడాకారులు పురవ్ రాజా, సాకేత్ మైనేని, శ్రీరామ్ బాలాజీ, సనమ్ సింగ్ తదితరులు ఇందులో పాల్గొంటున్నారు. రెండు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. ఆటగాళ్ల వ్యక్తిగత కోచ్‌లు ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తుండగా...సానియా మీర్జా అకాడమీ స్పెషల్ ట్రైనర్ రాబర్ట్ బలార్డ్ భారత ఆటగాళ్లకు కూడా ప్రత్యేకంగా సహకరించనున్నారు. కొత్త సీజన్లో జరిగే తొలి టోర్నీ చెన్నై ఓపెన్‌కు ముందు ఈ సన్నాహకాలు ఉపయోగపడతాయని ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై ఓపెన్ తర్వాత జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌కు కూడా సోమ్‌దేవ్, బొపన్న సిద్ధమవుతున్నారు. మరో వైపు సానియా మీర్జా డబుల్స్ భాగస్వామి కారా బ్లాక్ (జింబాబ్వే) కూడా ఇక్కడే సాధన చేస్తోంది. వచ్చే ఏడాది అంతా బ్లాక్‌తోనే కలిసి బరిలోకి దిగనున్నట్లు సానియా ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 15నుంచి ఎస్ఎంటీఏలో భారత ఫెడరేషన్ కప్ జట్టుకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని కూడా నిర్వహించనుంది.