cock Racing
-
బరి తెగించారు
అమలాపురం, న్యూస్‌లైన్ :పందెం కోళ్లు కదనరంగంలో కత్తులు దూశాయి. లక్షల రూపాయలు క్షణాల్లో పందెంరాయుళ్ల చేతులు మారాయి. ఓడినవారు ఓడుతుండగా, కొత్తవారు వచ్చి చేరారు. వందల మంది పందెంరాయుళ్లు.. వేలమంది వీక్షకులతో జిల్లా నలుమూలలా సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జరుగుతున్న ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆయా ప్రాంతాల్లో నాలుగైదు బరులు ఏర్పాటు చేసి, చుట్టూ బారికేడ్లు, టెంట్లు వేసి మరీ పందాలు నిర్వహిస్తున్నారు. కోనసీమ, మెట్ట, ఏజెన్సీ అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా కోడిపందాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వీటికి పారిశ్రామికవేత్తలు,భూస్వాములు, రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఒకవైపు పందాలు నిర్వహించే ప్రాంతాలు పెరగడం, నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో కనుమతోపాటు ముక్కనుమనాడు కూడా పందాలు నిర్వహించనున్నారు. దీంతో ఈ ఏడాది పందాలు రికార్డు స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. మలికిపురంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, తుని మండలం రాజుల కొత్తూరులో ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, అల్లవరం మండలం గోడిలంకలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పందాలను తిలకించారు. మలికిపురం, సఖినేటిపల్లి, కాట్రేనికోన, ఐ.పోలవరం కాజులూరు తదితర మండలాల్లోని సగానికి పైగా గ్రామాల్లో పందాలు జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ కొలువుదీరిన కాకినాడ సమీపంలో ఉన్న తిమ్మాపురం, కొవ్వాడ, అచ్చంపేటల్లో పందాలు జోరుగా సాగాయి. రాజమండ్రి అర్బన్ ఎస్పీ కార్యాలయానికి సమీపంలో ఉన్న దివాన్‌చెరువు, పాలచర్లలో కూడా పందాలు యథేచ్ఛగా సాగాయి. దీనినిబట్టి పోలీసులు పందాలకు ఏ స్థాయిలో గేట్లు బార్లా తెరిచారో అర్థం చేసుకోవచ్చు. కోడిపందాలతోపాటు గుండాట, పేకాటలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో రోజుకు రూ.30 కోట్ల చొప్పున గడచిన రెండు రోజుల్లో సుమారు రూ.60 కోట్ల మేర పందాలు జరిగాయి. మలికిపురం, ఆత్రేయపురం మండలం తాడిపూడిల్లో రోజుకు రూ.1.50 కోట్ల చొప్పున పందాలు జరుగుతున్నాయి. ఐ.పోలవవరం మండలం కేశనకుర్రు, కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట-తిమ్మాపురం సరిహద్దు ప్రాంతం, సామర్లకోట మండలం వేట్లపాలెం, అల్లవరం మండలం గోడిలంకల్లో రోజుకు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ పందాలు జరుగుతున్నాయి. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, ఎన్.కొత్తపల్లి; అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం; మామిడికుదురు మండలం మగటపల్లి, గోగన్నమఠం, అప్పనపల్లి; మలికిపురం మండలం గుడిమెళ్లంక, లక్కవరం; సఖినేటిపల్లి మండలం అప్పన రామునిలంక, గుడిమూల, సఖినేటిపల్లి, సఖినేటిపల్లిలంక; రాజోలు మండలం చింతలపల్లి, శివకోడు; కాజులూరు మండలం జగన్నాధగిరి, ఆర్యావటం, కుయ్యేరు; కాట్రేనికోన మండలం చెయ్యేరు, గెద్దనాపల్లి, దొంతుకుర్రు; ఆత్రేయపురం మండలం వెలిచేరు, ర్యాలి; మండపేట మండలం మారేడుబాక; కపిలేశ్వరం మండలంలోని గోదావరిలంక గ్రామాల్లోను; రావులపాలెం మండలం వెదిరేశ్వరం, లక్ష్మీపోలవరం; కె.గంగవరం మండలం పాణింగిపల్లి, మల్లవరం, బాలాంత్రం, మసకపల్లి; తుని మండలం రాజుల కొత్తూరులో పందాలు జోరుగా జరిగాయి. సందట్లో సడేమియా అన్నట్టు మలికిపురం, మామిడికుదురు మండలాల్లో అశ్లీల నృత్యాలు సైతం యథేచ్ఛగా నిర్వహించారు. పట్టించుకోని పోలీసులు కళ్లముందే ఇంత జరుగుతున్నా పోలీసులు షరా మామూలుగానే వదిలేశారు. అయితే ఉనికిని చాటుకునేందుకు అక్కడక్కడ మొక్కుబడి దాడులు చేసి పందెం నిర్వాహకులను, కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. కె.గంగవరం మండలం మల్లవరంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పది కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రూ.4,500 నగదు మాత్రమే స్వాధీనం చేసుకోవడం విశేషం. గండేపల్లి మండలం మురారిలో రెండు పుంజులను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో ఐదుగురిని, ఐదు పుంజులతోపాటు రూ.1,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజోలు సర్కిల్లో అశ్లీల నృత్యాల జోరు అమలాపురం టౌన్ : రాజోలు పోలీసు సర్కిల్లో కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున సాగాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. అర్ధరాత్రి దాటేసరికి ఇది కాస్తా అశ్లీల నృత్యాల మేళాగా మారింది. ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులకు జంకూగొంకూ లేకుండా పోయింది. రాజోలు నియోజకవర్గం కరవాక, తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటపాలెం, శంకరగుప్తం తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగాయి. గుండాటలకు భారీ వేలం పాట కోడిపందాలతో రూ.కోట్లు చేతులు మారుతుంటే అక్కడే గుండాటలకు భారీగా వేలం పాటలు నిర్వహించారు. పండగ మూడు రోజులూ గుండాట నిర్వహించేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పాడుకుని అనుమతి పొందారు. అక్రమంగా లిక్కర్, నాటుసారా దుకాణాల నిర్వహణకు కూడా రూ.లక్షల్లో వేలం పాటలు సాగాయి. ప్రభుత్వం లెసైన్సు జారీ చేసినట్టు పందాల నిర్వాహకులే వీటికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. కోనసీమలో దాదాపు 20 చోట్ల కోడిపందాలు నిర్వహించిన ప్రదేశాల్లో రూ.2 కోట్ల వరకూ గుండాట, మద్యం దుకాణాల నిర్వహణకు సొమ్ము వేలం పాటల రూపంలో చేతులు మారింది. -
కత్తులు దూస్తున్నాయ్..కట్టలు తెగుతున్నాయ్
భీమవరం, న్యూస్‌లైన్ : సంక్రాంతి కోడిపందేలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో సోమవారం మొదటిగా 12:20 గంటలకు ముహూర్తపు పందెంగా భీమవరం మండలం వెంపలో పందాలు ప్రారంభించారు. భీమవరం పట్టణ సమీపంలోని ఆశ్రమంతోట, ఆకివీడు మండలం అయి భీమవరంలో మధ్యాహ్నం నుంచి పందాలు మొదలయ్యాయి. డెల్టాలో వీటిని ప్రధాన పందేలుగా చెప్పవచ్చు. పోలీసులు నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్న మరికొందరు సాయంత్రం వరకు బరిలు సిద్ధం చేసుకుంటూ కనిపించారు. గతంలో అయి భీమవరంలో మొదటగా కోడి పందాలు ప్రారంభమయ్యేవి. ఈ ఏడాది వెంపలో ప్రారంభమవడం ప్రత్యేకం. పోటె త్తిన పందెం రాయుళ్లు కోడి పందాల బరిల వద్ద పందెం రాయుళ్లు పోటెత్తారు. పందెం కోళ్లతో బరిలకు చేరుకొని తమ పుంజులను రంగంలోకి దింపారు. వీరితో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, ప్రజలతో బరిలు కిటకిటలాడాయి. వాహనాలు బారులు తీరాయి. తొలిరోజు ప్రజాప్రతినిధులు, సినీ పరిశ్రమ ప్రముఖులు హాజరుకాలేదు. మంగళవారం నుంచి వీరి తాకిడి ఉండవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘కోట్లా’ట డెల్టాలోని పందేల బరిల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అయిభీమవరం, ఆశ్రమంతోట, వెంపలో పెద్ద మొత్తంలో పందాలు జరిగాయి. వెంపలో ఒక పందేన్ని రూ.12 లక్షలకు నిర్వహించినట్లు సమాచారం. ఇదే బరిలో రూ.2 లక్షల నుంచి పందేలను నిర్వహించారు. మంగళవారం పందేల జోరు మరింత పెరగవచ్చని అంచనా. పందెం రాయుళ్లు రూ. 1,000, రూ. 500 నోట్లను చేత పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ పందేలు కాస్తున్నారు. మరికొందరు కోసు పందేలు పడుతూ పందెం రాయుళ్ల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కిటకిటలాడుతున్న లాడ్జీలు డెల్టాలో జరుగుతున్న కోడి పందేలు తిలకించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పందెంరాయుళ్లతో భీమవరంలోని లాడ్జీలు కిటకిటలాడుతున్నాయి. పందెం రాయుళ్ల వాహనాలన్నీ భీమవరం వైపు దారితీయడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఓ సెంటర్ నుంచి మరో సెంటర్ దాటాలంటే సుమారు 45 నిమిషాల పైనే సమయం పడుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పండగ ముసుగులో జూదం కోడిపందాలు మాటున గుండాట, పేకాట జోరుగా సాగుతోంది. భీమవరం పట్టణంతో పాటు ఉండి, కాళ్ల, వీరవాసరం, పాలకోడేరు, తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పేకాటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే భీమవరం పరిసర ప్రాంతాల్లో పేకాటా, గుండాట, కోతాటలతో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. భీమవరం ఆశ్రమం తోటలో ఏర్పాటుచేసిన గుండాట కౌంటర్లో పట్టణానికి చెందిన ఓ యువకుడు రూ.83 వేలు పోగొట్టుకుని లబోదిబోమన్నాడు. అదేవిధంగా పట్టణంలోని పలు లాడ్జీలు, ప్రైవేటు అతిథి గృహాలు పేకాట స్థావరాలుగా మారాయి. కాళ్ల మండలంలోని ఓ గ్రామంలో పేకాట లక్షల్లో జరుగుతోంది. రాత్రింబవళ్లు పేకాట నిర్వహించేందుకు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. గుంటూరు, తిరుపతి, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, యానాం తదితర ప్రాంతాల నుంచి జూదగాళ్లు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 2 గంటలు.. 20 పందేలు జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలంలో కోడి పందేలు యథేచ్ఛగా జరిగాయి. శ్రీనివాసపురంలోని బరిలో మధ్యాహ్నం 3 గంటలకు పందేలు ప్రారంభమయ్యాయి. కేవలం మూడు గంటల వ్యవధిలో 20 పందాలు జరిగాయి. ఇక్కడ లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. బుట్టాయగూడెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో పందెంరాయుళ్లు వచ్చారు. కోళ్లు కత్తులు దువ్వగా.. నోట్ల కట్టలు తెగిపడ్డాయి. రాబోయే మూడు రోజులు పందేలు హోరాహోరీగా జరుగుతాయని, పలువురు ప్రముఖులు రానున్నారని నిర్వాహకులు అంటున్నారు. గ్రామంలో మరో బరి మంగళవారం ప్రారంభం కానుంది. నెత్తురోడి.. ప్రాణం వీడి.. పాలకోడేరు రూరల్: నిన్న మొన్నటి వరకు సకల రాజభోగాలను అనుభవించిన పుంజులు కదన రంగంలో నెత్తురోడుతున్నాయి. హోరాహోరీగా జరిగిన పోరులో ఓడి ప్రాణం వీడుతున్నాయి. పాలకోడేరు మండలంలోని వేండ్ర, కొండేపూడి, శృంగవృక్షంలో పెద్దెత్తున కోడి పందేలు జరిగాయి. బరిల వద్ద పేకాట, గుండాట విచ్చలవిడిగా సాగాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. కొండేపూడి బరిలో పుంజులు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. రూ.లక్షల్లో పందేలు లింగపాలెం : లింగపాలెం మండలంలో భారీ ఎత్తున కోడిపందేలు జరిగాయి. కలరాయనగూడెం, ధర్మాజీగూడెం, ములగలంపాడులో పందేలు తిరునాళ్లను తలపించాయి. మధ్యాహ్నం 1 గంట నుంచి పందేలు ప్రారంభమయ్యాయి. పుంజులు నువ్వా..నేనా అన్నట్లు తలపడ్డాయి. జిల్లా నుంచే కాక పొరుగు జిల్లాల నుంచి వందలాది మంది పందెంరాయుళ్లు తరలివచ్చారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఆయా గ్రామాల్లో రోడ్లు పందెం రాయుళ్లతో నిండిపోయాయి. ఒక్కో పందెం రూ. లక్ష నుంచి రూ. లక్షా 50 వేలు వరకు జరిగినట్లు సమాచారం. గుండాట.. కోతాట పెరవలి : కోడి పందేల బరిల వద్ద గుండాట, కోతాట యథేచ్ఛగా సాగుతున్నాయి. పెరవలి మండలంలో ముక్కామల, ఉసులుమర్రులో పం దేలు నువ్వానేనా అన్నట్లు సాగాయి. దీంతో పాటు గుండాట, కో తాటలో లక్షలాది రూపాయలు చేతు లు మారుతున్నాయి. మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పందెంగాళ్లు మద్యం మత్తులో తూగుతూ జూద క్రీడల్లో పాల్గొంటూ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. బరిలు రె‘ఢీ’ ఇరగవరం : ఇరగవరం మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేలకు బరిలు సిద్ధమవుతున్నాయి. కె.ఇల్లింద్రపర్రు, తూర్పు విప్పర్రు, రేలంగి, అయినపర్రు గ్రామాలు పందాలకు వేదికగా మారాయి. కె.ఇల్లింద్రపర్రులో భారీ స్థాయిలో బరిని సోమవారం సిద్ధం చేశారు. బరి చుట్టూ తాళ్లతో ఫెన్సింగ్, పందెం రాయుళ్లు పోటీలు తిల కించేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. నాలుగురోజు ల పాటు మండలంలోని పలువురు ప్ర ముఖులు ఇక్కడే మ కాం వేయనున్నారు. భారీ ఏర్పాట్లు పాలకొల్లు: పాలకొల్లు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోడి పందేల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో బరిలు సిద్ధం చేస్తున్నారు. కొన్ని బరిల్లో పందేలు ప్రారంభమయ్యాయి. పాలకొల్లు మండలంలో పూలపల్లి, లంకలకోడేరు. వడ్లవానిపాలెం, వెలివెల, శివదేవుని చి క్కాల, యలమంచిలి మండలంలో యల మంచిలి, బూరుగుపల్లి, కొంతేరు, కాజ, వడ్డిలంక , పో డూరు మండలంలో పలు గ్రామాల్లో పందేలు మొదలయ్యాయి. హోరాహోరీ తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో 12 చోట్ల పందాలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం రూరల్, పెంటపాడు ప్రాంతాల్లో హోరాహోరీగా సాగుతున్నాయి. మంగళవారం నుంచి పందాల జోరు మరింత పెరగనుంది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినా తొలిరోజు నిర్వహించలేదు. హైద్రాబాద్, కడప, ఒంగోలు, జంగారెడ్డిగూడెం ప్రాంతాలతో పాటు పండగ సంబరాల కోసం సింగపూర్; అమెరికా నుంచి వచ్చిన వారు పందాలపై ఆసక్తి చూపుతున్నారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి వద్ద తోటలో పందాల జోరు