బరి తెగించారు | cock racing in Amalapuram | Sakshi
Sakshi News home page

బరి తెగించారు

Published Thu, Jan 16 2014 1:20 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM

బరి తెగించారు - Sakshi

బరి తెగించారు

అమలాపురం, న్యూస్‌లైన్ :పందెం కోళ్లు కదనరంగంలో కత్తులు దూశాయి. లక్షల రూపాయలు క్షణాల్లో పందెంరాయుళ్ల చేతులు మారాయి. ఓడినవారు ఓడుతుండగా, కొత్తవారు వచ్చి చేరారు. వందల మంది పందెంరాయుళ్లు.. వేలమంది వీక్షకులతో జిల్లా నలుమూలలా సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జరుగుతున్న ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆయా ప్రాంతాల్లో నాలుగైదు బరులు ఏర్పాటు చేసి, చుట్టూ బారికేడ్లు, టెంట్లు వేసి మరీ పందాలు నిర్వహిస్తున్నారు. కోనసీమ, మెట్ట, ఏజెన్సీ అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా కోడిపందాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వీటికి పారిశ్రామికవేత్తలు,భూస్వాములు, రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఒకవైపు పందాలు నిర్వహించే ప్రాంతాలు పెరగడం, నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో కనుమతోపాటు  ముక్కనుమనాడు కూడా పందాలు నిర్వహించనున్నారు. దీంతో ఈ ఏడాది పందాలు రికార్డు స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది.
 
  మలికిపురంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, తుని మండలం రాజుల కొత్తూరులో ఎమ్మెల్యే రాజా అశోక్‌బాబు, అల్లవరం మండలం గోడిలంకలో రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పందాలను తిలకించారు.
 
   మలికిపురం, సఖినేటిపల్లి, కాట్రేనికోన, ఐ.పోలవరం కాజులూరు తదితర మండలాల్లోని సగానికి పైగా గ్రామాల్లో పందాలు జరుగుతున్నాయి.
 
  జిల్లా ఎస్పీ కొలువుదీరిన కాకినాడ సమీపంలో ఉన్న తిమ్మాపురం, కొవ్వాడ, అచ్చంపేటల్లో పందాలు జోరుగా సాగాయి. రాజమండ్రి అర్బన్ ఎస్పీ కార్యాలయానికి  సమీపంలో ఉన్న దివాన్‌చెరువు, పాలచర్లలో కూడా పందాలు యథేచ్ఛగా సాగాయి. దీనినిబట్టి పోలీసులు పందాలకు ఏ స్థాయిలో గేట్లు బార్లా తెరిచారో అర్థం చేసుకోవచ్చు.
 
  కోడిపందాలతోపాటు గుండాట, పేకాటలు జోరుగా సాగుతున్నాయి.
  జిల్లాలో  రోజుకు రూ.30 కోట్ల చొప్పున గడచిన రెండు రోజుల్లో సుమారు రూ.60 కోట్ల మేర పందాలు జరిగాయి.
 
  మలికిపురం, ఆత్రేయపురం మండలం తాడిపూడిల్లో రోజుకు రూ.1.50 కోట్ల చొప్పున పందాలు జరుగుతున్నాయి.
 
   ఐ.పోలవవరం మండలం కేశనకుర్రు, కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట-తిమ్మాపురం సరిహద్దు ప్రాంతం, సామర్లకోట మండలం వేట్లపాలెం, అల్లవరం మండలం గోడిలంకల్లో రోజుకు రూ.50 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ పందాలు జరుగుతున్నాయి.
 
  ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, ఎన్.కొత్తపల్లి; అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం; మామిడికుదురు మండలం మగటపల్లి, గోగన్నమఠం, అప్పనపల్లి; మలికిపురం మండలం గుడిమెళ్లంక, లక్కవరం; సఖినేటిపల్లి  మండలం అప్పన రామునిలంక, గుడిమూల, సఖినేటిపల్లి, సఖినేటిపల్లిలంక; రాజోలు మండలం చింతలపల్లి, శివకోడు; కాజులూరు మండలం జగన్నాధగిరి, ఆర్యావటం, కుయ్యేరు; కాట్రేనికోన మండలం చెయ్యేరు, గెద్దనాపల్లి, దొంతుకుర్రు; ఆత్రేయపురం మండలం వెలిచేరు, ర్యాలి; మండపేట మండలం మారేడుబాక; కపిలేశ్వరం మండలంలోని గోదావరిలంక గ్రామాల్లోను; రావులపాలెం మండలం వెదిరేశ్వరం, లక్ష్మీపోలవరం; కె.గంగవరం మండలం పాణింగిపల్లి, మల్లవరం, బాలాంత్రం, మసకపల్లి; తుని మండలం రాజుల కొత్తూరులో పందాలు జోరుగా జరిగాయి. సందట్లో సడేమియా అన్నట్టు మలికిపురం, మామిడికుదురు మండలాల్లో అశ్లీల నృత్యాలు సైతం యథేచ్ఛగా నిర్వహించారు. 
 
 పట్టించుకోని పోలీసులు
 కళ్లముందే ఇంత జరుగుతున్నా పోలీసులు షరా మామూలుగానే వదిలేశారు. అయితే ఉనికిని చాటుకునేందుకు అక్కడక్కడ మొక్కుబడి దాడులు చేసి పందెం నిర్వాహకులను, కోళ్లను అదుపులోకి తీసుకున్నారు. కె.గంగవరం మండలం మల్లవరంలో పోలీసులు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. పది కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ రూ.4,500 నగదు మాత్రమే స్వాధీనం చేసుకోవడం విశేషం. గండేపల్లి మండలం మురారిలో రెండు పుంజులను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాట్రేనికోన మండలం గెద్దనపల్లిలో ఐదుగురిని, ఐదు పుంజులతోపాటు రూ.1,250 నగదు స్వాధీనం చేసుకున్నారు.
 
 రాజోలు సర్కిల్‌లో 
 అశ్లీల నృత్యాల జోరు
 అమలాపురం టౌన్  : రాజోలు పోలీసు సర్కిల్‌లో కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున సాగాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. అర్ధరాత్రి దాటేసరికి ఇది కాస్తా అశ్లీల నృత్యాల మేళాగా మారింది. ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులకు జంకూగొంకూ లేకుండా పోయింది. రాజోలు నియోజకవర్గం కరవాక, తూర్పుపాలెం, కేశనపల్లి, పడమటపాలెం, శంకరగుప్తం తదితర గ్రామాల్లో మంగళవారం రాత్రి అశ్లీల నృత్య ప్రదర్శనలు జరిగాయి.
 
 గుండాటలకు భారీ వేలం పాట
 కోడిపందాలతో రూ.కోట్లు చేతులు మారుతుంటే అక్కడే గుండాటలకు భారీగా వేలం పాటలు నిర్వహించారు. పండగ మూడు రోజులూ గుండాట నిర్వహించేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పాడుకుని అనుమతి పొందారు. అక్రమంగా లిక్కర్, నాటుసారా దుకాణాల నిర్వహణకు కూడా రూ.లక్షల్లో వేలం పాటలు సాగాయి. ప్రభుత్వం లెసైన్సు జారీ చేసినట్టు పందాల నిర్వాహకులే వీటికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. కోనసీమలో దాదాపు 20 చోట్ల కోడిపందాలు నిర్వహించిన ప్రదేశాల్లో రూ.2 కోట్ల వరకూ గుండాట, మద్యం దుకాణాల నిర్వహణకు సొమ్ము వేలం పాటల రూపంలో చేతులు మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement