అమలాపురం రూరల్ :తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని నిలిపేందుకే ప్రభుత్వం సంక్రాంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తోందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బండార్లంక హైస్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను రాజప్ప ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ప్రతి ఇంటా సంక్రాంతి సందడి వెల్లివిరిసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 1.30 కోట్ల మందికి రూ.340 కోట్ల వ్యయంతో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో నిత్యావసరాలను అందజేశామన్నారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వితంతు, వికలాంగుల పింఛన్లను 12వ తేదీలోగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
పశుసంపదను వృద్ధి చేసేందుకు సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పోటీలు నిర్వహించిందన్నారు. జెడ్పీ హైస్కూల్లో రంగవల్లుల పోటీలు, మేలు జాతి పశువుల ప్రదర్శన, బొమ్మల కొలువు, సంక్రాంతి పిండివంటలను డిప్యూటీ సీఎం, ఇన్‌చార్జి కలెక్టర్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలసి తిలకించారు. చిన్నారులకు రాజప్ప భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయవెంకటలక్ష్మి, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, ఎంపీడీఓ ఎ.శారారాణి, తహశీల్దార్ నక్కా చిట్టిబాబు, కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు చింతా శంకరమూర్తి పాల్గొన్నారు.
సాంస్కృతిక వారసత్వం నిలిపేందుకే సంక్రాంతి
Published Wed, Jan 14 2015 12:12 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
Advertisement