పండగ మాటున దండుడు దందా
అమలాపురం : ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లినవారు సంక్రాంతి వచ్చిందంటే చాలు..స్వస్థలాలకు వచ్చేస్తుంటారు. ఇలా వచ్చేవారిలో సగం మంది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచే వస్తారు. విశాఖ, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారూ ఉంటారు. సంక్రాంతి రద్దీని రవాణా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు టిక్కెట్ల అమ్మకాలు నిలిపి, కృత్రిమ డిమాండ్ సృష్టించి, రేట్లు పెంచేస్తుండగా ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో టిక్కెట్ ధరను 30 శాతం పెంచి ప్రయాణికుల జేబులను కొల్లగొడుతోంది. హైదరాబాద్ నుంచి అమలాపురం 17 వరకు ప్రత్యేక బస్సులు వేశారు. సాధారణ రోజుల్లో డీలక్సు బస్సు టిక్కెట్ ధర రూ.495 కాగా, ప్రత్యేకం పేరుతో రూ. 685 వరకు వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ టిక్కెట్ రూ.540 ఉండగా ఇప్పుడు రూ.790 చొప్పున వసూలు చేస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నాలకు వేసిన ప్రత్యేక బస్సుల టిక్కెట్ ధరలు సైతం 30 శాతం చొప్పున పెంచారు. రైల్వేలో ఇటీవల తత్కాల్ టిక్కెట్‌కు డిమాండ్‌ను బట్టి ధర పెంచుకునే సౌకర్యం కల్పించి, నాజూకుగా ప్రయాణికులపై భారం వేస్తున్నారు.
ఎన్ని ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులు వేసినా చాలని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపై ఆధారపడక తప్పదు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు పండుగ రోజుల్లో టిక్కెట్ల అమ్మకాలు దాదాపు నిలిపివేశారు. రద్డీ ఎక్కువ ఉన్న రోజుల్లో టిక్కెట్ ధరను రూ.రెండు వేల వరకు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి 14న బుధవారం భోగి, 15న గురువారం సంక్రాంతి, 16న శుక్రవారం కనుమ, 17న శనివారం ముక్కనుమ వచ్చాయి. హైదరాబాద్‌లో ఉండే కొందరు శనివారం రాత్రే బయలుదేరి రాగావారి నుంచి ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్‌కు రూ.1,200 వసూలు చేశారు. ఇక 13న మంగళవారం రాత్రి టిక్కెట్ ధర రూ.1,500 వరకు పలికేలా ఉంది. శనివారంతో పండుగ ముగుస్తున్నా మర్నాడు ఆదివారం కావడంతో ఆ రోజే తిరిగి వెళ్లనున్నారు.
ప్రయాణం ఖర్చే అధికం
జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, అమలాపురం తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు టిక్కెట్ రూ.600 నుంచి రూ.700 వరకు ఉండగా, సంక్రాంతి రోజుల్లో రూ.1,500 వరకు పెంచేస్తున్నారు. తుని వంటి సుదూర ప్రాంతాలకైతే ధర రూ.రెండు వేల వరకు ఉంటోంది. పండుగ నాడు వేసుకునే కొత్తదుస్తులు, పిండి వంటల ఖర్చుకన్నా ప్రయాణాల ఖర్చే ఎక్కువ అవుతోంది. అయినా స్వస్థలంపై, స్వజనంపై ఉండే మమకారంతో వారు ఎన్ని వ్యయప్రయాసలకైనా సిద్ధపడుతుంటారు. అదే అవకాశంగా ఆర్టీసీ, ప్రైవేట్ బస్ యాజ మాన్యాలు సొమ్ములు దండుకుంటున్నాయి. ఈ ఏడాది పండుగల సమయంలో ప్రత్యేక బస్సుల టిక్కెట్లు ధర పెంచమని, ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధర పెంచితే పర్మిట్‌ను రద్దు చేస్తామని ఇటీవల రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘరావు చేసిన హెచ్చరిక గాలిలో కలిసిపోయింది.