కృష్ణా జిల్లా కీసర, పొట్టిపాడు టోల్‌ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు
సాక్షి, అమరావతి బ్యూరో/కంచికచర్ల/హైదరాబాద్: సంక్రాంతి పండుగకు వారాంతపు సెలవులు కలిసిరావటంతో హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు శనివారం ఏపీలోని తమ సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లయితే ఇసుకేస్తే రాలనంతగా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు.. సొంత వాహనాల్లో బయల్దేరే వారితో జాతీయ రహదారుల్లోనూ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. దీంతో వివిధ టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ మేర బారులుతీరుతూ కనిపిస్తున్నాయి. ఇటీవల అమలులోకి తెచ్చిన ఫాస్టాగ్ వ్యవస్థవల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ కొంతవరకు తగ్గినప్పటికీ ఇంకా అనేకచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను నియమించారు. కొన్నిచోట్ల అదనపు గేట్లను ఏర్పాటుచేశారు. ప్లాజాల నిర్వాహకులు కూడా అదనపు సిబ్బందిని రంగంలోకి దించారు. ఆది, సోమవారాల్లో వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ రెండు వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. గత ఏడాదికంటే రెట్టింపు బస్సులను సిద్ధంచేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 700 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి, భీమవరం, విశాఖపట్నం వైపునకు 500 బస్సులను తిప్పుతున్నారు. ఇక పండుగ తర్వాత 16 నుంచి 21 వరకు తిరుగు ప్రయాణికుల కోసం మరో 800 బస్సులను నడపనున్నారు. బస్సులు లేవని ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించే అవకాశం లేకుండా చూస్తున్నామని కృష్ణా రీజియన్ ఆర్టీసీ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్ తెలిపారు.
తొలిసారిగా ఆర్టీసీ 40 % రాయితీ
మునుపెన్నడూ లేనివిధంగా ఆర్టీసీ తొలిసారిగా ప్రయాణికులకు 40శాతం రాయితీ ఇస్తోంది. సంక్రాంతి సీజన్‌లో హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నంత రద్దీ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే బస్సుల్లో ఉండదు. ఇది ఆర్టీసీకి నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఇలా వెళ్లే స్పెషల్ బస్సుల్లో ప్రయాణికులకు సాధారణ చార్జీలో 40 శాతం రాయితీ ఇవ్వాలని సంకల్పించింది.
ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి
హైదరాబాద్–విజయవాడ మార్గంలో పండుగ సమయాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. టోల్ నిర్వాహకులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. దీంతో వాహనదారులు అవస్థలు పడాల్సి వస్తోంది.
–వంశీ, నెల్లూరు
ఇబ్బంది పడ్డాం
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్నాం. మా వాహనానికి ఫాస్టాగ్ ఉంది. అయినా టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు ఏమాత్రం ఫాస్ట్‌గా వెళ్లలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం.
–నర్సింహా, విజయవాడ
ఈనెల 15 నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి
ప్రతి వాహనానికి జనవరి 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ఉపరితల, రవాణా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత ఆ గడువును డిసెంబరు 15వ తేదీకి వాయిదా వేశారు. అనంతరం వాహనదారులకు మరోసారి గడువిచ్చారు. 2020 జనవరి 15వ తేదీ నుంచి ప్రతి వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులపై 65 శాతం వాహనదారులు ఫాస్టాగ్ వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్రంలో ఇప్పటివరకు ఫాస్టాగ్‌ల అమ్మకాలు 1.50 లక్షలు దాటాయి. ఈ నెల 14వ తేదీ వరకు హైబ్రీడ్ విధానం అమల్లో ఉంటుంది. జనవరి 15వ తేదీ నుంచి ప్రతి టోల్‌ప్లాజాలో క్యాష్ లైన్ కేవలం ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఇక రాష్ట్ర రహదారులపైనా అమలు
జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనే కాకుండా రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ గతంలోనే ఆదేశాలిచ్చింది. అయితే, రాష్ట్ర రహదారులపై ఇప్పటికీ ఈ విధానం అమలు కావడం లేదు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేస్తామని రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ టోల్‌గేట్లలో ఆర్‌ఎఫ్‌ఐడీ యంత్రాలు పెట్టేందుకు అయ్యే వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది.
హోటళ్లలోనూ ఫాస్టాగ్‌ల అమ్మకాలు
రాష్ట్రంలో 22 బ్యాంకుల ద్వారా 5 లక్షల ఫాస్టాగ్‌లను విక్రయానికి అందుబాటులో ఉంచినట్లు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు తెలిపారు. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల్లో ఫాస్టాగ్‌ల అమ్మకాలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పారు. జనవరి 15వ తేదీ తర్వాత టోల్‌ప్లాజాల్లో క్యాష్‌లైన్ ఒక్కటి మాత్రమే ఉంటుందని, తర్వాత అది కూడా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టోల్‌ప్లాజాల వద్దే కాకుండా జాతీయ రహదారుల వెంట ఉన్న హోటళ్లలోనూ ఫాస్టాగ్‌లు విక్రయించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment