శనివారం రాత్రి ఎల్‌బీ నగర్ వద్ద బస్సుల కోసం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్న ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లాంటి పెద్ద పండుగల సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను తిప్పుతుంటుంది. హైదరాబాద్ నుంచి ఏపీ వైపు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఆర్టీసీ, ఏపీ ఆర్టీసీ హైదరాబాద్–విజయవాడ మధ్య వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులు తిప్పుతూ ఉంటాయి. చార్జీ కూడా 50 శాతం మేర పెంచటం సహజమే. పండుగకు ముందు హైదరాబాద్ నుంచి విజయవాడవైపు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ బస్సులు కిక్కిరిసిపోతాయి.
కానీ ఆ బస్సులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేటప్పుడు ప్రయాణికుల్లేక ఖాళీగా వస్తాయి. ఈ విషయంలో ప్రతిసారి డీజిల్ ఖర్చులను ఆర్టీసీ మీదే వేసుకోవాల్సి వస్తోంది. దీనికి విరుగుడుగా ఏపీ అధికారులు ఈసారి కొత్త పంథా అనుసరించారు. హైదరాబాద్‌కు బస్సులు ఖాళీగా కాకుండా, కనీసం డీజిల్ ఖర్చులైనా వచ్చేలా ఆలోచించారు. ఇందుకు సాధారణ టికెట్ ధరను 40 శాతం మేర తగ్గించేశారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్లేవారు దీనికి ఆకర్షితులై ఆర్టీసీ బస్సెక్కుతారనేది వారి ఆలోచన. అది ఫలిస్తోంది కూడా.. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య మెరుగ్గానే ఉంటోంది. ప్రైవేటు బస్సులు, అద్దె కార్లు, జీపులు, వ్యాన్లలో వచ్చేవారు, రైలుకు వెళ్లాలనుకునేవారు ఈ బస్సుల వైపు మళ్లుతున్నారు. పండుగ సమయంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటున్నా.. టికెట్ ధరను తగ్గించటంతో డీజిల్ ఖర్చుకు సరిపడా టికెట్ రెవెన్యూ వస్తోంది.
టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి ఇలా..
అదే టీఆఎస్‌ఆర్టీసీ మాత్రం విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు వచ్చే చార్జీలను తగ్గించలేదు. దీంతో ఈ బస్సు ఎక్కాల్సిన వారు కూడా ఏపీ బస్సుల వైపు మళ్లడంతో ఇవి ఖాళీగా రావాల్సి వస్తోంది. వీటి ధరను కూడా తగ్గించాలని కొన్ని డిపోల మేనేజర్లు కోరినా.. దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఉన్నతాధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ఫలితంగా.. విజయవాడవైపు వెళ్లేటప్పుడు కిక్కిరిసి వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బస్సులు, తిరుగు ప్రయాణంలో మాత్రం ఖాళీగా వస్తున్నాయి.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే టీఎస్‌ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సు విజయవాడ బస్టాండు ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. అందులో హైదరాబాద్‌కు టికెట్ ధర రూ.372గా ఉంది. అదే సమయంలో ఏపీఎస్‌ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు కూడా వచ్చి ఆగింది. అందులో హైదరాబాద్‌కు టికెట్ ధర రూ.223 ఉంది. ఇంకేముంది.. ప్రయాణికులందరూ ఏపీ బస్సు ఎక్కి కూర్చున్నారు. తెలంగాణ బస్సేమో ఖాళీగా బయల్దేరింది.
ప్రయాణికులను ఆకర్షిస్తేనే బస్సులకు ఆదరణ ఉంటుంది. లేకుంటే ప్రైవేటు వాహనాల నుంచి పోటీ పడలేక ఆర్టీసీ చతికిల పడాల్సిందే. సంక్రాంతి లాంటి రద్దీ సమయంలో ఈ సూత్రాన్ని మరింత జాగ్రత్తగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏపీ అధికారులు ఆ సూత్రాన్ని పక్కాగా అనుసరిస్తున్నారు. దీన్ని తెలంగాణ అధికారులు పట్టించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment