Deputy Chief nimmakayala chinna rajappa
-
అధికార పార్టీకి అవినాష్ మకిలి
మరోసారి బట్టబయలైన టీడీపీ అంతర్గత పోరు తనపై కుట్ర జరుగుతోందనుకుంటున్న రాజప్ప (లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :అవినాష్ దేవ్‌చంద్ర...గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచిన పేరది. హోంమంత్రిత్వశాఖను పర్యవేక్షి స్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువును, మానవహక్కుల సంఘం అంతర్జాతీయ చైర్మన్‌ను అంటూ అవినాష్ పాల్పడిన అక్రమాలు ఈ వారం తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. పలు ప్రాంతాల్లో అమాయకులకు పదవుల ఎరవేసి లక్షలు గుంజి, వారు తిరిగి అడిగిన పాపానికి చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో రావడంతో కలకలం రేగింది. నిందితుడితో రాజప్పకు బంధుత్వం లేదని విచారణ అనంతరం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ స్పష్టం చేసినా ఈ ఘటనతో అధికారపార్టీ ప్రతిష్ట బజారునపడిందని చెప్పొచ్చు. పెద్దాపురంలో బచ్చు ఫౌండేషన్‌ను సందర్శించిన సందర్భంలో అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించి ఆధారాలు లేవంటూ ఆనక వదిలేసిన దగ్గర నుంచి అవినాష్‌ను అరెస్టుచేసే వరకు పోలీసుల తీరు సందేహాస్పదంగానే నిలిచింది. పెద్దాపురంలో అదుపులోకి తీసుకున్నప్పుడే పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదంటున్నారు. అతడిపై నమోదైన కేసులు తేలికపాటివే కావడం కూడా ప్రజల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అతడిని కాపాడటంలో ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్న చందంగా జరుగుతున్న పరిణామాలు పోలీసు వ్యవస్థకే మచ్చతెచ్చిపెట్టారుు. ప్రాథమికంగా పెద్దాపురం సీఐ, ఎస్ఐలకు చార్జిమెమోలు ఇచ్చిన ఎస్పీ ఇలాంటి ఉదంతాల్లో పోలీసు ప్రతిష్ట మంటగలసి పోకుండా పోలీసుల వ్యవహార శైలిలోనే మార్పునకు కృషి చేయాల్సి ఉంది. జిత్తులమారి అవినాష్ దౌర్జన్యాలను చూసి జిల్లా ప్రజలు పక్కలో బాంబు పేలినంత భయానికి గురయ్యారు. ఈ మాయలోడి మోసాలకు ఎందరో బలవుతున్నా చాప కింద నీరులా అతని అక్రమా సాగారుు. నాలుగు రోజుల తరువాత అవినాష్ పోలీసులకు లొంగిపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అవినాష్ తొలినుంచీ హోంమంత్రి బంధువునని చెప్పుకోవటంతో ఈ కేసులో రాజప్ప కేంద్ర బిందువు అయిపోయారు. అమలాపురంలో అసాంఘిక శక్తులకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్న వ్యవహారంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ గత వారం చర్చనీయాంశమైంది. తాజాగా అవినాష్ ఉదంతం జిల్లా టీడీపీ నేతల మధ్య నడుస్తున్న మరో వార్ ను తెర మీదకు తెచ్చింది. హోం మంత్రి రాజప్ప.. అవినాష్ వ్యవహారం తనపై కొందరు చేస్తున్న కుట్రేనని, అది కూడా కాకినాడ కేంద్రంగా సొంత పార్టీ నుంచే నడుస్తోందని భావిస్తున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ బురదను ఒకరిపై ఒకరు జల్లుకునేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బడ్జెట్‌తో ఆశాభంగం రాష్ట్ర బడ్జెట్‌ను జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై జిల్లాలో పలు వర్గాలు పెదవి విరిచాయి. జిల్లాకు నిర్దిష్టంగా ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టుగానే బడ్జెట్ కేటాయింపులున్నాయని సామాన్యులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ గోదావరి పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటోంది. ముఖ్యమంత్రి సహా ఉభయగోదావరి జిల్లాల మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, పైడికొండల మాణిక్యాలరావు వందల కోట్లు కేటాయిస్తున్నామంటూ ఊరూవాడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష దగ్గర నుంచి ఇదేరకంగా ప్రచారం చేస్తున్నారు. తీరా బడ్జెట్లో కేటాయింపులు చూస్తే బాబు సర్కార్ చెప్పేదొకటి, చేసేదొకటి అన్నదానికి అద్దం పడుతోంది. రూ.1638 కోట్లతో పుష్కరాల పనులు చేస్తున్నామని ప్రభుత్వం ఘనతగా చెప్పుకొన్న యనమల బడ్జెట్లో రూ.200 కోట్లతో మమ అనిపించారు. బిల్లులు వస్తాయా, రావా అనే అనుమానంతో పుష్కరాల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి. కలెక్టర్ అరుణ్‌కుమార్, ప్రత్యేకాధికారి మురళి సమీక్షలపై సమీక్షలు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో పనులు మొదలు కావడంలేదు. నెలకొకసారి ముఖ్యమంత్రి నేరుగా సమీక్షిస్తారని చెప్పినా ప్రగతి కనిపించకపోవడం పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులకు ఏర్పాట్లు ముందుగా చేయగలుగుతారా అనే సందేహం కలుగుతోంది. రైతులకు, డ్వాక్రా మహిళలకు నిరాశ బడ్జెట్లో రుణమాఫీకి నిధులు భారీగా కేటాయిస్తారనుకుని ఎదురు చూసిన రైతులు, డ్వాక్రా మహిళలు నిరాశ చెందారు. కాకినాడ పోర్టు విస్తరణ, ఎల్ఎన్జీ టెర్మినల్, జీఎంఆర్ పోర్టు వంటి పారిశ్రామికీకరణకు ఇచ్చిన ప్రాధాన్యం రైతు, మధ్యతరగతికి ఇవ్వలేదనే ఆవేదన ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఉద్యోగం లేని వారికి నిరుద్యోగభృతి అన్ని చంద్రబాబు బడ్జెట్లో కేటాయింపుల వైపు కన్నెత్తిచూడకపోవడం జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకు తీరని ఆవేదన మిగిల్చింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు వరించనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి బోస్‌ను ఎంపిక చేశారు. ఆయన ఎంపిక జిల్లాలో పార్టీ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపింది. పదవులను తృణప్రాయంగా త్యజించిన బోస్ ఈ నెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని చంద్రబాబు బీసీలలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంకు గతంలో మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండా తన సామాజికవర్గ నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండడంపై తెలుగుతమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. బాబు నిర్ణయం టీడీపీ బీసీ నేతల్లో నిస్తేజాన్ని నింపింది. -
హార్స్ షో అదుర్స్
పెద్దాపురం :జిల్లా చరిత్రలో తొలిసారిగా పెద్దాపురంలో రాష్ట్రస్థాయి హార్స్ షో అద్వితీయంగా జరిగింది. హార్స్ లవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ హార్స్ షో ఆండ్ ఈవెంట్స్ కాంపిటీషన్ నిర్వహించారు. గతంలో సామర్లకోటలో హార్స్ షో నిర్వహించడానికి సన్నాహాలు జరిగినా పోలీసులు అడ్డుకోవడంతో అర్థాంతరంగా నిలిచిపోయాయి. రెండేళ్ల తరువాత పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ప్రోత్సాహంతో హార్స్ లవర్స్ అసోసియేషన్ సారథులు కె. వెంకటరెడ్డి, అనిల్‌రెడ్డి, ఏఎస్వీఎస్ రామరాజు ఆధ్వర్యంలో ఈ హార్స్ షో చేపట్టారు. ఏడీబీ రోడ్డు ఇండిస్ట్రియల్ ఏరియాలోని ఖాళీ స్థలంలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహభరిత వాతావరణంలో ఈ షో నిర్వహించారు. గుర్రాల ప్రదర్శనను ఉదయం ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా కాకినాడ ఎంపీతోట నరసింహం హాజరయ్యారు. బహుమతి ప్రదానోత్సవానికి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 70 గుర్రాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ గుర్రాల అందాల పోటీలు జరిగాయి. ఆడ, మగ విభాగాల్లో అందాల పోటీలతో పాటు, గుర్రాల రేస్ కూడా నిర్వహించారు. మగ గుర్రాల అందాల పోటీలో ఏఎస్వీఎస్ రామరాజు (కాకినాడ) గుర్రానికి ప్రథమ, ఎస్. రవికుమార్ (విజయవాడ) గుర్రానికి ద్వితీయ, డి.సత్యనారాయణమూర్తి (పిఠాపురం తాటిపర్తి) గుర్రానికి తృతీయ, బాబా (పసలపూడి) గుర్రానికి నాలుగో బహుమతి లభించాయి. ఆడగుర్రాల అందాల పోటీల్లో కాకినాడకు చెందిన అనిల్‌రెడ్డి (ప్రథమ), విశాఖపట్నానికి చెందిన శ్రీకాంత్ (ద్వితీయ), అమలాపురం డివిజన్ ఉప్పలగుప్తానికి చెందిన బుజ్జి (తృతీయ), అనపర్తికి చెందిన లక్ష్మీ శ్రీనివాస్ నాలుగో బహుమతులను కైవసం చేసుకున్నారు. పిల్లల విభాగంలో కాకినాడకు చెందిన అనిల్‌రెడ్డి (ప్రథమ), తణుకుకి చెందిన నరసింహారావు( ద్వితీయ), విజయవాడకు చెందిన ఎస్కే షాజహాన్( తృతీయ), గోకవరానికి చెందిన దాసరి తమ్మన్నదొర నాలుగో బహుమతిని గెలుచుకున్నారు. గుర్రాల పరుగుపోటీల్లో కాకినాడకు చెందిన కె. వీరబాబు (ప్రథమ), వన్నెపూడికి చెందిన వి.మణి(ద్వితీయ), రాజమండ్రికి చెందిన పందలపాక అప్పారావు (తృతీయ) బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప బహుమతి ప్రదానం చేశారు. అపూర్వ జనాదరణ జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన గుర్రాల అందాల పోటీలు తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జిల్లా నలుమూలలు నుంచి పెద్ద ఎత్తున కార్లలో తరలివచ్చి పలువురు పోటీలను తిలకించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఎమ్మెల్సీ భాస్కరరామారావు, ఎంపీ తోట నరసింహం, మున్సిపల్ ఆర్డీ రాజేంద్రప్రసాద్ ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్‌లోనే ఉండి పోటీలను ఆసక్తిగా తిలకించారు. ఎంపీ తోట కాసేపు గుర్రపుస్వారీతో సందడి చేశారు. -
సాంస్కృతిక వారసత్వం నిలిపేందుకే సంక్రాంతి
అమలాపురం రూరల్ :తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని నిలిపేందుకే ప్రభుత్వం సంక్రాంతిని రాష్ట్ర పండగగా నిర్వహిస్తోందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. బండార్లంక హైస్కూల్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలను రాజప్ప ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ప్రతి ఇంటా సంక్రాంతి సందడి వెల్లివిరిసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 1.30 కోట్ల మందికి రూ.340 కోట్ల వ్యయంతో చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో నిత్యావసరాలను అందజేశామన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వితంతు, వికలాంగుల పింఛన్లను 12వ తేదీలోగా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. పశుసంపదను వృద్ధి చేసేందుకు సంప్రదాయ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పోటీలు నిర్వహించిందన్నారు. జెడ్పీ హైస్కూల్లో రంగవల్లుల పోటీలు, మేలు జాతి పశువుల ప్రదర్శన, బొమ్మల కొలువు, సంక్రాంతి పిండివంటలను డిప్యూటీ సీఎం, ఇన్చార్జి కలెక్టర్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలసి తిలకించారు. చిన్నారులకు రాజప్ప భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అధికారి జయవెంకటలక్ష్మి, ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, ఎంపీడీఓ ఎ.శారారాణి, తహశీల్దార్ నక్కా చిట్టిబాబు, కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు చింతా శంకరమూర్తి పాల్గొన్నారు.