మరోసారి బట్టబయలైన టీడీపీ అంతర్గత పోరు
తనపై కుట్ర జరుగుతోందనుకుంటున్న రాజప్ప
(లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి ప్రతినిధి) :అవినాష్ దేవ్‌చంద్ర...గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా నిలిచిన పేరది. హోంమంత్రిత్వశాఖను పర్యవేక్షి స్తున్న ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప బంధువును, మానవహక్కుల సంఘం అంతర్జాతీయ చైర్మన్‌ను అంటూ అవినాష్ పాల్పడిన అక్రమాలు ఈ వారం తీవ్ర సంచలనానికి కారణమయ్యాయి. పలు ప్రాంతాల్లో అమాయకులకు పదవుల ఎరవేసి లక్షలు గుంజి, వారు తిరిగి అడిగిన పాపానికి చిత్రహింసలకు గురిచేసిన దృశ్యాలు ప్రసారమాధ్యమాల్లో రావడంతో కలకలం రేగింది.
నిందితుడితో రాజప్పకు బంధుత్వం లేదని విచారణ అనంతరం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ స్పష్టం చేసినా ఈ ఘటనతో అధికారపార్టీ ప్రతిష్ట బజారునపడిందని చెప్పొచ్చు. పెద్దాపురంలో బచ్చు ఫౌండేషన్‌ను సందర్శించిన సందర్భంలో అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించి ఆధారాలు లేవంటూ ఆనక వదిలేసిన దగ్గర నుంచి అవినాష్‌ను అరెస్టుచేసే వరకు పోలీసుల తీరు సందేహాస్పదంగానే నిలిచింది. పెద్దాపురంలో అదుపులోకి తీసుకున్నప్పుడే పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదంటున్నారు. అతడిపై నమోదైన కేసులు తేలికపాటివే కావడం కూడా ప్రజల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అతడిని కాపాడటంలో ‘తిలాపాపం తలా పిడికెడు’ అన్న చందంగా జరుగుతున్న పరిణామాలు పోలీసు వ్యవస్థకే మచ్చతెచ్చిపెట్టారుు. ప్రాథమికంగా పెద్దాపురం సీఐ, ఎస్‌ఐలకు చార్జిమెమోలు ఇచ్చిన ఎస్పీ ఇలాంటి ఉదంతాల్లో పోలీసు ప్రతిష్ట మంటగలసి పోకుండా పోలీసుల వ్యవహార శైలిలోనే మార్పునకు కృషి చేయాల్సి ఉంది.
జిత్తులమారి అవినాష్ దౌర్జన్యాలను చూసి జిల్లా ప్రజలు పక్కలో బాంబు పేలినంత భయానికి గురయ్యారు. ఈ మాయలోడి మోసాలకు ఎందరో బలవుతున్నా చాప కింద నీరులా అతని అక్రమా సాగారుు. నాలుగు రోజుల తరువాత అవినాష్ పోలీసులకు లొంగిపోవటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అవినాష్ తొలినుంచీ హోంమంత్రి బంధువునని చెప్పుకోవటంతో ఈ కేసులో రాజప్ప కేంద్ర బిందువు అయిపోయారు. అమలాపురంలో అసాంఘిక శక్తులకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్న వ్యవహారంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య కోల్డ్ వార్ గత వారం చర్చనీయాంశమైంది. తాజాగా అవినాష్ ఉదంతం జిల్లా టీడీపీ నేతల మధ్య నడుస్తున్న మరో వార్ ను తెర మీదకు తెచ్చింది. హోం మంత్రి రాజప్ప.. అవినాష్ వ్యవహారం తనపై కొందరు చేస్తున్న కుట్రేనని, అది కూడా కాకినాడ కేంద్రంగా సొంత పార్టీ నుంచే నడుస్తోందని భావిస్తున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ఈ బురదను ఒకరిపై ఒకరు జల్లుకునేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
బడ్జెట్‌తో ఆశాభంగం
రాష్ట్ర బడ్జెట్‌ను జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై జిల్లాలో పలు వర్గాలు పెదవి విరిచాయి. జిల్లాకు నిర్దిష్టంగా ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టుగానే బడ్జెట్ కేటాయింపులున్నాయని సామాన్యులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ గోదావరి పుష్కరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటోంది. ముఖ్యమంత్రి సహా ఉభయగోదావరి జిల్లాల మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు, పైడికొండల మాణిక్యాలరావు వందల కోట్లు కేటాయిస్తున్నామంటూ ఊరూవాడా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. పుష్కరాలపై చంద్రబాబు సమీక్ష దగ్గర నుంచి ఇదేరకంగా ప్రచారం చేస్తున్నారు.
తీరా బడ్జెట్‌లో కేటాయింపులు చూస్తే బాబు సర్కార్ చెప్పేదొకటి, చేసేదొకటి అన్నదానికి అద్దం పడుతోంది. రూ.1638 కోట్లతో పుష్కరాల పనులు చేస్తున్నామని ప్రభుత్వం ఘనతగా చెప్పుకొన్న యనమల బడ్జెట్‌లో రూ.200 కోట్లతో మమ అనిపించారు. బిల్లులు వస్తాయా, రావా అనే అనుమానంతో పుష్కరాల పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్‌లు ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి. కలెక్టర్ అరుణ్‌కుమార్, ప్రత్యేకాధికారి మురళి సమీక్షలపై సమీక్షలు నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో పనులు మొదలు కావడంలేదు. నెలకొకసారి ముఖ్యమంత్రి నేరుగా సమీక్షిస్తారని చెప్పినా ప్రగతి కనిపించకపోవడం పుష్కరాలకు వచ్చే లక్షలాది భక్తులకు ఏర్పాట్లు ముందుగా చేయగలుగుతారా అనే సందేహం కలుగుతోంది.
రైతులకు, డ్వాక్రా మహిళలకు నిరాశ
బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులు భారీగా కేటాయిస్తారనుకుని ఎదురు చూసిన రైతులు, డ్వాక్రా మహిళలు నిరాశ చెందారు. కాకినాడ పోర్టు విస్తరణ, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్, జీఎంఆర్ పోర్టు వంటి పారిశ్రామికీకరణకు ఇచ్చిన ప్రాధాన్యం రైతు, మధ్యతరగతికి ఇవ్వలేదనే ఆవేదన ఆ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఉద్యోగం లేని వారికి నిరుద్యోగభృతి అన్ని చంద్రబాబు బడ్జెట్‌లో కేటాయింపుల వైపు కన్నెత్తిచూడకపోవడం జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులకు తీరని ఆవేదన మిగిల్చింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు వరించనుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శెట్టిబలిజ సామాజికవర్గం నుంచి బోస్‌ను ఎంపిక చేశారు.
ఆయన ఎంపిక జిల్లాలో పార్టీ కేడర్‌లో ఉత్తేజాన్ని నింపింది. పదవులను తృణప్రాయంగా త్యజించిన బోస్ ఈ నెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాగా టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని చంద్రబాబు బీసీలలో శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యంకు గతంలో మాట ఇచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండా తన సామాజికవర్గ నేతకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండడంపై తెలుగుతమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు. బాబు నిర్ణయం టీడీపీ బీసీ నేతల్లో నిస్తేజాన్ని నింపింది.