సంప్రదాయ వేదికపై సంక్రాంతి వేడుక
అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : అధ్యాపకులు.... అభ్యాసాలు... పాఠాలు.. తరగతుల మధ్యే ఉండే ఆ విద్యార్థులు కాస్త ఆటవిడుపుగా గడిపారు. భట్లపాలెం బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భారతీయ సంప్రదాయం. తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి రంగవల్లులు తీర్చిదిద్దారు. భోగి మంటలు వేసి విద్యార్థులు నాలుగు రోజులు ముందుగానే పండుగ జరుపుకున్నారు. ఘుమఘుమలాడేలా పలు రకాల పిండివంటలు తయారు చేశారు.
గంగిరెద్దుల ఆటలు, హరిదాసు కీర్తనలు, ఎడ్లబండ్ల సవారీలతో విద్యార్థులు కేరింతలు కొట్టారు. ఎప్పుడూ ఫ్యాషన్ డ్రెస్‌ల్లో ఉండే ఇంజనీరింగ్ విద్యార్థులు పట్టు పావడాలు ధరించి, గోరింటాకు పెట్టుకుని, గాజులు గలగలలాడిస్తూ సంప్రదాయానికి అద్దం పట్టారు. ఈ ఉత్సవాలను విద్యాసంస్థల అధినేత బోనం కనకయ్య ప్రారంభించారు. ప్రిన్సిపాల్ జీఎంవీ ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.