సోమరసమూ! పాదరసమూ!!
పార్టీలు రెండు రకాలని, ఒకటి పొలిటికల్ (ఘన సదృశం), రెండోది నాన్-పొలిటికల్ (ద్రవ సదృశం) అని చెప్పుకున్నాం. రెండో తరహా కాక్టైల్స్గా విశ్వవిదితం. సాధారణంగా ఇవి సాయంత్రాల్లో మొదలు పెడతారు. ఎప్పుడు పూర్తవుతాయో ఎవరూ చెప్పలేరు! రకరకాల కారణాలతో, అకారణాలతో వీటిని నిర్వహిస్తారు. ఒకరిని స్వాగతించేందుకు. మరొకరికి వీడ్కోలు పలికేందుకు. పుట్టుక, పెళ్లి,చావు అన్నీ సందర్భాలే. కాక్‌టైల్స్‌కు అసందర్భమంటూ ఉండదు!
వీటిల్లో భోజనాలకు పెద్ద ప్రాధాన్యం ఉండదు. పార్టీల్లో ఫ్లేవర్ డిన్నర్లో గుబాళిస్తుందా? కాక్‌టైల్స్‌లో చిరుతిండ్లు వస్తుంటాయి. పార్టీలో ఒంపే స్కాచ్ బావున్నంతవరకూ ఆతిథ్యం ఇచ్చేవారు ఎలా ఉన్నా, ఎటువంటి ఇంగ్లిష్ మాట్లాడినా మేధావులకు పట్టింపు ఉండదు. అతిథులందరిలో సౌహార్ధ్రభావన వెల్లి విరుస్తుంది. అందరూ అందరిపట్లా చిరునవ్వులు చిందిస్తారు. ఒకరి మాటను మరొకరు మెచ్చుకుంటారు. అంతా శోభాయమానమే! కానీ చిత్రం, కొంతమంది ‘నికార్సయిన వ్యక్తుల’తో పార్టీలు విచిత్రంగా మారిపోతాయి. వీరు ఎవ్వరి అభిప్రాయాలతోనూ ఏకీభవించరు. ఈ కేటగిరీ ప్రాణుల పాత్రికలోకి మరో డ్రింక్ ఒంపారా? తమాషా షురూ...
హవ్, ఏ సునే క్యా?!
తమ అభిమతమే మీ అభిమతమూ కావాలని పట్టుబట్టే వాదనాప్రియులతో ఈ నికార్సయిన వ్యక్తులు మాట మాట కలుపుతారు. ఇందుకోసం వీలైనంత వరకు అపోజిట్ సెక్స్‌ను ఎంచుకుంటారు! వాదించి వాదించి ఒకానొక సమయంలో వాకౌట్ చేస్తారు. లేదా మాట్లాడలేనంతగా తాగేస్తారు. మాట్లాడేవారు వినేవారు అలసిసొలసిపోయిన దశలో, అలా ఏకాభిప్రాయాన్ని సాధిస్తారు! కాక్టైల్ పార్టీ ఎందుకు? దాని అమరికలో ఒక వైచిత్రం ఉంది. ఒక అంశం గురించి లేదా వ్యక్తి గురించి ‘అవునా?’ అన్పించే భావనను (ఫీలర్)
ప్రవేశపెడుతుంది. ‘హవ్, ఏ సునే క్యా?! (అవునూ... ఇది విన్నారా)’ లాంటి ఇంట్రడక్షన్‌తో! ఈ ‘కొత్త’ను సర్కిల్స్‌లో చలామణి చేయడం కాక్టైల్స్తోనే సాధ్యం. ఎవరి నుంచి ఈ ‘తాజా విశేషం’ మొదలైందో వారితోనే ‘అవునూ ఇది విన్నారా..’ అని చెవికొరుకుతారు కొందరు. ఈ ప్రచార వృత్తాంతం బహుముఖంగా వ్యాపించాలని పార్టీ ఇచ్చే వ్యక్తి ఆశిస్తారు!
పాదరస సంచరరే..!
వ్యాపారరంగానికి చెందిన వారికి లేదా ఏదైన ప్రయోజనం ఆశించిన వారికి తాను పార్టీ ఇస్తున్న సందర్భాల్లో ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి చాలా హుందాగా ఉంటారు. తొణకరు. ఇతరులంతా తూలి సోలిపోయే వరకూ! వేరే సందర్భాల్లో ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి సరదాను ఆశిస్తారు. రాజకీయాలు, కరెంట్ ఈవెంట్స్ చర్చించకుండా ఆపడం ఈ పార్టీల్లో సాధ్యం కాదు. లోపలకు సోమరసం జారేకొద్దీ మానసంలో పాదరస సంచారం పెరుగుతుంది.
జటిలమైన సమస్యలను చిటికెలో పరిష్కరించే జ్ఞానం సిద్ధిస్తుంది. ఈ మాట అనుభవపూర్వకంగా చెబుతున్నాను. కశ్మీర్ సమస్యను చాలామంది చాలాసార్లు పరిష్కరించారు, కాక్‌టైల్స్‌లో! మతతత్వానికి, టైజానికి, పాలస్తీనా సమస్యలకు ప్రత్యామ్నాయాలు అలవోకగా చెప్పగా విన్నాను. నేషనల్ క్రికెట్ టీంలో ఎవరెవరుంటే కప్పు మనదే అవుతుందో చిటికెలతో తేల్చిపారేయగా చూశాను. ఇరాక్ సమస్య కూడా చాలా సుహ్రుద్భావ వాతావరణంలో బహుపర్యాయాలు పరిష్కారం కాగా వీక్షించాను. పార్టీలో లేని తమ స్నేహితులగురించి ‘నిజాయితీ’గా మాట్లాడే వారినీ చూశాను. ఫలితంగా ఏర్పడే కాక్టైల్స్ తుపానులను శాంతపరచేందుకు మరికొన్ని కాక్టైల్ పార్టీలు కంపల్సరీ కావడమూ చూశాను.
అతడంటే అసూయ!
ధుమధుమలాడే భర్తలు కాక్‌టైల్స్‌లో తమ భార్యలపట్ల మహాప్రేమాస్పదంగా, వినయవిధేయతలతో ఉంటారు. మగవాడి కడుపులోకి మూడు డ్రింక్‌లు చేరాక మహిళ శరీరంలోకి ప్రవేశించే అందం.. అనితర సాధ్యం! కాక్‌టైల్స్‌లో పాల్గొనే మహిళలకు నాదొక సలహా! పార్టీల్లో ప్రశంసలను మీ ముఖవిలువలకు సంబంధించినవిగా ఎప్పుడూ భావించవద్దు! మెచ్చుకున్నా లేదా విమర్శించినా! ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. అన్ని తరాల అత్యుత్తమ మహిళానటీమణిగా ప్రపంచసినిమా మేరీ మేడ్లిన్ డిట్రెచ్ (1901-92)ను కీర్తించింది. ఆ జర్మన్-అమెరికన్ నటి గాయని కూడా. ‘ద బ్లూ ఏంజెల్, షాంఘై ఎక్స్‌ప్రెస్, ద డెవిల్ ఈజ్ ఎ ఉమన్’ తదితర చిత్రాల్లో డిట్రెచ్ నటించారు. ఆమె ఒక కాక్టైల్ పార్టీలో తనను తాను పెంచుకుంటోంది. ఆ సందర్భంలో నేరుగా ఆమె దగ్గరకు వెళ్లి ‘ మేడమ్ మీరు ఎంత అందంగా హుందాగా కన్పిస్తున్నారంటే, తాగినప్పుడు ఏ సాధారణ మహిళ అయినా కన్పించేంత అందంగా, హుందాగా’ అన్నాడు ఒక జర్నలిస్ట్ ! నా తరం వారికి అతడంటే అసూయ!
ఇంకో డ్రింక్ తీసుకుంటే..
కొంతమంది అతిగా తాగి టేబుల్ కిందకు పడిపోతారు. సుప్రసిద్ధ అమెరికన్ హాస్యనటి ‘అయామ్ నొ ఏంజెల్’ ఫేం మాయివెస్ట్కు తన పరిమితులు తెలుసు. కాబట్టే ‘వద్దు, ఇంకో డ్రింక్ వద్దు. తీసుకుంటే ఆతిథ్యం ఇచ్చిన వారి కిందకు చేరాల్సి ఉంటుంది’ అనగలిగారు! కొంతమంది మగవాళ్ల ‘సత్యకాముకత’ గొప్పది. కాక్టైల్స్ వారి స్వభావాన్ని తగ్గించలేవు. ఇంగ్లండ్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అందుకు ఉదాహరణ. ఇంగ్లండ్ చట్ట సభలో తొలి మహిళా ప్రతినిధి లేడీ నాన్సీ ఆస్టర్. ఇద్దరూ ఉప్పూ నిప్పూ! చర్చిల్ ఒక సందర్భంలో ‘నాన్సీ నువ్వు అగ్లీ (వికారి)’ అన్నాడు. ‘విన్స్టన్, తాగుబోతు మొహమా’ అన్నారు నాన్సీ.
ఆమె మాటను తిప్పికొడుతూ ‘రేపు పొద్దుటికి నేను హుందాగా ఉంటా. నీవు మాత్రం అగ్లీగానే ఉంటావ్’ అన్నాడు! సరే, ‘ధీమతు’ల పార్టీ, ‘సార’మతుల పార్టీల గురించి చెప్పుకున్నాం కదా! నేను ధీమతిని కాదు. ఒకోసారి నా దారికి అటూ ఇటూ వెళ్తుంటా. మరీ దూరం పోకముందే అసలు దారికి వస్తుంటా. ‘నేను పట్టిన కుందేటికి’ అనుకోలేని సంశయజీవిని! అందువల్లే ఏ రాజకీయపార్టీలోనూ చేరలేదు. అలా అని ‘సార’మతినీ కాదు! ఫలానా సమస్యకు పరిష్కారం ఏమిటి? అని సందేహం వస్తే! సమాధానాన్ని కాక్టైల్ పార్టీల్లో శోధిస్తా!
ప్రజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి