సుబేదారి స్టేషన్లో ఖాకీల కోల్డ్‌వార్
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఓ అధికారి, సిబ్బందికి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఎన్నికల ముందు వచ్చిన సదరు అధికారి వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఆయన వింతపోకడలతో సిబ్బంది ఎవరూ ఆయనకుసహకరించడం లేదని తెలుస్తోంది. కిందిస్థాయి సిబ్బందితోపాటు తనపై అధికారులతో కూడా సత్సంబంధాలు లేకపోవడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగానే సిబ్బంది ఈ స్టేషన్‌పరిధిలో ప్రజల శాంతిభద్రతలను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నారు.
కొండను తవ్వి ఎలుకను పట్టిన అధికారి..
‘సాక్షి’లో మంగళవారం సుబేదారి పోలీస్ అధికారుల పనితీరుపై ‘కాసుల వేటలో కేసులకు పాతర’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని చదివి ఒంటికాలిపై లేచిన సదరు అధికారి.. తన పనితనాన్ని నిరూపించుకునేందుకు ఓ పెద్ద పెండిం గ్ కేసు విచారణలో పడ్డారు. అదేదో హత్యో, దోపిడీ కేసు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయన తన సిబ్బందిని పురమారుంచింది చిన్నదాడి కేసు వ్యవహారంలో. హంటర్‌రోడ్‌లో మూడు నెలల క్రితం ఒక వ్యక్తిపై దాడి జరిగిందనే ఆరోపణపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఆ తర్వాత పోలీసుల విచారణలోనే అది తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగానే బాధితుడిగా పేర్కొన్న సదరు వ్యక్తి ఫిర్యా దు చేసినట్లు వెల్లడైంది. అరుునా ఇదే కేసులో మళ్లీ విచారించే పని ఉందంటూ హుజూరాబాద్‌లోని అనుమానుతుడి ఇంటికి సదరు అధికా రి ఇద్దరు పోలీసులను పంపించారు. అతడిని పట్టుకుని మాత్రమే స్టేషన్‌కు రావాలని హుకుం జారీచేశారు. ఇంకేముంది అక్కడికి వెళ్లిన పోలీసులు అనుమానితుడి ఇంటి వద్ద నానా హంగామా సృష్టించారు. ఇంట్లో ఉన్న అతడి భార్యను ఇబ్బందులకు గురిచేశారు. తనకు భయంగా ఉందని, తన భర్త వచ్చిన తర్వాత స్టేషన్‌కు పంపుతానని ఆమె చెప్పినా వినకుండా సదరు కానిస్టేబుళ్లు అక్కడే రాత్రి వరకు పడిగాపులు కాశారు.
విషయం హన్మకొండ డీఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన సదరు అధికారిని ఫోన్ చేసి మందలించినట్లు తెలిసిం ది. అయన మాత్రం ‘డీఎస్పీ కాదు.. ఎస్పీ చెప్పినా వినేది లేదు.. పట్టుకురావాల్సిందే’ అంటూ పంతం పట్టారు. కాగా పోలీసులు ప్రవర్తించిన తీరుపై బుధవారం అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, డీఐజీ డాక్టర్ ఎం కాంతారావుకు ఫిర్యాదు చేయనున్నట్లు హుజురాబాద్‌కు చెందిన సదరు మహిళ పేర్కొంది. ఇలా అసలు కేసులను వదిలేసి.. ఇలాంటి కేసులకు సంబంధించి కొందరు వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది.
వివాహిత హత్య కేసు సంగతేంటి..?
మార్చి 8న విజయపాల్ కాలనీలో పట్టపగలే ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అనుమానితులుగా భావించి సుమారు 30 మందిని మూడు నెలలుగా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ప్రతిరోజు వారిని ఉదయం స్టేషన్‌కు పిలిపించడం, సాయంత్రం వరకూ కూర్చోబెట్టడం రాత్రికి ఇంటికి పంపడం నిత్యకృత్యమైంది. ఇలా కేసు విచారణను పూర్తిచేయలేమని తెలిసినా నాన్చుడు ధోరణి ప్రదర్శించడంలో ఉద్దేశం ఏమిటో సదరు అధికారికే తెలియాల్సి ఉంది.
హత్య జరిగి నెలలు గడస్తున్నా కేసు పురోగతి అంగుళం కూడా లేకపోవడం గమనార్హం. దీంతోపాటు నందిహిల్స్‌లో భారీ దోపిడీ జరిగి రోజులు గడుస్తున్నా దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పోలీసుల వైఫల్యంతో ఈ స్టేషన్ పరిధిలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అంటూ బెంబేలెత్తిపోతున్నారు.
ఇక్కడే తిష్ట వేసేందుకు పైరవీ..
ఎన్నికల బదిలీపై వచ్చిన సదరు అధికారి మళ్వీ త్వరలో జరగబోయే బదిలీల్లో ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే తిష్టవేసేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈయన ఇక్కడే ఉంటే సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను గాలికి వదిలేయాల్సిందేనని సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.