శ్రద్ధ పెట్టకుంటే చర్యలు
మొక్కల పెంపకంపై కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
– మొక్కుబడిగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరిక
కర్నూలు(అర్బన్):
‘మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించడంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలి.. ఆశామాషీగా తీసుకుని మొక్కుబడిగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు’ అంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను హెచ్చరించారు. హరితాంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నెల 29వతేదీన రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ క్రమంలో మంగళవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో 89 శాఖల అధికారులతో కలెక్టర్ ‘వనం–మనం’ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సామాజిక అడవుల డీఎఫ్ఓ సావిత్రీబాయి పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల మైదానాల్లో 29వ తేదీన విద్యార్థులందరి చేత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని డీఈఓ, డీవీఈఓలను ఆదేశించారు. 30వ తేదీన తాను ర్యాండమ్‌గా ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శిస్తాన ని తెలిపారు. ముందుగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం, నిర్దేశిత ప్రాంతాల్లో మొక్కలు నాటడం అనంతరం మొక్కల పెంపకంపై సమావేశం నిర్వహించాలని మండల నోడల్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్డీఓలు రఘుబాబు, సుధాకర్‌రెడ్డి, ఓబులేసు, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు.