colleage
-
శ్రీ చైతన్య, నారాయణ గుర్తింపు రద్దు చేయాలి
నాంపల్లి : శ్రీ చైతన్య, నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలని, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల మరణానికి కారకులైన యాజమాన్యాలపై హత్య నేరం కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షులు మద్దిలేటి, ప్రధాన కార్యదర్శి మెంచు సందీప్ అన్నారు. మంగళవారం నాంపల్లిలోని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వారు మాట్లాడుతూ... కార్పొరేట్ సంస్థలు ర్యాంకుల పేరుతో విద్యార్థులను చంపుతున్నాయని ఆరోపించారు. శ్రీ చైతన్య, నారాయణ సంస్థలు విద్యను వ్యాపారం చేశాయన్నారు. గత ఏడాది అక్టోబర్, నవంబరు మాసాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు విద్యాసంస్థల్లోనే 47 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపారు. అయినా యాజమాన్యాలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. బోర్డు అధికారుల నుంచి రాష్ట్ర మంత్రుల దాకా వాటాలు పంచుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే కేజీ నుంచి పీజీదాకా ఉచిత విద్య అందించాలని కోరారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ యూనివర్శిటీ బిల్లును ఉప సంహరించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీవీవీ నేతలు స్వాతి, రాహుల్, కిషోర్, నజీర్, మహేష్, సందీప్, మహేష్, చందూలాల్, బలరాం, నాగరాజు, భాస్కర్, వేణు, విష్ణు, గోపి పాల్గొన్నారు. -
డీఎడ్ కాలేజీలో ఏసీబీ తనిఖీ
ఆత్రేయపురం: స్థానిక డీఎడ్ కాలేజీలో గురువారం ఏసీబీ సీఐ బి. రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు నిర్వహించింది. రాష్ట్రంలో డీఎడ్ కాలేజీల రెన్యువల్లో భాగంగా హైదరాబాద్ ఎస్ఎస్సీ బోర్డు కార్యాలయం వద్ద ఏపీ ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్ ఒకొక్క విద్యార్థి నుంచి రూ. వెయ్యి చొప్పున వసూలు చేస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆ వసూళ్లలో భాగస్వాములైన డీఎడ్ విద్యాసంస్థల అధినేత వినుకొండకు చెందిన రఫీ, రామారావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఈ దాడుల్లో రూ. 44.65 లక్షలు నగదును స్వాధీనం చేసుకున్నారు. డీఎడ్ విద్యా సంస్థల అధినేత రఫీ రాష్ట్రవ్యాప్తంగా 23 డీఎడ్ కాలేజీల్లో భాగస్వామి కావడంతో ఆయా కాలేజీలపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆ నేపథ్యంలో ఆత్రేయపురంలోని డీఎడ్ కాలేజీపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాలేజీ రికార్డులను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అదే సమయంలో సంస్థ డైరెక్టర్ పీఎస్ రాజు ఇంటిలో కూడా ఏసీబీ బృందం దాడులు నిర్వహించింది. ఏసీబీ సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ కాలేజీ రికార్డులను పరిశీలించామని, దీనికి సంబంధించిన నివేదికను ఏసీబీ ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. అంబాజీపేట ఎంపీడీఓ టి.S శ్రీనివాస విశ్వనాథ్, ఏసీబీ సిబ్బంది ఎస్వై జానీ, బి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
‘ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’
► భారతి తండ్రి గెడ్డం సత్తిబాబు ► కుటుంబంలో తీవ్ర విషాదం గొంది (సఖినేటిపల్లి): ఆత్మహత్య చేసుకునేటంత పిరికి మనస్తత్వం తమ కుమార్తెకు లేదని, ఆమె ధైర్యవంతురాలని గురువారం కాకినాడ నారాయణ కళాశాల హాస్టల్ రూంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇంటర్ విద్యార్థిని గెడ్డం భారతి తండ్రి గెడ్డం సత్తిబాబు తెలిపారు. కళాశాల నుంచి వచ్చిన సమాచారంతో తామంతా ఖంగుతిన్నామని ఆయన అన్నారు. భారతి ఆత్మహత్యపై కళాశాల నుంచి సరైన సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. భారతి మృతిని తాము జీర్ణించుకోలేక పోతున్నామన్నారు. ఈ సంఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన సత్తిబాబు, రత్నకుమారి దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో పెద్ద కుమార్తె వనిత. చిన్న కుమార్తె భారతి, ఒక కుమారుడు. రత్నకుమారి ఉపాధిరీత్యా కువైట్లో ఉంటోంది. ఇంటి వద్ద మృతురాలి నానమ్మ గెడ్డం వజ్రం, తండ్రి సత్తిబాబు ఉంటున్నారు. మృతురాలు భారతి, ఆమె సోదరుడు రాజోలు మండలం చింతలపల్లిలో పెద్దమ్మ (తల్లి సోదరి) కె. సుగుణకుమారి ఇంటి వద్ద ఉండి చదువుకుంటున్నారు. ఇటీవల గొందిలో సోదరి వనిత పెళ్లి సందర్భంగా వారందరూ కలుసుకున్నారు. అప్పుడు కుటుంబ సభ్యులతో భారతి ఎంతో సంతోషంగా గడిపింది. వనిత వివాహం అనంతరం తల్లి రత్న కుమారి తిరిగి విదేశాలకు వెళ్లింది. భారతి మరణించిన సమాచారాన్ని విదేశాల్లో ఉన్న ఆమె తల్లికి పంపించారు. -
‘ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’
-
కాలేజ్ యాజమాన్యంపై కేసు నమోదు
పుత్తూరు: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కళాశాల యాజమాన్యంపై 420, 402 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పుత్తూరులో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నిర్వహిస్తున్న శేషాచల డిఎడ్ కళాశాల యాజమన్యం విద్యార్థుల నుంచి అధిక ఫీజులు దండుకుంటోందని ఫిర్యాదులు రావడంతో కలెక్టర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.