ఇక ప్రజా‘వాణి’ విందాం
- అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
- నేటి నుంచి వారం వారం విజ్ఞప్తుల స్వీకరణ
- రెండు నెలల అనంతరం తిరిగి ప్రారంభం
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల పాటు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రతి సోమవారం నిర్వహించనున్నారు. దీంతోపాటు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని కూడా యథాతథంగా కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రకటించారు. జిల్లాలో మున్సిపల్, జెడ్పీటీసీ,సార్వత్రిక ఎన్నికలు వరుసగా రావడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. దీంతో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి బ్రేక్ పడింది.
ఈసీ ఆదేశాల మేరకు ప్రతి వారం కలెక్టరేట్‌తో పాటు ఆయా డివిజన్, మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు రెండు నెలలుగా వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో ప్రతి వారం అర్జిదారుల రాకతో నిండిపోయే కలెక్టరేట్.. ఎన్నికల సమీక్షలతో అధికారులతో నిండిపోయింది. మూడు ఎన్నికలు ఏకకాలంలో రావడంతో జిల్లాలో దాదాపు అన్ని శాఖల అధికారులు విధుల్లో పాల్గొన్నారు. ప్రజావాణి సిబ్బందికి సైతం ఎన్నికల విధులు అప్పగించారు.
పేరుకుపోయిన సమస్యలు
ప్రజావాణి ఉన్న రోజుల్లో ప్రజలు చిన్న చిన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే అవకాశముండేది. పింఛన్లు, కాలనీల్లో నెలకొన్న సమస్యలు మొదలైన వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేవారు. కార్యక్రమం రెండు నెలలుగా వాయిదా పడడంతో భూవివాదాలు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, బ్యాంకు రుణాలు తదితర సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎన్నికలు ముగిసి కొత్త పాలకవర్గాలు కొలువుదీరనుండడంతో సమస్యలు పరిష్కారమవుతాయని ఆశతో ఎదురుచూస్తున్నారు.
-డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటల వరకు నిర్వహించనున్నారు. 0878-2262301కు ఫోన్ చేసి కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకోవచ్చు.
- ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అధికారులు ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు.