రెండో రోజు 629 ఎకరాలు
తుళ్ళూరు : నవ్యాంధ్ర రాజధాని కోసం భూ సమీకరణ ప్రక్రియ రెండోరోజు శనివారం కూడా కొనసాగింది. తుళ్లూరు మండలం నేలపాడు గ్రాంలో శుక్రవారం ల్యాండ్‌పూలింగ్ ప్రారంభం కాగా శనివారం ఆ గ్రామంతో పాటు నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లోనూ భూములు సమీకరించారు. నెక్కల్లు, అనంతవరం గ్రామాల్లో నిర్వహించిన సభలకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణతోపాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ హాజరై రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు.
స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేతో పాటు జేసీ చెరుకూరి శ్రీధర్, ఆర్డీవో భాస్కరనాయుడు తదితరులు పాల్గొని రైతుల నుంచి ఫారం 9(1) లను తీసుకున్నారు. ఫారం9(2) లో అభ్యంతరాలను కూడా ఇవ్వవచ్చని ప్రజలను కోరారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు అంగీకరించిన రైతులు ఫారం 9(1) ఇవ్వగా వారికి అధికారులు భూ సమీకృత అధికారి ధ్రువీకరించిన రసీదు ఫారం 9(7)ను అందజేశారు.
తొలుత స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ ల్యాండ్ పూలింగ్‌లో ధ్రువపత్రాల గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఎవరికి ఏవిధమైన సమస్యలు వచ్చినా తాను దగ్గరుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతంలో యువకులు, విద్యావంతులు వృత్తి నైపుణ్యం సాధించాలని చెప్పారు. మాస్టర్‌ప్లాన్ వచ్చాక అమర్‌రాజా కంపెనీని ఈ ప్రాంతంలో స్థాపిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ మేలు చేయాలని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకువచ్చార ని పేర్కొన్నారు.
భూములు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న రైతులకు ఆయన పేరుపేరున అభినందనలు తెలిపారు. జూన్ కల్లా సింగపూర్ కంపెనీ రాజధాని మ్యాప్‌ను ఇస్తారని వెను వెంటనే పనులు ప్రారంభమవుతాయన్నారు. శనివారం జరిగిన కార్యక్రమంలో అనంతవరం గ్రామానికి చెందిన 20 మంది రైతులు 150 ఎకరాలకు, నెక్కల్లులో మొత్తం రైతులు 920 మంది ఉండగా 32 మంది రైతులు 419 ఎకరాలకు అంగీకార పత్రాలను మంత్రి నారాయణ, ఎంపీ జయదేవ్‌లకు అందజేశారు. రెండో రోజు నేలపాడులో 25 మంది రైతులు 60 ఎకరాల అంగీకార పత్రాలు అందజేశారు.
అనంతవరం భూముల వివరాలు..
భూమి రకం ఎకరాల్లో
మొత్తం భూమి 2544.22
పట్టాభూమి 1968.54
ఎండోమెంట్ భూమి 81.22
చెరువులు 15.05
కొండలు 285.89
ఎస్సైన్డ్ 41.10
గ్రామ కంఠం 15.64
డొంకలు, రోడ్లు 137.78
మొత్తం రైతులు 1047 మంది
నెక్కల్లు గ్రామ భూముల వివరాలు
భూమి రకం ఎకరాల్లో
మొత్తం భూమి 1411.41
పట్టాభూమి 1205
ఎండోమెంట్ 31
చెరువులు 30.5
అస్సైన్డ్ 28.82
డొంకలు 93.62
కొండలు 22