కలెక్టర్ అధికార వాహనం సీజ్
యవట్మాల్: రైతుకు నష్టపరిహారం చెల్లించనందుకు జిల్లా కలెక్టర్ అధికార వాహనాన్ని సీజ్ చేశారు. మహారాష్ట్రలో యవట్మాల్ జిల్లాలో సివిల్ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఆ జిల్లా కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి.
1999లో మహారాష్ట్ర జీవన్ ప్రాధికారణ్.. చాప్దో ప్రాజెక్టు కోసం రామ్‌నగర్‌కు చెందిన రైతు ఛగన్ రాథోడ్ తల్లి నుంచి 10 హెకార్ల భూమి సేకరించింది. ఇందుకుగాను అప్పట్లో ఆమెకు నష్టపరిహారం చెల్లించారు. అయితే నష్టపరిహారం మరింత పెంచాలని ఛగన్ రాథోడ్ కోర్టును ఆశ్రయించగా, మరో 13.30 లక్షలు అతనికి చెల్లించాల్సిందిగా 2010లో కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ మొత్తాన్ని ఎంజేపీ ఛగన్‌కు చెల్లించలేదు. దీంతో ఆయన మళ్లీ కోర్టును ఆశ్రయించాడు. వడ్డీతో సహా 29.84 లక్షల రూపాయలు రైతుకు చెల్లించాల్సిందిగా ఇటీవల ఎంజేపీని ఆదేశించింది. అయినా నష్టపరిహారం ఇవ్వకపోవడంతో కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రైతుకు నష్టపరిహారం చెల్లించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని ఎంజేపీ ఈఈ దినేశ్ బోర్కర్ చెప్పారు.