ఐతే ఓకే... జీవితాన్నే మార్చేసింది...
ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఇది ఒక టీవీ ప్రకటన...కానీ ఒక డైలాగ్ జీవితాన్నే మార్చేసింది. ఇది కొండవలస మాట.....‘ఐతే ఓకే’..... ఇప్పుడు ఈ మాట ఎవరు అన్నా సరే మనకు ‘ఔను...వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా గుర్తొస్తుంది. అంత పాపులర్ అయిన డైలాగ్ ఇది. అలాగే కొండవలస లక్ష్మణరావు అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కూడా అదే డైలాగ్. పుట్టినది శ్రీకాకుళం అయినా...ఎక్కువ కాలం నివసించినది మాత్రం మన విశాఖపట్నంలోనే....విశాఖతో ఆయనకున్న అనుబంధాన్ని సిటీప్లస్‌తో పంచుకున్నారు.
పుట్టింది శ్రీకాకుళం
నేను శ్రీకాకుళం జిల్లాలో పుట్టాను. నాన్నగారు ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. అమ్మ గృహిణి. 9వ తరగతి వరకు శ్రీకాకుళంలో చదువుకున్నాను. 1959లో ఫస్ట్ టైం ఇక్కడకు వచ్చాను. ఏవీఎన్ కాలేజీలో డిగ్రీ చేశాను. ఆ తర్వాత 1967లో విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఉద్యోగం చేశాను. అక్కడి నుంచి 2001 వరకు వైజాగ్‌లోనే ఉన్నాను.
ఎన్నో ఏరియాలు తిరిగా...
నేను వచ్చిన కొత్తలో రైల్వే క్వార్టర్స్‌లో ఉండేవాళ్లం. 1970 వరకు అక్కడే ఉన్నాం. ఆ తర్వాత అక్కయ్యపాలెంలో అద్దె ఇంట్లోకి మారిపోయాం.పోర్టులో ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో ఉన్నాం. నేను చాలా ఏరియాలు తిరిగాను. ఎక్కువగా తిరిగింది మాత్రం దొండపర్తి , అక్కయ్యపాలెం, అల్లిపురం....తర్వాత మధురవాడలో ఇల్లు కట్టుకుని వెళ్లిపోయాం. కానీ పిల్లల చదువులకు ఇబ్బంది అవుతోందని పోర్టు క్వార్టర్స్‌కు వచ్చేశాను. అక్కడే ఉంటూ 2000లో వీఆర్ఎస్ తీసుకున్నాను. అమ్మాయికి పెళ్లి చేసేసి హైదరాబాద్ వెళ్లిపోయాం.
ఒక్క ఫోన్ కాల్
నేను సినిమాల్లోకి వెళ్లాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నాకు ఆ ఐడియా కూడా లేదు. 1961 నుంచి 2001 వరకు నేను ఒక స్టేజ్ ఆర్టిస్ట్‌ను. అలా సమయం ఉన్నప్పుడు స్టేజ్ షోస్ చేస్తూ ఉండేవాడిని.‘అల్లదే మా ఊరండి’ అనే నాటికను ఆకెళ్ల సూర్యనారాయణ గారు రాశారు. ద్రాక్షారామం నాటక కళాపరిషత్‌లో ఆ నాటిక ప్రద ర్శిస్తున్నప్పుడు వంశీ గారు చూశారు. తర్వాత ఒకరోజు నాకు ఫోన్ చేసి ఇలా ఒక సినిమా చేయబోతున్నాను. నీకు ఒక క్యారెక్టర్ ఇస్తాను..యాక్ట్ చేస్తావా అని అడిగారు. నాకు కూడా ఆఫర్ నచ్చి చేస్తాను అని చెప్పాను. అలా నాకు ఆ క్యారెక్టర్‌తో మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు ‘కళ్లు’ అనే సినిమాలో ఒక రౌడీ క్యారెక్టర్ చేశాను.
బస్ టికెట్ బేడ...
నేను విశాఖ వచ్చిన కొత్తల్లోనే నేషనల్ హైవే, నాలుగు రోడ్లు ఫార్మేషన్ జరుగుతూ ఉంది. అవన్నీ చూశాను. విశాఖపట్నంలో ఎక్కువగా విలేజస్ ఉండడం వలన బాగా డెవ లప్ అయ్యింది. ఇప్పుడు ఉన్న వన్‌టౌన్ అప్పటికే డెవలప్ అయిన ప్రాంతం. నేను ఏవీఎన్ కాలేజీకి అల్లిపురం నుంచి నడిచే వెళ్లేవాళ్లం. అప్పటికి అది డెవలప్ అవ్వలేదు కానీ కొన్ని ఇళ్లు మాత్రం ఉండేవి. అప్పట్లో ‘బేడ’ ఇస్తే ఏవీఎన్ కాలేజీకి బస్ ఉండేది. కానీ అది కూడా ఇవ్వలేని పొజీషన్లో ఉండేవాళ్లం అప్పట్లో. ఆశీల్‌మెట్ట జంక్షన్ ఇప్పుడున్నట్లు లేదు. పాత బస్టాండ్ ఒకటి ఉండేది.
అప్పుడు కూడా...
మేము 1968-69 టైంలో రైల్వే క్వార్టర్స్‌లో ఉన్న సమయంలో మొన్న వచ్చిన హుదూద్ తుఫాను లాంటిదే వచ్చింది. చాలా ఉధృతంగా వర్షాలు, వరదలు వచ్చాయి. అలాగే 1990లో శార దా నది పొంగి రైల్వే ట్రాక్స్ అన్నీ విరిగిపోయాయి. చాలా బీభత్సం అయ్యింది. సరిగ్గా అదే సమయంలో నేను టూర్‌కు వెళ్లి వస్తూ ఆ వరదల్లో చిక్కుకున్నాను. అన్నవరం నుంచి విశాఖపట్నం చేరుకోవడానికి 18 గంటలు పట్టింది. ఆర్టీసీ డ్రైవర్ ఎంతో చాకచక్యంతో మమ్మల్ని విశాఖపట్నం చేర్చారు. ఆ ఘటన నేను ఎప్పటికీ మరచిపోలేను.
గజం రూ. 12
నేను ఇక్కడకు వ చ్చినప్పటికి గజం స్థలం 12 రూపాయలు ఉండేది. అది కూడా ఎక్కడో లోపల కాదు. అక్కయ్యపాలెంలో హైవేను ఆనుకుని ఉన్న స్థలం. మధురవాడ లో నేను ఇల్లు కట్టుకునే సమయానికి గజం రూ.35 కు కొనుక్కున్నాం. ఇప్పుడు అదే స్థలం 300 గజాలు 70 లక్షల పైనే ఉంది.
అదే టాప్
నేను ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాను. ఎన్ని సినిమాలు చేసినా సరే ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా టాప్‌లో ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది కానీ ఇప్పటికీ ‘అయితే ఓకే’ అనే డైలాగ్ అందరికీ ఊత పదంగా మారిపోయింది. తర్వాత చేసిన నిజం, ఆదివారం ఆడవాళ్లకు సెలవు కావాలి, ఎవడి గోల వాడిది, శ్రీకృష్ణ 2006 ఇలా అన్ని సినిమాలు చాలా ఇష్టం. ప్రస్తుతం 6 సినిమాలలో నటిస్తున్నాను. ఏ సినిమాకు ఇంకా పేర్లు నిర్ణయించలేదు.