చెక్‌పోస్టుపై ఏసీబీ దాడి: భారీగా నగదు స్వాధీనం
చిత్తూరు: చిత్తూరు జిల్లా నాగులాపురం అంతరాష్ట్ర చెక్‌పోస్టుపై ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా చెక్‌పోస్టు సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ. 34,080 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఏసీబీ అధికారులు చెక్‌పోస్టులో ప్రవేశించి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సిబ్బంది కృష్ణయ్య వద్ద రూ.15వేలు, ఉమాపతి వద్ద రూ.4,080 లభించాయి.
అలాగే కార్యాలయంలోని గ్యాస్ సిలిండర్ కింద రూ.10 వేలు, వంటగదిలో ర్యాక్ కింద మరో రూ.3 వేలు, బ్యాటరీ కింద రూ.2 వేలు దొరికాయి. రాత్రి డ్యూటీలో ఉన్న ఏసీటీవో ప్రతాపరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ కోటేశ్వరరావు, ఆఫీసు సబార్డినేట్ సుదర్శన్‌ను అధికారులు విచారించి, వివరాలు రాబట్టారు. సిలిండర్, ర్యాక్, బ్యాటరీ కింద దొరికిన నగదుతో తమకు సంబంధం లేదని వారు ఏసీబీ అధికారులకు వెల్లడించారు.