త్వరలో వాణిజ్య కోర్టులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య లావాదేవీల్లో నెలకొనే వివాదాల పరిష్కారం కోసం కేంద్రప్రభుత్వం త్వరలో కమర్షియల్ కోర్టులను ఏర్పా టు చేయనున్నట్టు ప్రజావినతులు, చట్టాలు, న్యాయంపై పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈఎమ్ సుదర్శన నాచియప్పన్ తెలిపారు. వాణిజ్యకోర్టుల ఆవశ్యకత, లోక్‌సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధివిధానాలపై చర్చిం చేందుకు సుదర్శన కమిటీ శుక్రవారం ఇక్కడ సమావేశమైంది. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐలతోపాటు, వివిధ సంస్థల వారు హాజరై సలహాలు, సూచనలు అందజేశారు.
అనంతరం కమిటీ చైర్మన్ సుదర్శన నాచియప్పన్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో వ్యాపార కార్యకలాపాలు భారీగా పెరుగుతున్నాయని, అంతేస్థాయిలో సమస్యలు, వివాదాలు కూడా నెల కొంటున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారం కోసం వాణిజ్య న్యాయస్థానాలు తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. విధివిధానాల అధ్యయనానికి తమ కమిటీ దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందని చెప్పారు.
జూలై నెలాఖరుకు కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో కోటి కేసులు బ్యాంకులు, పబ్లిక్సెక్టార్కు సంబంధించినవి కాగా, మిగిలినవి ప్రైవే ట్ సెక్టార్‌కు చెందినవని తెలిపారు. తెలంగా ణ, ఏపీతో పలు రాష్ట్రాల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతోపాటు జరుగుతున్నాయని, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కేంద్రం ఆలోచన చేస్తుం దని తెలిపారు. సమావేశంలో కమిటీ సభ్యులు వి.వరప్రసాదరావు, పీపీ చౌధురి, రజనీపాటిల్, చౌధురి మహబూబ్ ఆలీ కైసర్, సంతోష్‌కుమార్, డా.అన్షుల్ వర్మ, సుఖ్యింద్ శేఖర్‌రాయ్ తదితరులు పాల్గొన్నారు.