చెల్లింపు వార్తలు నేరమే!
న్యూఢిల్లీ: చెల్లింపు వార్తల(పెయిడ్ న్యూస్)ను ఎన్నికల నేరంగా పరిగణించాలని లా కమిషన్ సంప్రదింపుల్లో మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గత వారం లా కమిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. ఈ వార్తలను ఎన్నికల నేరంగా పరిగణించాలన్న ప్రతిపాదనను ప్రజాప్రాతినిధ్య చట్టంలో చేర్చాలని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. కమిషన్ సభ్యులు 15 మందిలో నలుగురు మినహా సానుకూలత వ్యక్తం చేశారు. అయితే ఈు వార్తలను ఏ రకమైన నేరంగా పరిగణించానే విషయంపై భిన్నాభిప్రాయాలొచ్చాయి. కొంత మంది దీనిని ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికల నేరంగా పరిగణించాలని చెప్పగా, కొందరు సాధారణ నేరంగా పరిగణిస్తే చాలన్నారు.
గత వారం లా కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ మాట్లాడుతూ.. అభ్యర్థులను అనర్హతకు గురిచేసే ఎన్నికల నేరంగా పెయిడ్ న్యూస్‌ను మార్చాలని ప్రతిపాదించడం తెలిసిందే. ఆయన ప్రతిపాదనపై లా కమిషన్ సంప్రదింపులు జరపగా.. చెల్లింపు వార్తలను పర్యవేక్షించేందుకు, నియంత్రించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి.