ఎయిర్‌ఫోర్స్ కమిషన్డ్ ఆఫీసర్లు @ ఎఎఫ్సీఏటీ
భిన్నమైన కెరీర్‌ను ఎంచుకోవాలనే ఆసక్తి.. సవాళ్లను స్వీకరించే గుణం.. సాహసాల పట్ల మక్కువ ఉన్న యువకులకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్వాగతం పలుకుతోంది.. వివిధ విభాగాల్లో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకానికి నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు..
భర్తీ చేసే విభాగాలు:
- ఫ్ల్ల్లయింగ్ బ్రాంచ్ (షార్ట్ సర్వీస్ కమిషన్)
అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. 10+2 స్థాయిలో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివి ఉండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్.
వయసు: 19 నుంచి 23 ఏళ్లు (జూలై 1, 2015 నాటికి).
- టెక్నికల్ బ్రాంచ్ (షార్ట్ సర్వీస్ కమిషన్/పర్మనెంట్ కమిషన్): ఇందులో ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్), ఏరోనాటికల్ ఇంజనీర్ (మెకానికల్) విభాగాలు ఉంటాయి.
అర్హత: 60 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచ్‌లతో బీఈ/బీటెక్ లేదా తత్సమానం.
వయసు: 18 నుంచి 28 ఏళ్లు (జూలై 1, 2015 నాటికి).
గ్రౌండ్ డ్యూటీ బ్రాంచెస్ (షార్ట్ సర్వీస్ కమిషన్/పర్మనెంట్ కమిషన్): ఇందులో ఉండే విభాగాలు..
- అడ్మినిస్రేషన్ అండ్ లాజిస్టిక్స్
అర్హత: 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా 50 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్/పీజీ డిప్లొమా.
- అకౌంట్స్
అర్హత: 60 శాతం మార్కులతో బీకామ్ లేదా 50 శాతం మార్కులతో ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ
- ఎడ్యుకేషన్
అర్హత: 50 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్.
వయసు: గ్రాడ్యుయేట్ అభ్యర్థులు: 20-23 ఏళ్లు, పీజీ/ఎల్ఎల్బీ/ఇంటిగ్రేటెడ్ పీజీ అభ్యర్థులు: 20-25 ఏళ్లు, ఎంఈడీ/పీహెచ్డీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ అభ్యర్థులకు: 20 - 27 ఏళ్లు/ఎల్ఎల్బీ (మూడేళ్ల కోర్సు) అభ్యర్థులకు: 20 - 26 ఏళ్లు (జూలై 1, 2015 నాటికి).
- పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. 25 ఏళ్లలోపు అభ్యర్థులు అవివాహితులై ఉండాలి.
- చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే.
- నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
- ఎన్సీసీ ఎయిర్‌వింగ్ సర్టిఫికెట్-సి ఉన్న అభ్యర్థులకు టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్‌లలో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది.
రెండు సర్వీసులు:
ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ అనే రెండు సర్వీసులు ఉంటాయి. పర్మనెంట్ కమిషన్ హోదాలో చేరిన అభ్యర్థులు రిటైర్మెంట్ వరకు విధులు నిర్వహించాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ హోదాలో చేరిన అభ్యర్థులు 10 ఏళ్లపాటు సేవలందించాలి. తర్వాత ఆసక్తి మేరకు నాలుగేళ్ల పొడిగింపునిస్తారు.
పలు దశలుగా ఎంపిక:
ఎంపిక ప్రక్రియలో పలు దశలు ఉంటాయి. ఇందులో మొదటగా ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్సీఏటీ) నిర్వహిస్తారు. టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు ఏఎఫ్సీఏటీకి అదనంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ) ఉంటుంది. ఏఎఫ్సీఏటీని మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మిలటరీ ఆప్టిట్యూడ్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. సమాధానాలను గుర్తించడానికి రెండు గంటల సమయం కేటాయిస్తారు.
ఏఎఫ్సీఏటీ ఇలా:
జనరల్ అవేర్‌నెస్‌లో చరిత్ర, క్రీడలు, భూగోళశాస్త్రం, పర్యావరణం, పౌరశాస్త్రం, జనరల్ సైన్స్, రక్షణ, కరెంట్ అఫైర్స్, కళ, సాంస్కృతిక అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. వెర్బల్ ఎబిలిటీలో కాంప్రెహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటెన్సెస్ కంప్లిషన్, సినానిమ్స్, యాంటినామ్స్, వొకాబ్యులరీ నుంచి ప్రశ్నలు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీలో డెసిమల్ ఫ్రాక్షన్,యావరేజ్, ప్రాఫిట్-లాస్, సింప్లిఫికేషన్, రేషియో, సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్-మిలటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో వెర్బల్ నైపుణ్యాలు, ప్రాదేశిక సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఏఎఫ్సీఏటీ ముగిసిన వెంటనే 30 నిమిషాల పాటు ఈకేటీ నిర్వహిస్తారు. ఏఎఫ్సీఏటీకి సంబంధించి మాదిరి/గత ప్రశ్నపత్రాలను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఏఎఫ్సీఏటీ తర్వాత ఏఎఫ్ఎస్బీఎస్:
ఏఎఫ్సీఏటీలో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరు తర్వాత దశ ఎయిర్‌ఫోర్స్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్స్ (ఏఎఫ్ఎస్బీఎస్) పరీక్షలకు హాజరు కావాలి. ఇందులో మూడు దశలు ఉంటాయి. అవి..
- స్టేజ్-1: ఇది స్క్రీనింగ్ రౌండ్. ఇందులో అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న విభాగానికి సంబంధించి అర్హత ప్రమాణాలను రుజువు చేసే ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. నిర్దేశించిన విధంగా అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే తర్వాతి దశలకు అనుమతిస్తారు.
- స్టేజ్-2: ఇందులో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంట ర్వ్యూ అంశాలు ఉంటాయి. ఇవి ఐదు రోజులపాటు కొనసాగుతాయి. ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు అదనంగా పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీటెస్ట్(పీఏబీటీ)ను నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు.
శిక్షణ-కెరీర్-వేతనాలు:
ఎంపికైన అభ్యర్థులకు జూలై, 2015 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఫ్లయింగ్, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ అభ్యర్థులకు 52 వారాలపాటు శిక్షణనిస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ. 21 వేల స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణను పూర్తి చేసుకున్న అభ్యర్థుల కెరీర్ ఫ్ల్లయింగ్ ఆఫీసర్ హోదాతో ప్రారంభమవుతుంది. ఈ స్థాయి నుంచి అనుభవం, ప్రతిభ సామర్థ్యాల మేరకు అత్యున్నత హోదా చీఫ్ ఎయిర్ స్టాఫ్ వరకు ఎదగొచ్చు. విభాగాల వారీగా కెరీర్ ప్రారంభంలో నెలకు లభించే జీతభత్యాలు: ఫ్లయింగ్ బ్రాంచ్-రూ. 72,150, టెక్నికల్ బ్రాంచ్: రూ. 63,400, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్-రూ. 60,900. వీటికి అదనంగా వసతి సౌకర్యాలు, ఇన్సూరెన్స్, ప్రయాణ భత్యాలు అదనంగా లభిస్తాయి.
విధులు:
ఫ్లయింగ్ బ్రాంచ్ అభ్యర్థులు ఫైటర్ పైలట్, హెలికాప్టర్ పైలట్, ట్రాన్స్పోర్ట్ పైలట్‌గా విధులు నిర్వహిస్తారు. గ్రౌండ్ డ్యూటీ బ్రాంచ్ అభ్యర్థులు సంబంధిత సాంకేతిక, మానవ వనరుల నిర్వహణకు బాధ్యులుగా ఉంటారు. టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులు కీలకమైన పరికరాలు, సాంకేతిక సామర్థ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 3, 2014.
- ఎఎఫ్సీఏటీ తేదీ: ఆగస్టు 31, 2014.
- వివరాలకు: http://careerairforce.nic.in