వ్యభిచారం నిర్విహస్తే ఇల్లు సీజ్
* ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ సీవీ ఆనంద్
* తొలిసారి ఉప్పల్‌లో రెండు ఇళ్లు సీజ్
సాక్షి, సిటీబ్యూరో: వ్యభిచారం అనే మాట వినపడకుండా చేసేందుకు సైబరాబాద్ పోలీసులు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. వ్యభిచారం నిర్వహించేందుకు వినియోగించిన ఇంటిని, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని కమిషనర్ సీవీ ఆనంద్ అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇప్పటికే స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) కల్తీ పదార్థాల తయారీ గౌడాన్స్, కంపెనీలతో పాటు పేకాట కేంద్రాలపై పై ఉక్కుపాదం మోపారు.
దీంతో పేకాట రాయుళ్లు ఇతర రాష్ట్రాల బాట పట్టారు. ఇక వ్యభిచార నిర్వాహకులపై కూడా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. శివార్లలోని రిసార్ట్స్, ఫాంహౌస్‌లలో నిర్వహిస్తున్న రేవ్ పార్టీలను కూడా అడ్డుకొని యువతులు, యువకులను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇదిలా ఉండగా... అపార్ట్మెంట్లు, హోటళ్లు, లాడ్జీలలో సైతం కొందరు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
వృభిచార గృహాలకు వెళ్తూ యువత.. అవసరమైన డబ్బు కోసం నేరాల బాటపడుతోంది. అలాగే నిర్వాహకులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలల నుంచి, ఇతర రాష్ట్రాలనుంచి అమ్మాయిలను బలవంతంగా తీసుకొచ్చి ఈ రొంపిలోకి దింపుతున్న ఘటనలుసైతం ఇటీవల వెలుగు చూశాయి. ఈ నేథ్యంలో వ్యభిచారం నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆనంద్ నిర్ణయించారు.
హోటళ్లు, లాడ్జీలు, ఫాంహౌస్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్లపై వ్యభిచారం నిరోధానికి ఉద్దేశించిన ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ (పీటా)ను ప్రయోగిస్తారు. ఆయా ప్రదేశాల్లో ఉద్దేశపూర్వకంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని విచారణలో తేలితే మాత్రం వీటిని వాటిని సైతం సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది.
పీటా యాక్ట్ అంటే...
పీటా యాక్ట్ ప్రకారం.. పోలీసులు ప్రస్తుతం వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకుడు, విటుడు, వ్యభిచారం చేస్తున్న అమ్మాయిలను అరెస్టు చేస్తున్నారు. పీటా యాక్ట్‌లోని 3,4,5 సెక్షన్ల కింద కోర్టులో హాజరుపరుస్తున్నారు. పట్టుబడ్డ యువతిని కోర్టు బాధితురాలిగా చూపిస్తూ మహిళా సంరక్షిత కేంద్రం (రెస్క్యూ హోం)కు తరలించాలని ఆదేశిస్తోంది.
ఇక విటుడికి అదే రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుక ంటే పోలీసులు పెట్టే ఈ సెక్షన్లు అసలు విటుడికి వర్తించవు, ఇంత వరకు విటుడిని ఏ-సెక్షన్లో అరెస్టు చేయాలో ఎక్కడా లేదు. ఇక వ్యభిచార కేంద్రం నిర్వాహకుడికి మాత్రం 14 రోజుల పాటు రిమాండ్‌కు కోసం జైలుకు పంపుతారు. అమ్మాయి కోసం వారి రక్తసంబంధీకులు పిటిషన్ దాఖలు చేస్తే
కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోం ప్రాజెక్ట్ డెరైక్టర్ ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితులను క్షణ్ణంగా అధ్యయనం చేసి ఓ నివేదికను కోర్టుకు అందజేస్తారు. నివేదిక సంతృప్తికరంగా ఉందని కోర్టు భావిస్తే పిటిషనర్‌కు అమ్మాయిని అప్పగిస్తారు. లేదం టే ఆమె రెస్క్యూ హోంలోనే ఉండాల్సి ఉం టుంది. ఇదిలా ఉండగా.. ఇదే చట్టంలో ఆస్తుల సీజ్ చేసే అవకాశం ఉన్నా పోలీసులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. కమిషనర్ సీవీ ఆనంద్ ఇకపై వ్యభిచారం నిర్వహించిన ఇంటిని కూడా సీజ్ చేయాలని నిర్ణయించారు.
రెండు ఇళ్లు సీజ్....
కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని పద్మావతి, విజయపూరి కాలనీల్లో ఆది వారం వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడిన రెండు ఘటనలో కూడా రెండు ఇళ్లను మల్కాజిగిరి డీసీపీ రమా రాజేశ్వరీ, ఏసీపీ ఎం.రవిచందన్రెడ్డిల ఆదేశాల మేరకు ఉప్పల్ ఇన్స్పెక్టర్ వై.నర్సిం హారెడ్డి సీజ్ చేశారు. సైబరాబాద్‌లో పీటా కేసులో ఇళ్లలను సీజ్ చేయడం ఇదే మొదటిసారి.
ఉప్పల్‌లో బంగ్లాదేశ్ ముఠా వ్యభిచారం
* పోలీసుల అదుపులో ముగ్గురు యువతులు,
* నిర్వాహకుడు
ఉప్పల్: ఉప్పల్‌లో వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశ్ ముఠా గుట్టును ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... బంగ్లాదేశ్‌కు చెందిన ఎండీ జబ్బార్ ఏడేళ్ల క్రితం ఉప్పల్‌కు వచ్చాడు. తన పేరు వినోద్ వర్మగా చెప్పుకొని విజయపురి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.
బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆదివారం వారు ఉంటున్న ఇంటిపై దాడి చేసి ముగ్గురు యువతులతో పాటు జబ్బార్‌ను ఆదుపులోకి తీసుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఒక ద్విచక్రవాహనం, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
బంగ్లాదేశీయులు కాదా?
పట్టుబడ్డ యువతులు బంగ్లాదేశీయులా లేదా పశ్చిమబెంగాల్‌కు చెందినవారా? అనేది పోలీసులు స్పష్టం చేయలేకపోతున్నారు. వీరు బంగ్లాదేశీయులని ఎస్ఓటీ పోలీసులు చెప్తుండగా... ఉప్పల్ పోలీసులు మాత్రం వారు వెస్ట్‌బెంగాల్‌కు చెందినవారని అంటున్నారు.
ఇక నుంచి ఉక్కుపాదం
వ్యభిచారం కేసులో అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదలవుతున్న నిర్వాహకులు, విటులు తిరిగి అదే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎస్ఓటీ పోలీసులు నిర్వహించిన వరుస దాడుల్లో పట్టుబడిన నిర్వాహకులు గతంలో కూడా పట్టుబడిన వారే అని తేలింది. ఈనేపథంలోనే వ్యభిచార నిర్వహణకు వినియోగించిన ఇల్లు, ఫాంహౌస్, లాడ్జీ, రిసార్ట్స్, అందులోని సామగ్రిని సీజ్ చేయాలని నిర్ణయించాం. ఇలా చేయడంతో తిరిగి వారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా ఉంటారు.
- సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్