ఆపకపోతే సస్పెన్షన్
పోలీసు సిబ్బందికి కమిషనర్ హెచ్చరిక
సిటీబ్యూరో: ‘బార్లు.. కల్లు కాంపౌండ్.. బిల్డర్లు.. హోటల్స్.. గుడుంబా అడ్డాలు.. పేకాట.. వ్యభిచార కేంద్రాలు... ఇలా ఎవరు.. ఎక్కడి నుంచి ఎంతెంత మామూళ్లు వసూలు చేస్తున్నారో.. నా దగ్గర చిట్టా ఉంది.. వాటికి ఫుల్‌స్టాప్ పెట్టకపోతే సస్పెండ్ చేస్తా’నంటూ సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసులను హెచ్చరించారు. ఏయే పోలీసు స్టేషన్లకు ఎంతెంత మామూళ్లు వస్తున్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ విభాగంలో మామూళ్లు ఎక్కువగా వసూలయ్యే ఠాణాగా మాదాపూర్‌ను గుర్తించామన్నారు. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ ఒక్క రూపాయి కూడా వసూలు చేయడం లేదని నిఘా వర్గాల ద్వారా తేలిందని కమిషనర్ కితాబిచ్చారు. మిగతా ఇన్‌స్పెక్టర్లు కూడా ఇలాగే నడ వాలని సూచించారు.
శనివారం గచ్చిబౌలిలోని తన కార్యాలయంలో అర్ధ వార్షిక సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్, హోంగార్డు, మహిళా పోలీసు స్టేషన్ల ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఠాణాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు రూ.75 వేలు ఇస్తోందని గుర్తు చేశారు. ఇక నుంచి వసూళ్లు బంద్ చేయాలని ఆదేశించారు. లేదంటే ఎస్‌హెచ్‌ఓలను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సరికొత్త విధానాలు ప్రవేశపెట్టబోతున్నట్లు కమిషనర్ వివరించారు. స్టేషన్ల సిబ్బంది పనితీరులో పెనుమార్పులు రాబోతున్నాయన్నారు. ఇక నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతామని ఇన్‌స్పెక్టర్లు హామీ ఇచ్చారు. సమావేశంలో అన్ని జోన్‌ల డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు.
మీ వసూళ్ల సంగతి తెలుసు!
Published Sun, Feb 22 2015 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:41 PM
Advertisement
Advertisement