వాట్సప్ ద్వారా యథేచ్ఛగా వ్యభిచారం !
సాక్షి, ఖమ్మం : ఉమ్మడి జిల్లాలో హైటెక్ వ్యభిచారం యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు చూసీ చూడనట్లు వదిలివేయటంతో అడ్డూఅదుపు లేకుండా పోతోంది. కనీసం దాడులు చేసిన దాఖలాలు కూడా కనిపించడంలేదు. దీంతో ఎక్కడపడితే అక్కడ వ్యభిచార గృహాలు వెలుస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంలోనే ఈ వ్యవహారం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపార పనుల నిమిత్తం నగరానికి వచ్చే వ్యాపారులు హోటళ్లు, లాడ్జీల వద్ద బస చేస్తుంటారు. వాటి వద్ద బ్రోకర్లను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. వారు సెల్ఫోన్లలో యువతుల చిత్రాలను చూపించి, రేటు చెప్పి విటులను ఆకర్షిస్తున్నట్లు సమాచారం. ఖమ్మంతో పాటు కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు ఎక్కువగా నడుపుతున్నట్లు తెలిసింది. సింగరేణి ప్రాంతాలైన కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాల్లో విలాసవంతమైన జీవితాలకు కొంతమంది బాగా ఖర్చు చేస్తుండటంతో.. వ్యభిచార గృహ నిర్వాహకులు దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
వాట్సాప్‌ల ద్వారా..
టెక్నాలజీని ఉపయోగించుకుని హైటెక్ వ్యభిచార దందా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. తమ వద్దకు వచ్చే విటుల ఫోన్ నంబర్లు తీసుకుని, యువతుల చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపిస్తూ రేటు నిర్ణయించకుంటున్నట్లు సమాచారం. గంటకు రూ.1000 నుంచి రూ.5,000 వరకు, ఒక్కరోజు యువతులను తీసుకుని వెళ్తే.. రూ. 10వేల రూ. 30వేల రూపాయల వరకు బ్రోకర్లు విటుల నుంచి వసూలు చేçస్త్ను్నట్లు సమాచారం. ముఖ్యంగా పక్క రాష్ట్రం నుంచి జిల్లాకు బతుకుదెరువు కోసం వచ్చిన కొంతమంది సులువుగా లక్షలు సంపాందించవచ్చని బ్రోకర్లుగా మారి ఈ దందా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి విటులకు ఎర వేస్తున్నట్లు సమాచారం. అనుమానం రాకుండా క్లాస్ ఏరియాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుంటూ.. నాలుగు, ఐదు నెలలకోసారి అడ్డాలను మారుస్తూ.. యథేచ్ఛగా వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు బ్రోకర్లే విటుల వద్దకు కార్లలో యువతులను తీసుకొస్తున్నట్లు సమాచారం.
పేదరికంలో ఉన్నవారే టార్గెట్..!
పేదరికంలో ఉన్న మహిళలు, విద్యార్థినులను టార్గెట్ చేసుకుని, వారికి డబ్బు ఆశ చూపించి బలవంతంగా ఈ కూపంలోకి దింపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ తండాలకు గిరిజన యువతులను కొంతమందిని ప్రలోభపెట్టి ఈ రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాల బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడ అమ్మాయిలను ఇక్కడకు తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం. డబ్బులకు కక్కుర్తి పడే కొంతమంది మాయమాటలతో యువతులను తమ వలలో వేసుకోని ముంబై, కోల్‌కతా వంటి ప్రాంతాల్లోని వ్యభిచార కేంద్రాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎక్కువగా ఇల్లెందు సబ్‌డివిజన్‌లోని పలు తండాలలో నడుస్తున్నట్లు సమాచారం.
పట్టించుకోని పోలీసులు
ఉమ్మడి జిల్లాలో హైటెక్ వ్యభిచారం జోరుగా సాగుతున్నా పోలీస్‌శాఖ చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని విమర్శలు వినపడుతున్నాయి. కొందరు పోలీస్ అధికారులకు, సిబ్బందికి నెలనెలా మాముళ్లు అందుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విటులకు తమ వ్యభిచార కేంద్రాల్లో పోలీస్ భయం లేదు. ధైర్యంగా వుండవచ్చని వారికి మాముళ్లు అప్పజెప్పుతున్నామని అభయం కూడా ఇస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఐడీ పార్టీ సిబ్బందిలో కొందరు ఈ వ్యభిచార కేంద్రాలను నడిపే బ్రోకర్లతో సంబంధం పెట్టుకుని, అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
దొంగతనం కేసులో రిమూవల్ అయిన ఓ హోంగార్డు ఉమ్మడి జిల్లాలో ప్రాంతాలు మారుతూ కొంతకాలంగా హైటెక్ వ్యభిచారం నడుపుతున్న పట్టించుకునే దిక్కులేదని, అతని వద్దనుంచి భారీ స్థాయిలో కొంతమంది పోలీస్‌సిబ్బంది మాముళ్లు తీసుకోంటున్నారని విమర్శలు వినపడుతున్నాయి. అతను హైదరాబాద్, విజయవాడ, ముంబై ప్రాంతాలనుంచి అమ్మాయిలను తీసుకోని వస్తున్నట్లు సమాచారం. ఠాణాల్లో పనిచేస్తున్న బ్లూకోల్ట్ సిబ్బందికి కూడా వ్యభిచార కేంద్ర నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకుని మాముళ్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల కాలంలో కొంతమంది టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తమపై అధికారులకు చెప్పకుండా పాండురంగాపురంలోని ఓ వ్యభిచార గృహంపై దాడి చేసి డబ్బులు ఇవ్వకపోవటంతో ఆ గృహంలో ఉన్న వారిని చితకబాదగా ఈవ్యవహారం కాస్తా వివాదంగా మారిన విషయం విదితమే. దీనిపై ఇద్దరు టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై కూడా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న విషయం విదితమే. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించాలని వ్యభిచారకేంద్రాలపై గట్టి చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.