పోలీసు హెడ్‌క్వార్టర్స్ నమూనా రెడీ
నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో గల 3.5 ఎకరాల సువిశాల స్థలంలో నిర్మించతల పెట్టిన నగర పోలీసు కమిషనర్ భవనం (హెడ్‌క్వార్టర్స్) నమూనా తయారైంది. ఈ నమూనాను ఎల్ అండ్ టీ కంపెనీకి చెందిన ఆర్కిటెక్ట్స్ ఆర్.చక్రపాణి అండ్ సన్స్ రూపొందించారు. ఈ నమూనాను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, డీజీపీ అనురాగ్‌శర్మ పరిశీలించారు. దాదాపు ఇదే నమూనాకు చిన్నపాటి మార్పులు చేర్పులతో గ్రీన్‌సిగ్నల్ వేసే అవకాశాలున్నాయని అధికారులంటున్నారు.
నగర పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రాణాళిక బడ్జెట్ కింద నగర పోలీసు విభాగానికి రూ.116 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.20 కోట్లతో బంజారాహిల్స్‌లో దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా బహుళ అంతస్తులతో అత్యంత విశాలమైన పోలీసు ప్రధాన కార్యాలయ భవనాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే శంకుస్థాపన తేదీలు ఖరారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ భవనంలో కమిషనర్ కార్యాలయంతో పాటు కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేస్తారు.