Commissionerate police officers
-
Hyderabad: అదనపు డీజీ అయినా నో చాన్స్!
సాక్షి, హైదరాబాద్: ఆగస్టు 15, జనవరి 26న దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జెండా వందనం ఉంటుంది. సంబంధిత కార్యాలయ అధిపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు. అదనపు డీజీ స్థాయిలో ఉండే నగర పోలీసు కమిషనర్‌కు మాత్రం ఆ చాన్స్ ఉండదు. సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు మాత్రం అప్పుడప్పుడు అవకాశం చిక్కుతుంటుంది. నగర కొత్వాల్‌కు ఉండే కీలకమైన బాధ్యతే అందుకు కారణం. ► హైదరాబాద్ కమిషనరేట్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(ఏడీజీ) స్థాయి అధికారి, సైబరాబాద్, రాచకొండలకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ) స్థాయి అధికారి కమిషనర్లుగా ఉంటారు. ప్రస్తుతం మాత్రం ఆ రెండు కమిషనరేట్లకూ ఏడీజీలే కమిషనర్లుగా ఉన్నారు. ► రాష్ట్ర డీజీపీకి సైతం లేని విధంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సహా వివిధ ప్రత్యేక అధికారాలు ఈ ముగ్గురు కమిషనర్లకూ ఉంటాయి. కీలక హోదా కలిగిన ఈ ముగ్గురికీ జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. మిగిలిన ఇద్దరికీ అప్పుడప్పుడూ ఆ చాన్స్ దొరుకుతుంది. ► జీహెచ్ఎంసీలో ప్రధాన కమిషనర్, కలెక్టరేట్లలో కలెక్టర్లు, న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు, జలమండలిలో దాని ఎండీ.. ఇలా వాటి అధిపతులే జాతీయ జెండాలను ఎగురవేస్తారు. కమిషనరేట్లలో మాత్రం ఇతర అధికారులకే ఈ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ► హైదరాబాద్‌లో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్.సుధారాణి, సైబరాబాద్‌లో మహిళా భద్రత విభాగం డీసీపీ సి.అనసూయ ఆదివారం జెండా వందనం చేశారు. రాచకొండలో మాత్రం కమిషనర్ మహేష్ భగవత్ ఎగరేశారు. ఇలానే అప్పుడప్పుడు సైబరాబాద్ కమిషనర్ కూడా జెండాను ఆవిష్కరిస్తుంటారు. హైదరాబాద్ కొత్వాల్ మాత్రం ఎగరేసిన దాఖలాలు లేవు. ► ఆయనకు కీలక బాధ్యతల కారణం హైదరాబాద్ కమిషనర్‌కు జెండా ఎగురవేసే అవకాశం ఉండదు. గణతంత్ర వేడుకలైనా, స్వాతంత్య్ర దినోత్సవమైనా నగరంలో అధికారిక ఉత్సవాలు జరుగుతాయి. వీటికి జనవరి 26న గవర్నర్, ఆగస్టు 15న సీఎం (ఈ రెండు సందర్భాల్లో ఇద్దరూ హాజరైనా అధికారికంగా గౌరవ వందనం స్వీకరించేది ఒకరే) హాజరవుతారు. వారితో పాటే మంత్రులు, అత్యున్నత అధికారులూ వస్తారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలి. ► ఈ ఏర్పాట్లన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసు విభాగంలోని ఇతర ఉన్నతాధికారుల కంటే కమిషనర్‌కే ఎక్కువ. ► ఇలాంటి కీలక బాధ్యతలు ఉన్నందువల్లే హైదరాబాద్ కమిషనర్‌కు ఎప్పుడూ తన కార్యాలయంలో జెండా ఎగురవేసే అవకాశం చిక్కదు. -
పోలీసులపై ప్రజల్లో నమ్మకం పెంచాలి
వరంగల్ క్రైం: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచే విధంగా పోలీసుల విధులు నిర్వహించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సీపీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల దర్యాప్తులో కిందిస్థాయి అధికారులను భాగస్వాములను చేయాలన్నారు. దీని వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు బాధ్యతగా విధులు నిర్వర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై రశీదు ఇవ్వడంతో ఆస్తి నేరాలకు సంబంధించి కేసులను వెంటనే నమోదు చేయాలని సూచించారు. నమోదు చేసిన కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్ ప్రతులను ఫిర్యాదుదారులకు ఉచితంగా అందజేయాలన్నారు. కేసుల్లో సాక్షులుగా ఉండే వ్యక్తులను పోలీసుస్టేషన్‌కు పిలువకుండా వారిని ఇంటివద్దే పెద్ద మనుషుల సమక్షంలో విచారించాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో› మహిళలు, వృద్ధులు, పిల్లలు, మద్యం సేవించిన వారిని పోలీసుస్టేషన్లల్లో ఉంచవద్దని ఆదేశించారు. భూకబ్జాదారుల వివరాలు సేకరించాలి.. కమిషనరేట్ పరిధిలోని భూకబ్జాదారుల వివరాలను సేకరించాలని సీపీ పోలీసులను ఆదేశించారు. దీంతో పాటు ఆస్తి నేరాలు, మోసాలకు పాల్పడుతున్న వారి పూర్తి సమాచారం, ఫోటోలు, వేలి ముద్రాలు సేకరించాలన్నారు.అవసరమైతే పీడీ యాక్ట్ నమోదుకు పూర్తి స్థాయి సమాచారం కలిగి ఉండాలన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ముఖం గుర్తించే సాఫ్ట్‌వేర్‌ను వినియోగించుకోవాలన్నారు. అనంతరం వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల పరిష్కరాలు, అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించారు.సమావేశంలో డీసీపీలు వెంకట్‌రెడ్డి, రావిరాల వెంకటేశ్వర్లు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
రూల్ మేకర్సే.. బ్రేకర్స్!
- సామాన్యులే టార్గెట్ - పెద్దల జోలికి పోని వైనం - ఎమ్మెల్యే బొండా కొడుకు నిర్వాకంతో వెల్లడైన పోలీస్ నైజం విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్ అధికారులవి ఉత్తరకుమార ప్రగల్భాలేనని మరోసారి తేటతెల్లమైంది. ట్రాఫిక్ నిబంధనల అమలులో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదంటూ సామాన్యులపై ఉక్కుపాదం మోపే అధికారులు.. ఉన్నత వర్గాలు, అధికార పార్టీ నేతల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బందరు రోడ్డు, ఏలూరు రోడ్డుపై సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు ఆదివారం నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించి హల్చల్ చేస్తే నిలువరించే ప్రయత్నాలు కూడా చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. పైగా పీవీపీ స్క్వేర్ సమీపంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బంది ఇతర వాహనాలను నిలిపేసి మరీ రాంగ్రూట్లో వచ్చిన బొండా కుమారుడి వాహనాలకు దారివ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలే కిస్తీలు కట్టలేని స్థితిలో అల్లాడుతున్న తమను ఈ-చలానాలు ఆర్థికంగా కుంగదీస్తున్నాయంటూ ఆటో డ్రైవర్ల వేడుకోళ్లను పరిగణనలోకి కూడా తీసుకోని పోలీసులు.. ఇలాంటి వారి విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం విమర్శలకు దారితీసింది. సామాన్యుడిపై కొరడా రాజధాని నేపథ్యంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి నుంచి నిబంధనల అమలుపై పోలీసులు దృష్టిసారించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలకు ఈ-చలానాలు, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ పేరిట నడ్డి విరుస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు చిన్నపాటి పొరపాటు చేసినా నేరుగా ఇంటికి ఈ-చలానా పంపి జరిమానా వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో ధ్రువీకరణ పత్రాల తనిఖీ పేరిట ఎన్ఫోర్స్మెంట్ దాడులు ముమ్మరం చేశారు. నగరంలో పదేపదే వస్తున్న ఈ-చలానాలు కట్టలేని స్థితిలో పలువురు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఈ-చలానాలు కట్టలేక మిన్నుకుండిపోతుండడంతో పోలీసులు పి.డి.ఎం. (పర్సనల్ డివైజ్ యంత్రం)తో తనిఖీలు చేపట్టారు. తద్వారా పాత కేసులను తిరగదోడి జరిమానా చెల్లించని వాహనాలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అసలే అంతంతమాత్రం ఆదాయం ఉన్న సామాన్యుల వాహనాలను డంపింగ్ యార్డులకు తరలించి పోలీసులు ఘనకార్యం చేసినట్టు చెప్పుకొంటున్నారు. నిబంధనలు అమలు చేస్తే ఆటోలు సీజ్ చేయాల్సి ఉంటుందని ఆటోడ్రైవర్లను బెదిరించడం విమర్శనాత్మకంగా మారింది. పెద్దోళ్లకు మినహాయింపులు నిబంధనల విషయంలో సామాన్యులపై కొరడా ఝళిపిస్తున్న పోలీసులు పెద్దల విషయంలో మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఖరీదైన కార్లు, ప్రైవేటు ట్రావెల్స్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. రాత్రి 8 గంటల సమయంలో రద్దీగా ఉండే కంట్రోల్ రూమ్ వద్ద రోడ్డుపై ట్రావెల్స్ బస్సులు నిలిపేసి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ఇతర వాహనాలు వెళ్లేందుకు కనీసం చోటు కూడా ఉండడం లేదు. ప్రైవేటు ట్రావెల్స్ అధికార పార్టీ నేతలకు చెందినవి కావడం వల్ల పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని జనం అంటున్నారు. ఖరీదైన కార్లు కూడా నిత్యం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. వన్‌వే, సిగ్నల్ జంపింగ్ వంటి నిబంధనలకు వీరు పాల్పడుతున్నారు. పైగా అనేక కార్లు ఏ విధమైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే నడుపుతున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద సామాన్యులను మాత్రమే ఆపి తనిఖీలు చేస్తున్నారు. -
మళ్లీ అదే కథ!
కిందపడడమే గాయాలకు కారణమంటూ వెల్లడి అధికారుల తీరుపై ఏఆర్ కానిస్టేబుళ్ల ఆగ్రహం విజయవాడ సిటీ: పోలీసు కమిషనరేట్ అధికారులు పాత కథనే మరోసారి వినిపించారు. నెలల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ‘మద్యం మత్తులో కిందపడి గాయపడ్డారు’ అనే అంశాన్నే పోలీసు అధికారులు చెప్పడం గమనార్హం. రెండు వివాదాల్లోను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆర్.ఎస్.ఐ.లే. అప్పట్లో ఆరోపణలు చేసింది సాధారణ యువకుడైతే, ప్రస్తుతం ఎ.ఆర్. కానిస్టేబుల్ కావడం విశేషం. రెండు ఘటనల్లోనూ అధికారులనే వెనకేసుకురావడంపై ఎ.ఆర్. విభాగం సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాము ముందునుంచీ చెబుతున్నట్లుగానే అధికారులను రక్షించే విధంగా ఉన్నతాధికారుల చర్యలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిలా.. గత శనివారం ఆర్మడ్ రిజర్వ్డ్ మైదానంలోని డంపింగ్ యార్డులో ఆర్.ఎస్.ఐ. ప్రదీప్‌రెడ్డి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఘర్షణలో ఎ.ఆర్. కానిస్టేబుల్ శ్రీనివాసరావు ముఖంపై గాయాలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కమిషనరేట్ అధికారులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఆర్మ్డ్ రిజర్వుడ్‌లో పనిచేస్తూ.. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించారని తనిఖీకి వచ్చిన ఆర్.ఎస్.ఐ. గమనించినట్టు తెలిపారు. తాను గమనించిన అంశాలను రికార్డుల్లో నమోదు చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ దాడి చేసి ఆర్.ఎస్.ఐ.ని గాయపరిచాడని, ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కిందపడి గాయపడ్డానని వెల్లడించారు. అప్పుడలా.. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా మూడు నెలల కిందట పశువుల ఆస్పత్రి జంక్షన్లో మద్యం మత్తులో వాహనం నడుపుతున్న కల్యాణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో పోలీసుల చర్యలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప కొట్టి గాయపరచడమేమిటంటూ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన కమిషనరేట్ పెద్దలు మద్యం మత్తులో ఉన్న కల్యాణ్ మరికొందరితో కలిసి విధులు నిర్వర్తిస్తున్న ఆర్.ఎస్.ఐ.పై దాడికి యత్నించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తూలి కిందపడి గాయపడ్డాడే తప్ప ఆర్.ఎస్.ఐ. ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చారు. పైగా ఆ యువకుడి ఫిర్యాదుపై సి.ఐ.డి. దర్యాప్తునకు రాసినట్టు తెలిపారు. ఈ విషయాలు పరిశీలిస్తే అధికారులంతా ఒక్కటేననే విషయం మరోసారి రుజవైందని ఎ.ఆర్. కానిస్టేబుళ్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు. అధికారులకు బాధ్యత లేదా? కమిషనరేట్ పెద్దలు చెప్పిన దాని ప్రకారం సాయుధ రిజర్వ్డ్ విభాగం క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. అంటే అధికారుల నుంచి సిబ్బంది వరకు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి. మరి అలాంటప్పుడు విధులు నిర్వహించే సిబ్బంది మద్యం మత్తులో ఉండడానికి పై అధికారులు కారణం కాదా? విషయం వివాదానికి దారితీసింది కాబట్టి వెలుగుచూసింది. బయటకు రాకుండా ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయనేది సిబ్బంది వాదన. మరి బాధ్యతాయుత ప్రవర్తనపై సుద్దులు చెప్పే పెద్దలు ఎ.ఆర్. ప్రక్షాళనకు చర్యలు చేపడతారా.. చేపడితే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారనేది వేచిచూడాల్సిందే.