- సామాన్యులే టార్గెట్
- పెద్దల జోలికి పోని వైనం
- ఎమ్మెల్యే బొండా కొడుకు నిర్వాకంతో వెల్లడైన పోలీస్ నైజం
విజయవాడ సిటీ : పోలీసు కమిషనరేట్ అధికారులవి ఉత్తరకుమార ప్రగల్భాలేనని మరోసారి తేటతెల్లమైంది. ట్రాఫిక్ నిబంధనల అమలులో ఎంతటివారైనా ఉపేక్షించేది లేదంటూ సామాన్యులపై ఉక్కుపాదం మోపే అధికారులు.. ఉన్నత వర్గాలు, అధికార పార్టీ నేతల విషయంలో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే బందరు రోడ్డు, ఏలూరు రోడ్డుపై సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు ఆదివారం నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించి హల్‌చల్ చేస్తే నిలువరించే ప్రయత్నాలు కూడా చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. పైగా పీవీపీ స్క్వేర్ సమీపంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తించే సిబ్బంది ఇతర వాహనాలను నిలిపేసి మరీ రాంగ్‌రూట్‌లో వచ్చిన బొండా కుమారుడి వాహనాలకు దారివ్వడం చర్చనీయాంశంగా మారింది. అసలే కిస్తీలు కట్టలేని స్థితిలో అల్లాడుతున్న తమను ఈ-చలానాలు ఆర్థికంగా కుంగదీస్తున్నాయంటూ ఆటో డ్రైవర్ల వేడుకోళ్లను పరిగణనలోకి కూడా తీసుకోని పోలీసులు.. ఇలాంటి వారి విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం విమర్శలకు దారితీసింది.
సామాన్యుడిపై కొరడా
రాజధాని నేపథ్యంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి నుంచి నిబంధనల అమలుపై పోలీసులు దృష్టిసారించారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాహనాలకు ఈ-చలానాలు, ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పేరిట నడ్డి విరుస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు చిన్నపాటి పొరపాటు చేసినా నేరుగా ఇంటికి ఈ-చలానా పంపి జరిమానా వసూలు చేస్తున్నారు. ఇదే సమయంలో ధ్రువీకరణ పత్రాల తనిఖీ పేరిట ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు ముమ్మరం చేశారు. నగరంలో పదేపదే వస్తున్న ఈ-చలానాలు కట్టలేని స్థితిలో పలువురు వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఈ-చలానాలు కట్టలేక మిన్నుకుండిపోతుండడంతో పోలీసులు పి.డి.ఎం. (పర్సనల్ డివైజ్ యంత్రం)తో తనిఖీలు చేపట్టారు. తద్వారా పాత కేసులను తిరగదోడి జరిమానా చెల్లించని వాహనాలను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. అసలే అంతంతమాత్రం ఆదాయం ఉన్న సామాన్యుల వాహనాలను డంపింగ్ యార్డులకు తరలించి పోలీసులు ఘనకార్యం చేసినట్టు చెప్పుకొంటున్నారు. నిబంధనలు అమలు చేస్తే ఆటోలు సీజ్ చేయాల్సి ఉంటుందని ఆటోడ్రైవర్లను బెదిరించడం విమర్శనాత్మకంగా మారింది.
పెద్దోళ్లకు మినహాయింపులు
నిబంధనల విషయంలో సామాన్యులపై కొరడా ఝళిపిస్తున్న పోలీసులు పెద్దల విషయంలో మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఖరీదైన కార్లు, ప్రైవేటు ట్రావెల్స్ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. రాత్రి 8 గంటల సమయంలో రద్దీగా ఉండే కంట్రోల్ రూమ్ వద్ద రోడ్డుపై ట్రావెల్స్ బస్సులు నిలిపేసి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ఇతర వాహనాలు వెళ్లేందుకు కనీసం చోటు కూడా ఉండడం లేదు. ప్రైవేటు ట్రావెల్స్ అధికార పార్టీ నేతలకు చెందినవి కావడం వల్ల పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని జనం అంటున్నారు. ఖరీదైన కార్లు కూడా నిత్యం నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. వన్‌వే, సిగ్నల్ జంపింగ్ వంటి నిబంధనలకు వీరు పాల్పడుతున్నారు. పైగా అనేక కార్లు ఏ విధమైన ధ్రువీకరణ పత్రాలు లేకుండానే నడుపుతున్నా పోలీసులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద సామాన్యులను మాత్రమే ఆపి తనిఖీలు చేస్తున్నారు.
రూల్ మేకర్సే.. బ్రేకర్స్!
Published Mon, May 11 2015 4:48 AM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM
Advertisement
Advertisement