మళ్లీ అదే కథ!
కిందపడడమే గాయాలకు కారణమంటూ వెల్లడి
అధికారుల తీరుపై ఏఆర్ కానిస్టేబుళ్ల ఆగ్రహం
విజయవాడ సిటీ: పోలీసు కమిషనరేట్ అధికారులు పాత కథనే మరోసారి వినిపించారు. నెలల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ‘మద్యం మత్తులో కిందపడి గాయపడ్డారు’ అనే అంశాన్నే పోలీసు అధికారులు చెప్పడం గమనార్హం. రెండు వివాదాల్లోను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆర్.ఎస్.ఐ.లే. అప్పట్లో ఆరోపణలు చేసింది సాధారణ యువకుడైతే, ప్రస్తుతం ఎ.ఆర్. కానిస్టేబుల్ కావడం విశేషం. రెండు ఘటనల్లోనూ అధికారులనే వెనకేసుకురావడంపై ఎ.ఆర్. విభాగం సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాము ముందునుంచీ చెబుతున్నట్లుగానే అధికారులను రక్షించే విధంగా ఉన్నతాధికారుల చర్యలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడిలా..
గత శనివారం ఆర్‌మడ్ రిజర్వ్‌డ్ మైదానంలోని డంపింగ్ యార్డులో ఆర్.ఎస్.ఐ. ప్రదీప్‌రెడ్డి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఘర్షణలో ఎ.ఆర్. కానిస్టేబుల్ శ్రీనివాసరావు ముఖంపై గాయాలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కమిషనరేట్ అధికారులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఆర్మ్‌డ్ రిజర్వుడ్‌లో పనిచేస్తూ.. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించారని తనిఖీకి వచ్చిన ఆర్.ఎస్.ఐ. గమనించినట్టు తెలిపారు. తాను గమనించిన అంశాలను రికార్డుల్లో నమోదు చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ దాడి చేసి ఆర్.ఎస్.ఐ.ని గాయపరిచాడని, ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కిందపడి గాయపడ్డానని వెల్లడించారు.
అప్పుడలా..
ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యల్లో భాగంగా మూడు నెలల కిందట పశువుల ఆస్పత్రి జంక్షన్‌లో మద్యం మత్తులో వాహనం నడుపుతున్న కల్యాణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో పోలీసుల చర్యలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప కొట్టి గాయపరచడమేమిటంటూ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన కమిషనరేట్ పెద్దలు మద్యం మత్తులో ఉన్న కల్యాణ్ మరికొందరితో కలిసి విధులు నిర్వర్తిస్తున్న ఆర్.ఎస్.ఐ.పై దాడికి యత్నించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తూలి కిందపడి గాయపడ్డాడే తప్ప ఆర్.ఎస్.ఐ. ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చారు. పైగా ఆ యువకుడి ఫిర్యాదుపై సి.ఐ.డి. దర్యాప్తునకు రాసినట్టు తెలిపారు. ఈ విషయాలు పరిశీలిస్తే అధికారులంతా ఒక్కటేననే విషయం మరోసారి రుజవైందని ఎ.ఆర్. కానిస్టేబుళ్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు.
అధికారులకు బాధ్యత లేదా?
కమిషనరేట్ పెద్దలు చెప్పిన దాని ప్రకారం సాయుధ రిజర్వ్‌డ్ విభాగం క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. అంటే అధికారుల నుంచి సిబ్బంది వరకు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి. మరి అలాంటప్పుడు విధులు నిర్వహించే సిబ్బంది మద్యం మత్తులో ఉండడానికి పై అధికారులు కారణం కాదా? విషయం వివాదానికి దారితీసింది కాబట్టి వెలుగుచూసింది. బయటకు రాకుండా ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయనేది సిబ్బంది వాదన. మరి బాధ్యతాయుత ప్రవర్తనపై సుద్దులు చెప్పే పెద్దలు ఎ.ఆర్. ప్రక్షాళనకు చర్యలు చేపడతారా.. చేపడితే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారనేది వేచిచూడాల్సిందే.