Community radio
-
వనపర్తి ఆవాజ్.. ఖమర్ రహమాన్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆమె అతి పేద ముస్లిం కుటుంబంలో పుట్టిన సామాన్యురాలు. తల్లి అనారోగ్యం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఆరో తరగతి చదువుతుండగానే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కుటుంబ భారంతో అనేక సమస్యలు ఎదుర్కొంది. అయితే చిన్నప్పట్నుంచే అభ్యుదయ భావాలు కలిగిన ఆమె ఎలాగైనా తనను తాను నిరూపించుకోవడంతో పాటు మహిళా శక్తిని ప్రపంచానికి చాటాలని నిర్ణయించుకున్నారు. సమాజంలో కట్టుబాట్లను దాటి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. భర్త సహకారంతో పదో తరగతి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేశారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గజ్జె కట్టి, పాట పాడుతూ దేశమంతా తిరిగారు. అంతేకాదు స్వయం ఉపాధి చూపడం ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతుల జీవితాల్లో వెలుగులు నింపారు. జాతీయ స్థాయిలోనూ పేరు సంపాదించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆవాజ్ వనపర్తి పేరిట కమ్యూనిటీ రేడియోను స్థాపించి అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్‌కు చెందిన ఖమర్ రహమాన్‌పై మహిళాదినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం.. 150 గ్రామాలకు ఆవాజ్ వనపర్తి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వనితా జ్యోతి సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్న ఖమర్ రహమాన్ కమ్యూనిటీ రేడియో ప్రాధాన్యత గురించి తెలుసుకుని.. తానూ స్థాపించాలనే నిర్ణయానికి వచ్చారు. అనేకసార్లు ప్రయత్నించిన తర్వాత నాలుగేళ్లకు అనుమతి లభించింది. వీజేఎంఎస్ ఆవాజ్ 90.4 ఎఫ్ఎం రేడియో (ఆవాజ్ వనపర్తి) ఏర్పాటయ్యింది. 2018లో ప్రసారాలు ప్రారంభం కాగా.. ప్రస్తుతం ఆవాజ్ వనపర్తి రేడియో కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఎకరా స్థలం కూడా కేటాయించింది. ఇందులో నుంచే బ్రాడ్ కాస్టింగ్ నడుస్తోంది. భవన నిర్మాణం పురోగతిలో ఉంది. ఇది పూర్తయితే రికార్డింగ్, బ్రాడ్‌కాస్టింగ్ ఒక్కచోట నుంచే జరుగుతుంది. ప్రస్తుతం వనపర్తి నుంచి 35 కిలోమీటర్ల మేర 150 గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకున్నా ఎఫ్ఎం కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా ఆవాజ్ వనపర్తి 90.4 ఎఫ్ఎం పేరుతో వెబ్ రేడియో కూడా అందుబాటులోకి తేగా.. దీనికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శ్రోతలు ఉండడం విశేషం. రైతులు, మహిళల సమస్యలు పరిష్కారంపై నిపుణులతో కార్యక్రమాలు, జాతీయ నేతలు, మహానుభావుల జీవిత చరిత్ర, చారిత్రక ప్రాధాన్యం గల అనేక అంశాలతోపాటు ఆరోగ్య సూత్రాలు, చిట్కాలు, పద్యనాటకాలు, మిమిక్రీ, చిన్నపిల్లల కార్యక్రమాలు, యూనిసెఫ్ ప్రోగ్రామ్‌లు ప్రసారంతో ఇది బహుళ ప్రజాదరణ పొందుతోంది. ఇలా మొదలు.. నిరక్షరాస్యత, పేదరికం, వలసలకు కేరాఫ్‌గా నిలిచిన పాలమూరు జిల్లాలో ప్రభుత్వం 1989లో అక్షర కిరణం పేరిట పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా మహిళా అక్షరాస్యతను పెంపొందించడం.. పొదుపు అలవాటు చేసుకునేలా స్వయం సహాయక బృందాల (ఎస్ఎస్జీ) ఏర్పాటు కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఆయా కార్యక్రమాలకు ఆటపాటల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. పాటలు రాయడం, పాడడంతో పాటు గజ్జె కట్టి ఆడటంలోనూ ప్రావీణ్యమున్న ఖమర్ రహమాన్‌కు వెంటనే అవకాశం వచ్చింది. అంతే ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు. గజ్జె కట్టి, పాటపాడుతూ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కల్చరల్ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఖమర్ రహమాన్.. చిన్నమ్మ థామస్ సఖీ కేంద్రాల నిర్వహణ చేపట్టి సమాజంలో అణచివేత, వేధింపులకు గురవుతున్న ఎందరో మహిళలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సారా నిషేధం కోసం లక్ష సంతకాలు సేకరించి గవర్నర్‌కు సమర్పించి గుర్తింపు తెచ్చుకున్నారు. భూకంప బాధితులకు విరాళాల సేకరణతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో మహిళలను స్వయం ఉపాధి దిశగా నడిపించేందుకు 1994లో వనితా జ్యోతి మహిళా సంఘం (వీజేఎంఎస్) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఇప్పటివరకు 25 వేల మందికిపైగా మహిళలు, యువతులకు కంప్యూటర్, టైలరింగ్, మగ్గం వర్క్స్, సర్ఫ్, అగర్బత్తీల తయారీ తదితరాల్లో శిక్షణ ఇప్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ రేడియోకు నాతో పాటు మొత్తం 614 మంది దరఖాస్తు చేశారు. ఇందులో నాకే అవకాశం అభించింది. సాంకేతికతను ఉపయోగించి సమాజానికి మరిం త మేలు చేయాలనే సంకల్పంతో దీన్ని స్థాపించా. ప్రస్తుతం ఈ రేడియోలో 18 మంది మహిళలు పని చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో చాలా అవార్డులు వచ్చినా..డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ (డీఈఎఫ్) నుంచి మూడు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉంది. త్వరలో ప్రతి గ్రామానికి 2 రేడియోల చొప్పున అందజేసి.. మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. – ఖమర్ రహమాన్, ఆవాజ్ వనపర్తి రేడియో ఫౌండర్ -
లాక్డౌన్ వాణి.. కమ్యూనిటీ కేంద్రం
తుఫాను సమయంలో తీరంలోని వారికి ఒడ్డును చూపిస్తున్న లైట్ హౌస్... రేడియో అల. రైతుల యోగక్షేమాల కోసం ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను వినిపిస్తున్న వాణి... రేడియో కర్షకవాణి. ప్రాంతీయ సమస్యలను స్థానిక నాయకుల చెవిన వేస్తున్న మైక్... రేడియో గురూ. గంగ జమున తెహ్జీబ్ పాఠాల్లోనే కాదు, ప్రాక్టికల్‌గానూ కనిపించాలని ట్యూన్ చేస్తున్న బ్యాండ్... రేడియో చార్మినార్... ఇవన్నీ కమ్యూనిటీ రేడియోలు. కాకినాడ, చిత్తూరు, కోదాడ, హైదరాబాద్‌లలో స్థానిక శ్రోతల ఇళ్లకు తోరణాల్లాంటి తరంగాలు. ప్రతి రేడియోకు ఓ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యసాధనలో ఉంటూనే కరోనా కాలంలో ప్రత్యేక ప్రసారాలను, సేవలనూ అందిస్తున్నాయి. కరోనా కారక్యక్రమాలు .. ప్రస్తుత కరోనా కాలానికి తగ్గట్టుగా కొన్ని కొత్త కార్యక్రమాలను చేర్చుకుని ప్రసారం చేస్తున్నాయి ఈ కమ్యూనిటీ రేడియోలు. కరోనా అప్డేట్స్తోపాటు స్థానిక ప్రభుత్వఅధికారులు, ప్రజాప్రతినిధుల ముఖాముఖి, కరోనా దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోగనిరోధక శక్తి పెరగడానికి పాటించాల్సిన ఆహార నియమాలపై డాక్టర్ల సలహాలు, సూచనలు వినిపిస్తున్నాయి, వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపులు, స్థానిక స్వచ్ఛంద సంస్థల సేవాకార్యక్రమాలు, హెల్ప్లైన్ల నంబర్లు వంటి వివరాలను అందిస్తున్నాయి. ఫిట్నెస్, యోగా నిపుణులతో ఇంటరాక్షన్ సెషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు, పెద్దలకోసం లోకాభిరామాయణం, అంత్యాక్షరి, డైలాగ్ చెప్పి సినిమా పేరు అడగడం, చరణం పాడి పల్లవి చెప్పమనడం, షాయరీలు, హౌజీ గేమ్స్, రైతుల కోసం ధాన్యం కొనుగోలు, మార్కెట్వివరాలు, యూత్‌కి ఆన్లైన్ పాఠాలు, పోటీ పరీక్షల ప్రిపరేషన్‌కు గైడెన్స్ మొదలైనవి, పిల్లలకోసం పిల్లల చేత చెప్పిస్తున్న కథలు, రేడియో నాటకాలు, సామెతలు వంటివి ప్రత్యేకంగా ప్రసారం చేస్తున్నాయి. సమస్యలతో ఫోన్ చేస్తే నిపుణులతో సమాధానం ఇప్పించే ఫోన్ ఇన్లూ ఉంటున్నాయి. కొన్నిచోట్ల వలస కూలీలకు రేషన్ కార్డులు మంజూరు చేసేందుకూ సహాయపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కమ్యూనిటీ రేడియోలు కరోనా స్థానిక వార్తలే కాక పదమూడు జిల్లాల సమాచారాన్నీ ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాయి. ఈ కమ్యూనిటీ రేడియోలన్నీ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తమ ప్రసారాలను వినిపిస్తున్నాయి. ఒక్క కరోనా పరిస్థితుల్లోనే కాదు... అవి గొంతు విప్పిన నాటి నుంచీ ప్రతీ కష్టకాలంలోనూ స్థానికులకు, స్థానిక పాలనావ్యవస్థకు మ«ధ్య వారధిగా నిలుస్తున్నాయి. సంచలనాలకన్నా సమాచారానికి విలువనిçస్తూ తమ బాధ్యతను నెరవేరుస్తున్నాయి. మన ఊరు.. మన రేడియో .. ఈ క్యాప్షన్‌తో 2013లో కాకినాడలోని తీరప్రాంతం కేంద్రంగా మొదలైంది ‘రేడియో అల’. ఫౌండర్ ఎమ్వీఆర్ ఫణీంద్ర. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న మత్స్యకారులు, వారి కుటుంబాల్లోని మహిళల కోసం ఏర్పడింది. సముద్రానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని మత్స్యకారులకు అందిస్తూ, సాధికారత సాధించే దిశను మహిళలకు చూపిస్తోందీ రేడియో. ఆడవాళ్లే నడిపిస్తున్న ఈ ‘రేడియో అల’ స్టేషన్‌కు డైరెక్టర్ కొండ్ర సత్యవతి. ‘రేడియో అల’ స్టేషన్ డైరెక్టర్ కొండ్ర సత్యవతి కర్షకవాణి... ఇది మన రేడియో చిత్తూరు జిల్లాలోని పుంగనూరు కేంద్రం నుంచి రైతుల సంక్షేమాన్ని వినిపిస్తోందీ రేడియో. 2015లో మొదలైన ఈ వాణి..వర్షపాతం, వర్షాభావ పరిస్థితులు, అనుగుణమైన పంటలు, విత్తనాలు, ఎరువులు, సబ్సిడీల నుంచి రైతు సంక్షేమ పథకాలు, బీమాపథకాలు వంటి సమస్త సమాచారంతో చెవినిల్లు కడుతోంది. అలాగే మహిళలను ఎంట్రప్రెన్యూర్స్‌గా తయారు చేయడానికి జ్యూట్ బ్యాగులు, ఆర్టిఫీషియల్ జ్యువెలరీ తయారీ, కిచెన్ గార్డెన్స్‌లో శిక్షణ కార్యక్రమాలూ నిర్వహిస్తోంది. కర్షకవాణి ఫౌండర్ ఎమ్. కిరణ్‌కుమార్, స్టేషన్ మేనేజర్ టీకే ప్రశాంత్. ఈ రేడియో కోసం కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా సేవలు అందిస్తున్న శశికళతోపాటు మరో ముగ్గురు ఉద్యోగులూ ఉన్నారు ‘కర్షకవాణి’ కార్యక్రమాల మీద సిబ్బంది చర్చ వాయిస్ ఫర్ వాయిస్‌లెస్ అంటూ గ్రామీణ యువత,ఆసరాలేని, ఆసరా కోల్పోయిన మహిళల కోసం కోదాడ కేంద్రంగా ప్రసారాలు మొదలుపెట్టింది ‘రేడియో గురు’. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణప్రాంతంలో సాధికారత, ఎంట్రప్రెన్యూర్షిప్ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఆ బాటగా యువతను, మహిళలను నడిపించే ప్రయత్నం చేస్తోంది. దీనికి ఫౌండర్స్ కోట రామారావు, కాకునూరు వెంకట్‌రెడ్డి. వీళ్లతోపాటు ఇద్దరు మహిళా ఆర్జేలూ పనిచేస్తున్నారు. 2017లో స్టార్ట్ అయిన ‘రేడియో గురు’కి లిజనర్స్ క్లబ్ కూడా ఉంది. ‘రేడియో గురు’ స్టేషన్లో ఆర్జె జాస్మిన్ దిల్ సే హైదరాబాదీ అని చెప్తున్న ‘రేడియో చార్మినార్’ 2015లో పాతబస్తీ కేంద్రంగా ప్రారంభమైంది. హిందూ, ముస్లిం కలగలసిన దక్కనీ సంస్కృతిని ప్రతిబింబించే ఇన్ఫోటైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. అందులో భాగమైన ఢోలక్ కే గీత్ వంటి వాటిని స్పాన్సర్ కూడా చేస్తోందీ రేడియో. దీనికి ఫౌండర్ సంతోష్ అనుబత్తుల. స్థానికులతోపాటు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆర్జేలుగా పనిచేస్తున్నారు . అతిథితో ‘రేడియో చార్మినార్’ ఆర్జే తార -
కరోనా కష్టంతో.. గురుగ్రామ్‌కి ఆవాజ్
టీవీలు, ఇంటర్నెట్ రాకముందు యుద్ధం, ప్రకృతి వైపరీత్యం, సంక్షోభం.. ఏది వచ్చినా చెవిలో వేసింది రేడియో! పండితులకూ పామరులకు దగ్గరైంది...ఆబాల గోపాలం అభిమానాన్ని పొందింది! అందుకే రేడియో అంటే ఆ తరానికి అందమైన జ్ఞాపకమే కాదు.. ఈ తరానికీ క్రేజే! కాబట్టే కదా ప్రధాని మనకీ బాత్‌నూ రేడియోలోనే వినిపిస్తున్నారు. ఆదరణ ఉండబట్టే కదా ఎఫ్‌ఎమ్‌లుగా ట్రాన్స్ఫామ్ అయింది. మూలమూలన ఉన్నవాళ్లను చేరడానికి కమ్యూనిటీ రేడియోగానూ వచ్చింది.. ఢిల్లీ సర్కారు దృష్టిలోనూ పడింది ‘గురుగ్రామ్‌కి ఆవాజ్’ అనే కమ్యునిటీ రేడియో.. కరోనా కష్టంతో. ‘భాయియో.. ఔర్ బహెనో.. గురుగ్రామ్‌కి ఆవాజ్ సునియే...’ అంటూ ఉదయమే గొంతు సవరించుకుంటుంది ఢిల్లీ, గురుగ్రామ్‌లోని సెక్టార్ 31లో ఉన్న ఈ కమ్యూనిటీ రేడియో స్టేషన్. చుట్టూ పది కిలోమీటర్ల మేర వలస కార్మికులు ఉంటారు. వీళ్లతోపాటు స్థానిక పేదలకూ విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచడానికి ఈ కమ్యూనిటీ రేడియో పనిచేస్తోంది గత పదేళ్లుగా. దీని వ్యవస్థాపకురాలు ఆర్తి జైమన్. ఇప్పుడు దీన్ని ఢిల్లీ సర్కారు ‘కరోనా’ మీద ఆ కమ్యూనిటీవాసుల్లో అవగాహన కల్పించడానికి వేదికగా మార్చుకుంది. భోజనం, మందులు.. కౌన్సెలింగ్.. వలసకార్మికులతోపాటు స్థానికుల కోసమూ ప్రభుత్వం పంపే ఆహార పొట్లాలు, నిత్యావసరకుల వ్యాన్లు ఏయే సమయాల్లో ఎక్కెడెక్కడికి వస్తాయి? భౌతికదూరం ఎందుకు పాటించాలి? ఏయే ప్రాంతాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి? ఆ ప్రాంతాలకు వెళ్లడం ఎందుకు నిషిద్ధం వరకు అన్ని వివరాలనూ కమ్యూనిటీ రేడియోలో వినిపిస్తారు. గురుగ్రామ్‌లోని పలు ప్రదేశాల్లో క్వారంటైన్ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటారు. ఒకవేళ ఏ రోజైనా సరుకులు అందకపోయినా చేతిలో డబ్బు లేకపోయినా గాభరా పడకుండా ఆ కొరతను ఎలా అధిగమించాలో కౌన్సెలింగ్ ఇస్తూ హెల్ప్‌లైన్ నంబర్లనూ చెప్తారు. శానిటైజర్లు, శానిటరీ నాప్కిన్స్, మందులూ అందేలా చూస్తోంది స్థానిక నేతల ద్వారా. మొత్తంగా కరోనా కష్టకాలంలో ఈ కమ్యూనిటీ రేడియో గురుగ్రామ్ స్థానికులు, వలసకార్మికులకు ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా పని చేస్తోంది. ‘ఈ రోజు రేషన్ దొరకలేదు... ఎవరిని అడగాలి? ఇలా ఎన్నాళ్లు ఇళ్లల్లోనే ఉండాలి? జనాలు బయట కనిపిస్తే పోలీసులు కొడుతున్నారంట కదా నిజమేనా? అంటూ రోజుకు కనీసం వంద ఫోన్ కాల్స్ వస్తూంటాయి మాకు. వాళ్ల సందేహాలు తీర్చి, భయాలు, ఆందోళనలన్నిటినీ పోగొడ్తున్నాం’ అంటున్నారు మూడేళ్లుగా ఆ కమ్యూనిటీ రేడియోలో పనిచేస్తున్న ప్రీతి ఝక్రా. కాలినడకన బయలుదేరిన వాళ్లను ఆపేసింది... లాక్డౌన్ మొదలవగానే పని దొరక్క బెంబేలెత్తిపోయిన చాలామంది వలస కార్మికులు ఢిల్లీ నుంచి వాళ్ల వాళ్ల ప్రాంతాలకు కాలినడకన వెళ్లిన సంఘటనలు సంచలనమయ్యాయి. గురుగ్రామ్ చుట్టుపక్కల ఉన్న వాళ్లు కూడా ముల్లెమూటా సర్దుకున్నారు గురుగ్రామ్‌కి వెళ్లడానికి. అప్పుడు ఆవాజే వాళ్లను ఆపింది. ‘ఇలా కాలినడకన వెళ్లడం ప్రమాదం. ఎక్కడున్నవాళ్లు అక్కడే ఉండిపోండి. మీకే కష్టం కలగకుండా సర్కారు చూసుకుంటుంది అని కొంతమంది స్థానిక నేతలు, ప్రభుత్వ అధికారులతోనూ రేడియోలో మాట్లాడించింది. అప్పటికప్పడు ప్రభుత్వమూ ఆ వలస కార్మికుల కోసం నిత్యావసర సరుకులను, కొంత రొక్కాన్నీ పంపిణీ చేసింది. అంతేకాదు, వలసకార్మికులు ఉంటున్న ఇళ్ల అద్దెను ఒక రెండు నెలలు వాయిదా వేయాలనీ ఇళ్ల యజమానులనూ కోరింది. కరోనా లక్షణాల నుంచి లైవ్‌ప్రొగ్రామ్ వరకు.. దాదాపు నెల రోజుల నుంచి కరోనా సమాచారానికే అంకితమైన ఈ కమ్యూనిటీ రేడియో ప్రతిరోజూ నలభై నిమిషాల లైవ్ ప్రోగ్రామ్‌ను ప్రసారం చేస్తోంది. ఇందులో స్థానిక నేతలతోపాటు రెవెన్యూ, పోలీసు అధికారులూ పాలుపంచుకుంటున్నారు. గురుగ్రామ్ వాసులు డిప్రెషన్లోకి వెళ్లకుండా కొన్ని వినోద కార్యక్రమాలనూ ప్రసారం చేస్తోంది. వీటన్నిటితోపాటు ఎప్పటికప్పుడు కరోనా అప్‌డేట్స్‌నూ ఇస్తుంటారు. ఈ కార్యక్రమాలన్నిటినీ సింగిల్ హ్యాండ్ మీద నడిపిస్తున్న రేడియో జాకీ ప్రీతి ఝాక్రా. నిజానికి అయిదుగురు ఉద్యోగులుంటారు. కాని లాక్డౌన్ ప్రకటించగానే అందరూ వాళ్ల వాళ్ల ఇళ్లకే పరిమితమవడంతో ప్రీతి ఒక్కరే అటు రిపోర్టర్‌గా ఇటు రేడియో జాకీగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు వలంటీర్ల సహాయంతో. -
లోకల్ రేడియో
సిటీవాసులకు ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్దురపోయే వరకు మస్తీగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఎఫ్ఎంలకు ‘కమ్యూనిటీ రేడియో’లు కూడా శ్రుతి కలుపుతున్నాయి. ఒక ప్రాంత ప్రజల సాధకబాధకాలను వివరిస్తూనే, ప్రసారాలతో వారిలో సామాజిక స్పృహ కలిగిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలైతే తమ కాలేజీ విద్యార్థులు బయట ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం చేసి నిలదొక్కుకునేందుకు దోహదపడేలా డిఫరెంట్ ఐడియాలజీతో కమ్యూనిటీ రేడియోలను ప్రారంభించాయి. సిటీలోనే తొలి కమ్యూనిటీ రేడియో డెక్కన్ రేడియో 107.8 ఎఫ్ం. మెదక్‌లోని సంఘం రేడియో స్ఫూర్తిగా అబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు 2009 డిసెంబర్ 23న డెక్కన్ రేడియో 107.8 ఎఫ్ఎంను ప్రారంభించింది. అబిడ్స్‌లో ఉండే ఈ రేడియో స్టేషన్ ప్రసారం చేసే కార్యక్రమాలు ఆ ప్రాంతం నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ప్రసార ం అవుతాయి. లెర్న్ ఇంగ్లిష్, వారుుస్ అండ్ యూక్సెంట్ ట్రైనింగ్, పబ్లిక్ హెల్త్ అండ్ హైజిన్, మహిళా సాధికారత, వరకట్న సమస్యలు, పేదలు అభివృద్ధి చెందడం ఎలా.. తదితర కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. యువతకు ఉపయోగపడేలా ఉద్యోగాల నోటిఫికేషన్ సమాచారాన్ని కూడా అందిస్తోంది. క్రీడా విషయాలు, ఔత్సాహిక కళాకారులతో వినోద కార్యక్రవూలనూ ప్రసారం చేస్తోంది. వుతాలకు అతీతంగా పండుగ రోజుల్లో వాటి ప్రాధాన్యతను తెలిపే కార్యక్రవూలను 24 గంటల పాటు ప్రసారం చేస్తోంది. సాధారణ దినాల్లోనైతే ఉదయుం 8 నుంచి వుధ్యాహ్నం 12 గంటల వరకు, సాయుంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రసారాలు చేస్తోంది. త్వరలోనే ప్రతిరోజూ 24 గంటల ప్రసారాలకు సవూయుత్తవువుతోంది. ఔత్సాహికులకు ఉచిత శిక్షణ, ప్లేస్మెంట్ రేడియోలో పని చేయాలనుకునే ఔత్సాహికుల కోసం డెక్కన్ రేడియో 107.8 ఎఫ్ఎం ఉచిత శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తోంది. సోమవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ట్రైనింగ్ క్లాస్‌లు ఉంటాయి. దీనికి వయోపరిమితి లేదు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్లు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 9848256515లో సంప్రదించవచ్చు. కేఎంఐటీ 90.4 ఎఫ్ఎం... విద్యార్థులకు అన్నిరకాలుగా ఉపయోగపడేలా రెండేళ్ల క్రితం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ వేదికగా కేఎంఐటీ 90.4 ఎఫ్ఎం ప్రారంభమైంది. కాలేజీ పనిదినాల్లో ఈ రేడియో కార్యక్రవూలు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రసారమవుతాయి. ఒక్కో సబ్జెక్ట్ టీచర్‌ను విద్యార్థులు చేసిన ఇంటర్వ్యూలు, కఠినమైన సబ్జెక్ట్లపై లెక్చరర్ల ప్రత్యేక పాఠాలు..ఇలా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను వారిచేతే నిర్వహిస్తోంది కేఎంఐటీ. ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి రోజుల్లో విద్యార్థులు వినోద కార్యక్రవూలనూ అందిస్తారు. బోల్ హైదరాబాద్ 90.4 ఎఫ్ఎం.. హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చొరవతో 2011లో ఈ రేడియో ప్రారంభమైంది. పది కిలోమీటర్ల పరిధిలో ఇందులోని కార్యక్రమాలు విద్యార్థులు, వాలంటీర్ల పర్యవేక్షణలో ప్రసారవువుతుంటారుు. ఉదయం 7.30 నుంచి 9.00 వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.00 వరకు ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, సమాచారం, పాఠాలు, గెస్ట్‌లతో ఇంటర్వ్యూలు ప్రసారమవుతుంటాయి. ఇవే కాకుండా తార్నాకలో త్వరలోనే మరో కమ్యూనిటీ రేడియో ప్రారంభంకానుంది. - వాంకె శ్రీనివాస్