కాంస్యంపై జిజ్ఞాస్, సురేఖ గురి
వుజి (చైనా): ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో కాంపౌండ్ టీమ్ విభాగంలో భారత జట్లు కాంస్య పతక పోరుకు అర్హత సాధించాయి. జూనియర్ పురుషుల, మహిళల విభాగాల్లో భారత జట్లు సెమీఫైనల్లో ఓటమి పాలయ్యాయి. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో వెన్నం జ్యోతి సురేఖ, సరికొండ జయలక్ష్మీ, స్వాతి దుద్‌వాల్‌లతో కూడిన భారత మహిళల జట్టు 221-225తో టాప్ సీడ్ అమెరికా చేతిలో పరాజయం పాలైంది. శనివారం జరిగే కాంస్య పతక పోరులో మెక్సికోతో టీమిండియా తలపడుతుంది. పురుషుల సెమీఫైనల్స్‌లో చిట్టిబొమ్మ జిజ్ఞాస్, రజత్ చౌహాన్, సుధాకర్ కుమార్ పాశ్వాన్‌లతో కూడిన భారత జట్టు 231-233తో మెక్సికో చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్ పోటీపడుతుంది.
కాంపౌండ్ జూనియర్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ చిట్టిబొమ్మ జిజ్ఞాస్ సెమీఫైనల్లో ఓడిపోగా... భారత్‌కే చెందిన రజత్ చౌహాన్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్స్‌లో రజత్ 148-142తో బాప్టిస్ట్ స్కారియెక్స్ (బెల్జియం)పై నెగ్గగా... జిజ్ఞాస్ 146-148తో స్టీఫెన్ హాన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. స్వర్ణం కోసం హాన్సెన్‌తో రజత్, కాంస్యం కోసం స్కారియెక్స్‌తో జిజ్ఞాస్ పోటీపడతారు.