గ్రంథ సుగంధం
జ్యోతిష గ్రంథం హస్తరేఖలపై సమగ్ర పరిశోధన గ్రంథం
జ్యోతిష శాస్త్రం, సంఖ్యాశాస్త్రాల లాగే లోతైనదీ, ప్రాచుర్యం గలదీ హస్తసాముద్రికం. సాముద్రిక శాస్త్రంలో అపార పరిశోధనలు చేసి, సాముద్రిక సరస్వతిగా ప్రఖ్యాతి పొందిన నాయుడు గోపాలకృష్ణ కొన్ని వందలు, వేల మంది హస్తరేఖలను పరిశీలించి, వాటి ఆధారంగా ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని రూపొందించారు. నిజానికి హస్తసాముద్రిక ం మీద పుస్తకాలు కొత్తేమీ కాదు. హిందీ, ఇంగ్లిష్ భాషలలో అనేక గ్రంథాలున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఇంత సాకల్యంగా ఉన్న పుస్తకాలు అరుదు. గతంలో ‘భాగ్యరేఖ’ అనే గ్రంథాన్ని రచించిన గోపాలకృష్ణ, దానికి లభించిన ప్రోత్సాహ ఉత్సాహంతో ఈ రచన చేశారు.
ఇందులో అరచేతి పొందికను బట్టి జాతకులు ఎటువంటి స్వభావం కలవారు, వారి పనితీరు ఎలా ఉంటుంది, ఏ వృత్తి, ఉద్యోగాల్లో స్థిరపడతారు... అన్నదానితో ఆరంభించి, అరచేయి వేళ్ల కొలత, అరచేతి వెనక భాగాన ఉండే వెంట్రుకల అమరిక, అరచేయి రంగు తదితరాల ఆధారంగా అప్రతిభులను చేసే ఆసక్తికరమైన ఎన్నో వివరాలను పొందుపరిచారు. వాటితోబాటు గురువ్రేలు అంటే ఏమిటి, శనివ్రేలు అంటే ఏమిటి, బొటన వేలిని ఏమని పిలుస్తారు, రెండవ వేలిని ఏమంటారు... వేలికి ఉండే కణుపులు ఎంత పరిమాణంలో, ఎలా ఉంటే ఆ వ్యక్తి స్వరూప స్వభావాలేమిటి... వంటి వాటిని తొమ్మిది అధ్యాయాల ఈ పుస్తకంలోని ఎనిమిది అధ్యాయాలలో రేఖాచిత్రాల సాయంతో చక్కగా వివరించారు. ఇక తొమ్మిదవ అధ్యాయంలో సంఖ్యాశాస్త్రమంటే ఏమిటో, దాని ప్రాశస్త్యమేమిటో అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు తెలియజేశారు. మొత్తం మీద ఈ గ్రంథం సాముద్రిక శాస్త్రం గురించి తెలిసిన వారికే కాదు, అసలు ఆ శాస్త్రం గురించి ఓనమాలు తెలియని వారికి కూడా ఎంతోకొంత ఆసక్తిని, అనురక్తిని పెంచే లా చేస్తుందనడంలో సందేహం లేదు.
సాముద్రికము
పుటలు: 536, వెల రూ. 500
రచయిత ఫోన్ నం.9885126995; ప్రతులకు:
ఆర్.వసంతలక్ష్మీనారాయణరావు
ఇం.నం. 153, ఈశ్వర్ విల్లాస్,
నిజాంపేట విలేజ్, హైదరాబాద్;
ఫోన్ నంబర్ 9393053029
ఈమెయిల్: palmistngk@gmail.com
- డి.వి.ఆర్