Contract employees salaries
-
కాంట్రాక్టు ఉద్యోగుల్లో నైరాశ్యం
నిజామాబాద్‌అర్బన్ : వైద్యారోగ్య శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్నా వేతనాలు పెరగట్లేదు.. ఉద్యోగాలు రెగ్యులర్ కావట్లేదు.. చాలీచాలని జీతాలతో జీవితాలు దుర్భరంగా మారాయని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం ఇటీవల జేఏసీ ఏర్పాటు కావడం, వరుస ఆందోళనలు చేపట్టడంతో సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసింది. ఐక్య పోరాటాలతో తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ కలిగింది. అయితే, వారం రోజులకే జేఏసీ ప్రతినిధులు ముఖం చాటేయడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో మళ్లీ కలవరం మొదలైంది. జేఏసీగా ఏర్పడి.. జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏడు సీహెచ్‌సీలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 570 కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 374 మంది రెండో ఏఎన్ఎంలు, 72 మంది కాంట్రాక్ట్ ఆరోగ్య కార్యకర్తలు, క్షయ విభాగం ఆర్బీఎస్కే, ఆయూష్, 108, 104 విభాగాల్లో 271 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. అయితే, వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఏకమయ్యారు. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. రెగ్యులరైజేషన్‌తో పాటు వేతన సవరణ వంటి ప్రధాన డిమాండ్లతో జేఏసీ నిరసనలకు శ్రీకారం చుట్టింది. మే 1, 2 తేదీల్లో ప్రతీ ఆరోగ్య కేంద్రంలో విధుల బహిష్కరణ,4, డీఎంహెచ్‌వో ఆఫీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు. 8న వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే, ఈ కార్యక్రమం ఒక్కసారిగా వాయిదా పడింది. అప్పటి నుంచి నిరసనలు లేవు. ఉన్నతాధికారులు చర్చలకు పిలవడంతోనే నిరసన కార్యక్రమాలు వాయిదా వేశామని జేఏసీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే, చర్చలు మాత్రం జరగక పోవడం గమనార్హం. మరోవైపు, రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తెరపైకి రావడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకున్న వారే కరువయ్యారు. చాలీచాలని వేతనాలతో.. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి రూ.10 వేల వేతనంతోనే పని చేస్తున్నారు. వేర్వేరు శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కాగా, వైద్యారోగ్యశాఖలో మాత్రం క్రమబద్ధీకరణ కాలేదు. వేతన సవరణ కూడా జరగలేదు. పదేళ్లుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.10 వేలతో పిల్లల చదువులు, కుటుంబ పోషణచాలా భారంగా మారిందని వాపోతున్నారు. రెండో ఏఎన్ఎంలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారిని పట్టించుకొనే వారు లేరు. మద్దతుగా నిలవాల్సిన వైద్యారోగ్య శాఖలోని వివిధ సంఘాలు కూడా ముఖం చాటేశాయి. మరోవైపు, కొన్ని సంఘాల ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం నిరసనకు దిగుతామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ముందుకొచ్చారు. తీరా వారం రోజుల తర్వాత ఒక్కరు కూడా ముఖం చూపించ లేదు. ఉద్యోగ సంఘాల నేతలు తమకు మద్దతుగా నిలవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి.. 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నాం. ఇన్ని రోజులుగా చేస్తున్నా రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. చాలీచాలని వేతనంలో ఎలా బతికేది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా మా సేవలు గుర్తించాలి. రెగ్యులర్ చేయడంతో వేతనాలు పెంచాలి. – పద్మ, రెండో ఏఎన్ఎం ఆందోళన వద్దు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం. ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతోనే నిరసనలు విరమించాం. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి, డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ ప్రకటిస్తాం. కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – దాసు, వైద్యారోగ్యశాఖ జిల్లా జేఏసీ చైర్మన్ -
కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరీనా..?
కర్నూలు(హాస్పిటల్) : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ, వారి మెడపైనే జీవో నెం.27 అనే కత్తి వేలాడ దీసిందని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంసీ.నరసింహులు, ఎన్డీ. సంపత్‌కుమార్ అన్నారు. వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నరసింహులు, సంపత్‌కుమార్ మాట్లాడుతూ జీవో నెం.27 కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. వెంటనే ఆ జీవోను సవరించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఒకే పనికి...ఒకే వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్‌కు వారు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. వెంకటేశ్వర్లు, కోశాధికారి సత్యనారాయణ, నాయకులు సాయిరామ్, బాలకృష్ణయ్య, హరికృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
గుత్ప ఎత్తిపోతలలో అవినీతి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహ ణ లో 2011 నుంచి కొందరు బినామీలు ‘చిన్న’ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారు. 2010 నుంచి 2012 వరకు ఏటా రూ.18.59 కోట్లు ఈ పథకం కోసం వెచ్చించారు. పనుల లో అనేక లోపాలు, స్వాహాలు జరిగినా ప్రభుత్వం, అధికారులు బయటపడనీయకుండా జాగ్రత్తగా వ్యవహరించా రు. తాజాగా ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 25న రూ.55.78 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను 2013 ఆగస్టు 1 నుంచి 2015 జూలై 31 వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బి.అరవిందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం నిర్వహణ, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు, ఇతర మరమ్మతుల కోసం ఏడాదికోసారి బహిరంగ టెండర్లు నిర్వహించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఓ బడా కంపెనీని రంగంలోకి దింపిన అధికారులు ఆర్మూరుకు చెందిన ఓ కాంగ్రెస్ నేతకు నిధులు ధారదత్తం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నందిపేట, బాల్కొండ, మాక్లూరు, వేల్పూరు, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన 55 గ్రామాలలో దాదాపు 38,967 ఎకరాలకు సాగునీరు అందించే ఈ పథకం నిర్వహణ పనులలో పెద్దలు గద్దల్లా వాలారు. రెండేళ్ల నిర్వహణ కోసం నిధులు విడుదలయ్యాక, సాధారణ ఎన్నికలు రావడం, పరిస్థితి మారడంతో అధికారులు ఆగమేఘాల మీద గుట్టుచప్పుడు కాకుండా టెండర్లు నిర్వహించారు. గత జూలై 1 నుంచి 2015 జూలై 31 వరకు హైదరాబాద్‌కు చెందిన రవి ఎంటర్ప్రెజైస్కు అగ్రిమెంట్ చేసినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మొక్కుబడి టెండర్లు నీటి పారుదలశాఖ నిర్వహణలో ఉన్న ఈ పథకంలో ఆర్మూరుకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నేత ఏటా రూ. కోట్లు కాజేస్తున్నట్లు ప్రస్తుత నీటిపారుదలశాఖ మంత్రికి జి ల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇటీవల ఫిర్యాదు చేసినట్లు సైతం వార్తలు వచ్చాయి. బినామీ కాంట్రాక్టర్‌గా మూడేళ్లుగా నీటి పథకాల నిర్వహణ పేరిట భారీగా అవకతకవలు పాల్పడుతుండగా, కొందరు అవినీతి అధికారులు ఆయనతో భాగస్వాములు అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. గడచిన మూడేళ్లలో మొక్కుబడి టెండర్లతో బడా కంపెనీల పేరున అగ్రిమెంట్ జరిగినా, ఉప గుత్తేదారులను రంగంలోకి దింపినా, క్రమేపీ సదరు కాంగ్రెస్ నేతే ‘చిన్న’గా కాంట్రాక్టర్‌గా అవతారమెత్తారని సంబంధిత అధికారులే వాపోతున్నారు. అయినా, ఆయనే ఈ ఏడాది జూలై ఒకటిన, 12 నెలల కోసం గుత్ప ఎత్తిపోతల పథకం నిర్వహణ పనుల టెండర్లు నిర్వహించినా మళ్లీ అతనే నిర్వహణ బాధ్యతలు చూస్తున్నట్లు నీటి పారుదలశాఖలో చర్చ జరుగుతోంది. మూడేళ్లుగా మరమ్మతులు చేయకుండానే చేసినట్లు గా, క్లోరినేషన్ పద్దుల పేరుతో రూ.కోట్లు దొడ్డిదారిన దిగమింగుతున్నారన్న ఫిర్యాదులున్నా గత ప్రభుత్వం హయాంలో ఎవరూ పట్టించుకోలేదు. అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు కోరుతున్నారు.