వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు (ఫైల్)
నిజామాబాద్‌అర్బన్ : వైద్యారోగ్య శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్నా వేతనాలు పెరగట్లేదు.. ఉద్యోగాలు రెగ్యులర్ కావట్లేదు.. చాలీచాలని జీతాలతో జీవితాలు దుర్భరంగా మారాయని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం ఇటీవల జేఏసీ ఏర్పాటు కావడం, వరుస ఆందోళనలు చేపట్టడంతో సిబ్బందిలో ఆనందం వెల్లివిరిసింది. ఐక్య పోరాటాలతో తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశ కలిగింది. అయితే, వారం రోజులకే జేఏసీ ప్రతినిధులు ముఖం చాటేయడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో మళ్లీ కలవరం మొదలైంది.
జేఏసీగా ఏర్పడి..
జిల్లాలో 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 375 ఆరోగ్య ఉప కేంద్రాలు, ఏడు సీహెచ్‌సీలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 570 కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. 374 మంది రెండో ఏఎన్‌ఎంలు, 72 మంది కాంట్రాక్ట్ ఆరోగ్య కార్యకర్తలు, క్షయ విభాగం ఆర్‌బీఎస్‌కే, ఆయూష్, 108, 104 విభాగాల్లో 271 మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. అయితే, వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం ఏకమయ్యారు.
జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేసుకున్నారు. రెగ్యులరైజేషన్‌తో పాటు వేతన సవరణ వంటి ప్రధాన డిమాండ్లతో జేఏసీ నిరసనలకు శ్రీకారం చుట్టింది. మే 1, 2 తేదీల్లో ప్రతీ ఆరోగ్య కేంద్రంలో విధుల బహిష్కరణ,4, డీఎంహెచ్‌వో ఆఫీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు. 8న వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
అయితే, ఈ కార్యక్రమం ఒక్కసారిగా వాయిదా పడింది. అప్పటి నుంచి నిరసనలు లేవు. ఉన్నతాధికారులు చర్చలకు పిలవడంతోనే నిరసన కార్యక్రమాలు వాయిదా వేశామని జేఏసీ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. అయితే, చర్చలు మాత్రం జరగక పోవడం గమనార్హం. మరోవైపు, రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ తెరపైకి రావడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకున్న వారే కరువయ్యారు.
చాలీచాలని వేతనాలతో..
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్ల తరబడి రూ.10 వేల వేతనంతోనే పని చేస్తున్నారు. వేర్వేరు శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కాగా, వైద్యారోగ్యశాఖలో మాత్రం క్రమబద్ధీకరణ కాలేదు. వేతన సవరణ కూడా జరగలేదు. పదేళ్లుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.10 వేలతో పిల్లల చదువులు, కుటుంబ పోషణచాలా భారంగా మారిందని వాపోతున్నారు.
రెండో ఏఎన్‌ఎంలు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా వారిని పట్టించుకొనే వారు లేరు. మద్దతుగా నిలవాల్సిన వైద్యారోగ్య శాఖలోని వివిధ సంఘాలు కూడా ముఖం చాటేశాయి. మరోవైపు, కొన్ని సంఘాల ప్రతినిధులు సమస్యల పరిష్కారం కోసం నిరసనకు దిగుతామని, అవసరమైతే సమ్మెకు దిగుతామని ముందుకొచ్చారు. తీరా వారం రోజుల తర్వాత ఒక్కరు కూడా ముఖం చూపించ లేదు. ఉద్యోగ సంఘాల నేతలు తమకు మద్దతుగా నిలవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి..
15 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నాం. ఇన్ని రోజులుగా చేస్తున్నా రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారు. చాలీచాలని వేతనంలో ఎలా బతికేది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇకనైనా మా సేవలు గుర్తించాలి. రెగ్యులర్ చేయడంతో వేతనాలు పెంచాలి. – పద్మ, రెండో ఏఎన్‌ఎం
ఆందోళన వద్దు..
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాం. ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతోనే నిరసనలు విరమించాం. త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి, డిమాండ్ల సాధన కోసం కార్యాచరణ ప్రకటిస్తాం. కాంట్రాక్ట్ సిబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– దాసు, వైద్యారోగ్యశాఖ జిల్లా జేఏసీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment