పర్మినెంట్ ఆశలు
కొత్త రాష్ట్రం కొలువులు తేనుంది. ఏళ్ల తరబడి అరకొర వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేస్తోంది. వీరిని సర్కారు ఉద్యోగాలు వరించనున్నాయి. మరోవైపు ఉన్న ఉద్యోగుల్లో చాలా మందికి రాష్ట్రం ఏర్పడ్డాక ప్రమోషన్లు రానున్నాయి.
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండదని.. అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. తాజాగా.. ఈ నెల 23న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేసీఆర్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం తమ తలరాత మార్చుతుందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అందరికా? కొందరికా?
పర్మినెంట్ విషయమై కొన్ని క్యాడర్ల ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. అందరినీ పర్మినెంట్ చేస్తారా? లేక మూడు, నాలుగో తరగతి ఉద్యోగులకే అవకాశం కల్పిస్తారా? అనే విషయాలపై స్పష్టత రాలేదు. ప్రస్తు త పరిస్థితుల్లో గెజిటెడ్ స్థాయిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే.. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటని ఓయూ జేఏసీ, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. పోస్టులు ప్రకటించి, పరీక్ష ద్వారా భర్తీ చేయాలని వారు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో గెజిటెడ్‌స్థాయి ఉద్యోగులను పర్మినెంట్ చేసే విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు చెప్తున్నారు.
ఔట్‌సోర్సింగ్‌లో ఉత్కంఠ
ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీల ఆధీనంలో పని చేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలంటే సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. దీంతో వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కేసీఆర్ ఉద్యోగ సంఘాలకు వివరించారు. కమిటీ నివేదికననుసరించి నిర్ణయం తీసుకోనున్నారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం కొత్త ప్రభుత్వంలో ఉండబోవని ఉద్యోగ సంఘ నాయకులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 45 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. కొత్త రాష్ట్రంలో కాంట్రా క్టు సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేస్తే ప్రభుత్వంపై ఆర్థికభారం పెరిగే అవకాశాలున్నాయి.
ఎక్కడెక్కడ? ఎందరు?
జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వశాఖల్లో కలిపి 22,670 మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్నారు. వీరిలో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న వారి సంఖ్య 12 వేలకు పైనే. ప్రాథమిక విద్యశాఖలో 3 వేల మంది కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఇందిర క్రాంతి పథం(ఐకేపీ), ఉపాధిహామీ పథకంలో 1500 మంది చొప్పున, మెప్మాలో 700, మున్సిపాలిటీల్లో 2500, వైద్యారోగ్యశాఖలో థర్డ్ పార్టీ ఉద్యోగులు 500, సెకండ్ ఏఎన్ఎంలు 500, ఆర్టీసీలో 800, సింగరేణిలో 4 వేలు, విద్యుత్‌శాఖలో 1200, పంచాయతీరాజ్‌శాఖలో 5 వేలు, డ్వామా, అటవీశాఖలో వంద మంది చొప్పున, ఉన్నత విద్యాశాఖలో 900 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. వీటితోపాటు గృహనిర్మాణం, పశుసంవర్ధక, వ్యవసాయశాఖల్లోనూ కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరందరూ తమకు పర్మినెంట్ అవుతుందనే ఆనందంలో ఉన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
శుభపరిణామం
ఎం.ప్రతాపరెడ్డి, టీఆర్టీఎఫ్, జిల్లా అధ్యక్షుడు
విద్యాశాఖలో ఏళ్ల నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు.. స్వీపర్లు ఉన్నారు. కేసీఆర్ నిర్ణయంతో.. 1989 నుంచి జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేస్తున్న 670 మంది పార్ట్‌టైం స్వీపర్ల ఉద్యోగాలు పర్మినెంట్ కానున్నాయి. కొత్తరాష్ట్రంలో.. వీరిలాంటి వేలాది మంది కలలు నెరవేరనున్నాయి. ఇది శుభపరిణామం.