contract killers
-
తండ్రిని చంపితే రూ.3 లక్షలు.. తల్లిని కూడా చంపితే రూ.5 లక్షలు!
నెల్లూరు (క్రైమ్): దొంగతనం కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను పోలీసులు విచారించగా.. తల్లిదండ్రులను హతమార్చేందుకు వారి కుమారుడు.. కిరాయి ఇచ్చిన వైనం వెలుగులోకొచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాళెం పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చోరీ జరిగిన ప్రదేశాల్లో లభ్యమైన ఆధారాల ఆధారంగా పాతనేరస్తులైన ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంకు చెందిన షేక్ గౌస్‌బాషా, బుచ్చిపట్టణం ఖాజానగర్‌కు చెందిన షేక్ షాహూల్‌ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఐదు దొంగతనాలతో పాటు కావలి రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కిరాయి హత్యకు రెక్కీ నిర్వహించినట్టు వెల్లడించారు. దీంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి వారి నుంచి రూ 2.95 లక్షలు విలువచేసే బంగారం, రూ.30వేలను స్వాధీనం చేసుకున్నారు. మూడు సార్లు రెక్కీ కావలి పట్టణం తుఫాన్‌నగర్‌కు చెందిన బాలకృష్ణయ్యకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఇద్దరు కుమారులకు ఆయన గతంలో సమానంగా ఆస్తి పంచాడు. అయితే తనకు సరిగా పంచలేదని లక్ష్మీనారాయణ తండ్రితో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను అడ్డుతొలగించుకుంటే వారి పేర ఉన్న ఆస్తి తనకు దక్కుతుందని లక్ష్మీనారాయణ భావించాడు. తన స్నేహితుడైన కావలికి చెందిన సుబ్బారావుకు విషయం తెలిపాడు. అతడి ద్వారా పాతనేరస్తుడు షేక్ షఫీ ఉల్లాను సంప్రదించాడు. తండ్రిని హత్య చేస్తే రూ.3 లక్షలు, తల్లిదండ్రులిద్దరినీ చంపితే రూ.5 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో షఫీఉల్లా గతంలో జైల్లో ఉన్న సమయంలో పరిచయమైన గౌస్ బాషా, షేక్ షాహుల్‌తో కలిసి కిరాయి హత్యకు పథకం రచించారు. లక్ష్మీనారాయణ నిందితులకు అడ్వాన్స్ కింద రూ.30 వేలు, కత్తులను ఇచ్చాడు. నిందితులు మూడుసార్లు బాలకృష్ణయ్య ఇంటివద్ద రెక్కీ నిర్వహించారు. అదును కోసం వేచి చూస్తున్నామని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విషయం పోలీసుల ద్వారా తెలుసుకున్న బాలకృష్ణయ్య శుక్రవారం రాత్రి కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మీనారాయణ, పి.సుబ్బారావు, షేక్ షఫీ ఉల్లాను శనివారం అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: భార్యను హత్య చేసి.. ఆపై చెరువులో పడేసి.. -
స్మార్ట్ ఫోన్ కొన్న భార్య.. హత్యకి ప్లాన్ చేసిన భర్త
Hanband Plans To Murder Wife For Buying Smart Phone: కోల్‌కతా: అనుమతి లేకుండా స్మార్ట్ ఫోన్ కొన్నందుకు తన భార్యను హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు ఓ కిరాతక భర్త. అందుకు కాంట్రాక్ట్ కిల్లర్స్ ని కూడా నియమించాడు. అదృష్టవశాత్తు ఆ మహిళ ఈ ప్రమాదం నుంచి బయట పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తాలో జరిగింది. వివరాల ప్రకారం.. ఓ మహిళ కొన్ని నెలల క్రితం తన భర్తను స్మార్ట్‌ఫోన్ కొనమని కోరింది. అయితే అతను కొనేందుకు నిరాకరించాడు. ట్యూషన్ తరగతులు చెబుతూ కొంత డబ్బు సంపాదిస్తున్న మహిళ జనవరి 1న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో కోపంతో ఆమెను చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆ వ్యక్తి ఇంటి మెయిన్ డోర్‌కు తాళం వేసి మహిళ భర్త వెళ్ళిపోయాడు. ఏదో తప్పుగా భావించిన మహిళ అతని కోసం వెతకుతున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావమైన మహిళ ఇంటి నుంచి పారిపోయి అరవడం ప్రారంబించింది. మహిళ అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు. దుండగుల్లో ఒకరిని, భర్తను పట్టుకున్నారు. అయితే, మరో దుండగుడు తప్పించుకోగలిగాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు -
దావూద్ గ్యాంగ్‌కు ఎదురుదెబ్బ
అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఓ వ్యాపారవేత్తను హతమార్చేందుకు వచ్చిన దావూద్ మనుషులు పోలీసులకు దొరికిపోయారు. ఒక షార్ప్ షూటర్, మరో ముగ్గురిని పోలీసులు రాజ్‌కోట్ నగర శివార్లలో అరెస్టు చేశారు. దావూద్ సోదరుడు అనీస్ సూచనల మేరకు వాళ్లు ఇక్కడికొచ్చినట్లు పోలీసులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం తరఫు వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి చూసుకునే అనీస్ ఇబ్రహీం.. జామ్‌నగర్ వ్యాపారవేత్తను చంపేందుకు రామ్‌దాస్ రహానే, మరో ముగ్గురికి రూ. 10 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. వాళ్లు ముగ్గురూ ఓ ప్రైవేటు బస్సులో వస్తున్నారని, కన్స్ట్రక్షన్ కంపెనీ నడిపే వ్యాపారి అష్ఫఖ్ ఖత్రీ వాళ్ల టార్గెట్ అని రాజ్‌కోట్ డీసీసీ ఎస్ఆర్ ఒడెదరా చెప్పారు. ఆయన నేతృత్వంలోని పోలీసు బృందం షూటర్లను పట్టుకుంది. ఖత్రీని వాళ్లు టార్గెట్ చేసిన విషయం తెలిసి రాజ్‌కోట్ - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఉన్న కువదవా పట్టణంపై తాము గట్టిగా దృష్టిపెట్టామని, మహారాష్ట్ర నుంచి నలుగురు వ్యక్తులు ఒక ప్రైవేటు బస్సులో అనుమానాస్పదంగా వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఒడెదరా తెలిపారు. బస్సులో నలుగురు అలాగే కనిపించారని, వాళ్ల లగేజి చెక్ చేస్తే అందులో ఒక పిస్టల్, ఆరు లైవ్ కార్ట్రిడ్జులు, రెండు కత్తులు, గుజరాత్, మహారాష్ట్ర పేర్లతో ఉన్న నకిలీ నంబర్ ప్లేట్లు దొరికాయని వివరించారు. రామదాస్ అనే వ్యక్తి దావూద్ గ్యాంగు తరఫున కాంట్రాక్టు కిల్లర్‌గా వ్యవహరిస్తాడని, అతడిపై మహారాష్ట్రలో పలు ఆరోపణలున్నాయని చెప్పారు. దావూద్ గ్యాంగు వీళ్లకు పది లక్షలకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ముందుగా ఏదో ఒక వాహనం దొంగిలించి, దానికి నకిలీ నంబర్ ప్లేటు పెట్టి ఇక్కడ పని పూర్తయ్యాక అందులోనే మహారాష్ట్ర వెళ్లిపోవాలనుకున్నారని, అందుకే ఆ ప్లేట్లు తెచ్చారని తెలిపారు.