సీపీఎస్ రద్దు చేసే పార్టీలకే మా మద్దతు
సాక్షి, విశాఖపట్నం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసే రాజకీయ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 1.87 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలతోపాటు 4 లక్షల పాత పెన్షన్ ఉద్యోగుల కుటుంబాల మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. సీపీఎస్‌ను వ్యతిరేకిస్తూ ఆదివారం విశాఖపట్నంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సుమారు 10 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలేల రామాంజనేయులు యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు 35 ఏళ్ల పాటు కష్టపడి దాచుకున్న సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టి కార్పొరేట్ వ్యాపారులకు దోచిపెడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఐదేళ్లు పరిపాలించే వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం 35 ఏళ్ల పాటు ప్రజలకు సేవలందించిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానం అమలుచేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంఘం ప్రధాన కార్యదర్శి పఠాన్ బాజీ మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోదని కేంద్ర ఆర్థిక శాఖ రాసిన లేఖలో స్పష్టం చేసిందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం రద్దు చేయడం ద్వారా రూ.800 కోట్లకు పైగా ఆదా అవుతుందని, ఎన్ఎస్డీఎల్ వద్ద రూ.5 వేల కోట్లు పీఎఫ్ ఖాతాలో జమ చేసుకొని వాటిని ప్రభుత్వ పథకాలకు వినియోగించుకోవచ్చని చెప్పారు. ఏపీ జేఏసీ (అమరావతి) అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రెండు రకాల పెన్షన్ విధానాలతో ఉద్యోగులను విభజించేందుకే సీపీఎస్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.సతీష్, ప్రధాన కార్యదర్శి ఎం.ఉమామహేశ్వరావు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి
నెల్లూరు (అర్బన్): సీపీఎస్‌ను రద్దు చేస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సాబ్జి డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద భారీ ధర్నా చేయనున్నట్టు తెలిపారు. 2004 సెప్టెంబర్ తర్వాత నియమితులైన 1.84 లక్షల మంది ఉద్యోగులకు పెన్షన్ లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను సర్వేలు, ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వం వినియోగించుకోవడం మానుకోవాలన్నారు. లేదంటే ఉపాధ్యాయులే రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.