ఎవరీ ఆధ్యాత్మిక దేవత!
న్యూఢిల్లీ: గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఫోటోలో కనిపిస్తున్న గాడ్ వుమెన్(ఆధ్యాత్మిక దేవత) ఎవరు?, గాడ్ వుమన్ గా తనకు తాను ప్రకటించుకున్న రాధే మా అసలు ఇలా ఎందుకు మారాల్సి వచ్చింది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమె అసలు పేరు సుఖేందర్ కౌర్. వయసు 50 పైమాటే. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన ఆమె ఉన్నతంగా ఉండాలనే ఆలోచనతోనే ఇలా ఆధ్యాత్మిక దేవత అవతారం ఎత్తిందట.
రాధే మా మాత్రం పూర్తిస్థాయిలో మేకప్ వేసుకుని, నృత్యాలు చేస్తూ భక్తులను అలరిస్తారు. ఆమె ఏవేవో మాట్లాడుతూ.. అశ్లీల నృత్యాలు చేస్తున్నారని ముంబైకి చెందిన ఒక లాయర్ కేసు పెట్టారు. దీంతో పాటు ఆమెపై తాజాగా వరకట్న వేధింపుల కేసు కూడా నమోదైంది. అదేంటి ఈమెపై వరకట్న కేసు నమోదు కావడం ఏమిటని అనుకుంటున్నారా?, నిక్కీ గుప్తా అనే మహిళకు పెళ్లి కుదిరింది. అయితే నిక్కీ అత్త మామలు రాధే మాకు భక్తులు. తమ కుమారుడి పెళ్లికి రాధే మాను ఆహ్వానించారు. అందుకు ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేస్తే పెళ్లికి వస్తానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిక్కీ గుప్తాకు చేరవేసిన ఆ అత్తమామలు అదనపు కట్నం కోసం కావాలన్నారు. దీనికి రాధే మా ఒత్తిడే కారణమని నిక్కీ గుప్తా ఫిర్యాదులో తెలిపింది.
ఇదిలా ఉంచితే ..ఆమెకు ఆధ్యాత్మిక దేవతగా చాలానే పేరు వచ్చింది. రాధే మా కు ఏవో అద్భుత శక్తులు ఉన్నాయని భావించిన భక్తులు ఆపై ఆమెను నమ్మడం కొలవడం మొదలు పెట్టారు. ఆ భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్న రాధే మా.. దాదాపు రూ.1000 కోట్ల వరకూ వెనకేసుకుందని వినికిడి. ప్రస్తుతం ఈ ఫోటోలో ఎర్రటి కురచ దుస్తుల్లో కనిపిస్తున్న రాధే మా అంశం వివాదంగా మారింది. ఈ ఫోటోను షేర్ చేసుకున్న కొంతమంది ఆమెపై విమర్శలు కురిపిస్తున్నారు. అసలు 'రాధా మరియు మా' పేరును అపహాస్యం చేస్తున్నారని ఫోటోను షేర్ చేసుకున్న టీవీ స్టార్ రాహుల్ మహాజన్ మండిపడ్డాడు.