లగేజ్ మోసే బాధ లేదు.. ఎంచక్కా అదే వస్తుంది!
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో మనిషి అన్ని పనులను సునాయాసంగా చేసుకోవడానికి సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈ క్రమంలో షాపింగ్ మాల్స్, రైల్వే స్టేషన్స్, విమాశ్రయాలలో పైకి ఎక్కడానికి లేదా కిందికి దిగటానికి ఎస్కలేటర్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నాడు. లగేజ్ తీసుకెళ్లడానికి కూడా బెల్ట్ కన్వేయర్స్ ఉపయోగిస్తున్నాడు. అయితే ఇవన్నీ చిన్న దూరాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. అదే ఒక నగరం నుంచి మరో నగరానికి లేదా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి లగేజ్ తీసుకెళ్లే అవకాశం ఉంటే? నిజంగా ఇది వినటానికే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది కదూ..! దీన్ని నిజం చేయడానికే జపాన్.. సరికొత్త టెక్నాలజీని తీసుకురానుంది.జపాన్ గవర్నమెంట్ ప్రధాన నగరాల్లో ఆటోమేటెడ్ జీరో ఎమిషన్స్ లాజిస్టిక్స్ లింక్‌లను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇది అమలులోకి వస్తే.. ఒక వ్యక్తి తన లగేజిని ప్రత్యేకంగా తనతోపాటే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రత్యేకంగా కన్వేయర్ బెల్ట్ నిర్మాణాలు అందుబాటులోకి వస్తాయన్నమాట.ఉదాహరణకు ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే లగేజీని మనతో పాటు తీసుకెళ్లాలి. కానీ కన్వేయర్ బెల్ట్ ఉంటే.. లగేజ్ అక్కడ ఇచ్చేసి మీరు హ్యాపీగా విజయవాడ వెళ్లిపోవచ్చు. లగేజీని దొంగలు తీసుకెళ్లారని భయంగానీ.. ఎక్కడైనా మరచిపోతామేమో అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే కన్వేయర్ బెల్ట్ నిర్వాహకులు లేదా అధికారులు ఆ లగేజీని గమ్యానికి చేరుస్తారు. మీరు మళ్ళీ అక్కడ తీసుకుంటే సరిపోతుంది.జపాన్ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి గత ఫిబ్రవరి నుంచి చర్చలు జరుపుతోంది. ఇది 2034 నాటికి అమలులోకి వస్తుందని సమాచారం. మొదటి లింక్ టోక్యో నుంచి ఒకసా మధ్య ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా ఇటీవలే విడుదలైంది. ఈ ప్రణాళిక అమలులోకి వచ్చిన తరువాత లక్షల టన్నుల బరువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు.టోక్యో నుంచి ఒకసా నగరాల మధ్య సుమారు 500 కిమీ దూరాన్ని కవర్ చేయడానికి భారీ కన్వేయర్ బెల్ట్‌లను ఏర్పటు చేస్తారు. ఈ బెల్ట్ కన్వేయర్స్ హైవేల పక్కన, సొరంగాలు మార్గాల్లో కొనసాగుతుంది. ఇది మొత్తం డ్రైవర్‌లెస్ టెక్నాలజీతో రూపొందుతుంది. ఇందులో కార్గోలు లగేజీని సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తాయి. కాబట్టి వీటికోసం ప్రత్యేకంగా డ్రైవర్స్ అవసరం లేదు.ఈ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చడానికి మంత్రిత్వ శాఖ ప్రైవేట్ కంపెనీలకు పిలుపునిచ్చింది. ఈ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ సంక్షోభాన్ని పరిష్కరించడమే కాకుండా, గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుందని రవాణా & పర్యాటక మంత్రి టెట్సువో సైటో పేర్కొన్నారు. ఏది ఏమైనా ఇది అద్భుతమైన టెక్నాలజీ అనే చెప్పాలి. ఇలాంటి సదుపాయాన్ని మన దేశంలో కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది.