ఉగ్ర దుర్బేధ్యంగా భారత్‌ను నిర్మిస్తా
న్యూఢిల్లీ: భారత దేశాన్ని అజేయ శక్తిగా మలుస్తానని నూతన హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో హోం శాఖ కార్యాలయంలో అమిత్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ‘ దేశం, దేశ ప్రజల భద్రతే నాకు అత్యున్నతం. మోదీ 3.0 ప్రభుత్వం దేశాన్ని భద్రత విషయంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సల్ ప్రభావం బారిన పడకుండా దుర్బేధ్యంగా మారుస్తా’ అని అన్నారు. మరోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత–2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత–2023, భారతీయ సాక్ష్యా అధినియం–2023ల సమర్థ అమలును అమిత్‌షా పర్యవేక్షించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు మంత్రులుగా ప్రమాణంచేసిన నేతలు మంగళవారం ఢిల్లీలో తమతమ శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించి కర్తవ్య నిర్వహణ మొదలెట్టారు. కొందరు నేతలు పూజాకార్యక్రమాలు చేసి మంత్రి కుర్చిల్లో కూర్చుంటే కొందరు కమలదళ నినాదాలు చేస్తూ కుర్చిల్లో ఆసీనులయ్యారు. జైశంకర్ భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా, అశ్వనీ వైష్ణవ్ రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరెన్ రిజిజు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిగా ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రిగా ఎల్జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తన కుటుంబసభ్యుల సమక్షంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులూ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.మహిళా మంత్రులూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తానని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ అన్నపూర్ణాదేవి చెప్పారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియా పటేల్, క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రిగా రక్షా ఖడ్సే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా శోభా కరంద్లాజె, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా సావిత్రీ ఠాకూర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా నిమూబెన్ బంభానియా బాధ్యతలు స్వీకరించారు.