నిరసనకారులకు ప్రియాంక పరామర్శ
ముజఫర్‌నగర్/మీరట్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్, మీరట్‌లో జరిగిన నిరసనల్లో.. పోలీసుల దాడిలో గాయపడ్డ వారి కుటుంబాలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కలిశారు. ‘పోలీసులు ప్రజలను రక్షించాలి. కానీ ఇందుకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారు’అని ప్రియాంక ఆరోపించారు. లక్నోలోని బిజ్నూర్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసుల దాడిలో గాయపడ్డ ముజఫర్‌నగర్‌లోని మౌలానా అసద్ రజా హుస్సేనీని ఆమె పరామర్శించారు.
మదరసాలో హుస్సేనీ పిల్లలతో కలసి ఉండగా, పోలీసులు వారిపై దాడికి పాల్పడి.. పిల్లలను కూడా జైలులో పెట్టారని ఆమె ఆరోపించారు. నిరసనల్లో జరిగిన హింసలో మరణించిన నూర్ మొహమ్మద్ కుటుంబాన్ని కలసి ఆమె పరామర్శించారు. పోలీసులు దౌర్జన్యంగా ప్రవేశించి ఇబ్బంది పెట్టిన రఖియా పర్వీన్‌ను కూడా ఆమె కలిశారు. ఏదైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటే ఎవరూ తప్పు పట్టరని, అయితే ఎలాంటి తప్పు చేయకుండానే పోలీసులు అతిగా ప్రవర్తించారని దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలతో సంబంధముందన్న ఆరోపణలతో అరెస్టయిన సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్, మాజీ ఐపీఎస్ అధికారి ధరపురి సహా 13 మందికి లక్నోలోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.