corp lone
-
రైతన్న కన్నెర్ర
దుబ్బాక ఎస్బీఐ పరిధిలో 1,606 మంది రైతులు తీసుకున్నరూ.9 కోట్లతో పాటు వడ్డీ రూ.2 కోట్లు చెల్లించాలంటూ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు. గురువారం దుబ్బాక ఎస్బీఐ ఎదుట దాదాపు గంట పాటు బైఠాయించి.. నిరసన తెలిపారు. దుబ్బాక : ‘రైతులకు రుణమాఫీ అన్నారు.. రైతు ప్రభుత్వమన్నారు.. పొద్దస్తమానం అన్నదాతల జపం చేసిండ్రు.. రైతుల ఓట్లతో గెలిచిన ప్రభుత్వమే బ్యాంకు అధికారులతో రుణాలు చెల్లించాలని నోటీసులిప్పించడం చూస్తుంటే ఇదేమి ప్రభుత్వమో తెలియడం లేదు’ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవనేని రఘునందన్‌రావు ఆరోపించారు. బ్యాంకు అధికారులు అందించిన నోటీసులతో బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ఆర్అండ్బీ నుంచి గురువారం దుబ్బాక ఎస్బీఐ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంటపాటు బ్యాంకు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎస్బీఐ పరిధిలో 1606 మంది రైతులు రూ.9 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని, అధికారంలోకి రాగానే రైతులకు పంట రుణాలన్నింటినీ దశల వారిగా మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చిందని ఆరోపించారు. రూ.9 కోట్ల అసలు రుణంతో పాటు మిత్తి మరో రూ.2 కోట్లు ఇవ్వాలని సంబంధిత రైతులకు నోటీసులివ్వడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీ వర్తించదా..? రూ.వేల కోట్లతో బ్యాంకులకు ఎగనామం పెట్టిన బడా బాబులను విడిచిపెట్టి కాయాకష్టం చేసుకుని జీవించే రైతులను బెదిరించడం బ్యాంకు అధికారులకు తగదన్నారు. నోటీసులందుకున్న రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా తీసుకున్న రుణాలు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని వాపోయారు. నోటీసులందుకున్న రైతులకు ప్రభుత్వమిచ్చే రుణమాఫీ పథకం వర్తించదా అని రఘునందన్ ప్రశ్నిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం కావాలని దుబ్బాక బ్యాంకు నుంచి ముందుగా రైతులకు నోటీసులు ఇప్పించిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు చెప్పినోళ్లకే బ్యాంకు అధికారులు వ్యక్తిగత రుణాలు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతులకు రుణాలు మాఫీ అయ్యేంతవరకు బీజేపీ దశల వారీగా ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి బాలేష్‌గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యాక్షులు తోట కమలాకర్‌రెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు విభీషన్‌రెడ్డి, కోమటిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎన్ చారి, మండల అధ్యక్షుడు మంద అనిల్‌రెడ్డి, నగర అధ్యక్షుడు సత్తు తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు. -
మాఫీ మాయ
‘రైతులూ.. మీరు తీసుకున్న రుణాలేవీ తిరిగి కట్టకండి. మేం అధికారంలోకి రాగానే పంట రుణాలన్నీ రద్దు చేస్తాం. వ్యవసాయం కోసం బంగారం కుదువబెట్టి తీసుకున్న అప్పులు సైతం ఎత్తివేస్తాం. బాకీలన్నీ మేమే తీర్చి మీరంతా సంతోషంగా ఉండేలా చూస్తాం’ అంటూ అన్నదాతలను ఆశల పల్లకిపై ఊరేగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నీటి మూటలయ్యాయి. ఆయన మాటలు నమ్మి రుణాలు చెల్లించని రైతులు వడ్డీ తడిసిమోపెడై మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. రెండేళ్లు గడుస్తున్నా మాఫీ ఫలాలు అందలేదు. తొలకరి సాగుకు సమాయత్తమవుతున్న ప్రస్తుత తరుణంలోనైనా రుణమాఫీ హామీ నెరవేర్చాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఏలూరు (మెట్రో) : జిల్లాలో మొత్తం 8 లక్షల మంది రైతులు రూ.7,245 కోట్లను వివిధ వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని 2014 మార్చి నాటి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో జిల్లాలో విస్తృతంగా పర్యటించిన అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబు నాయుడు రైతులెవరూ రుణాలు చెల్లించవద్దంటూ ప్రచారం చేశారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని.. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆ అప్పులన్నిటినీ రద్దు చేస్తామని.. తొలి సంతకం అదే ఫైలుపై చేస్తామని ఘంటాపథంగా చెప్పారు. అయితే, చంద్రబాబు చేసిన తొలి సంతకం రైతులను అప్పుల బారినుంచి బయట పడేయకపోగా.. మరింతగా ఊబిలోకి నెట్టేసింది. మొదటి విడత రుణమాఫీలో భాగంగా కోటయ్య కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం 174 జీవో జారీ చేసింది. జిల్లా రైతులకు రూ.1,100 కోట్లను రుణమాఫీ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. చివరకు రూ.650 కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.450 కోట్లు నేటికీ మంజూరు కాలేదు. 2.90 లక్షల మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తామని ప్రకటించినా.. రెండేళ్లలో కనీసం 20 శాతం సొమ్ములైనా బ్యాంకులకు చేరలేదు. బంగారమంతా వేలానికి.. బంగారు నగలు కుదువబెట్టి 2013-14 సంవత్సరాల్లో 3.50 లక్షల మంది రైతులు వ్యవసాయ అవసరాల కోసం రూ.2 వేల కోట్లను రుణాలుగా తీసుకున్నారు. ఆ రుణాలు సైతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మొహం చాటేశారు. దీంతో అప్పు చెల్లించలేక.. వడ్డీలపై వడ్డీలు పెరిగిపోవడంతో సుమారు 2 లక్షల మంది రైతులు బంగారాన్ని బ్యాంకుల్లోనే వదిలేశారు. బకాయిలను రాబట్టుకునేందుకు బ్యాంకులు ఆ బంగారాన్ని వేలం వేశాయి. వడ్డీతో కలిసి తడిసిమోపెడైంది మా గ్రామంలో పది మంది రైతులతో కలిసి రుణం తీసుకున్నాను. రుణమాఫీ వస్తుందని చెప్పారు. రెండేళ్లు ఎదురు చూసినా ఫలితం లేకపోయింది. వడ్డీతో కలిసి అప్పు తడిసి మోపెడైంది. ఏమవుతుందోనని భయమేసి బయటినుంచి అప్పు తెచ్చి బ్యాంకు రుణం కట్టేశా. మళ్లీ రుణాలు తీసుకోవాలంటే భయమేస్తోంది. రుణమాఫీ హామీ అమలు కాకపోవడంతో తీసుకున్న సొమ్ముకు రెట్టింపు కట్టాల్సి వచ్చింది. - శిద్ధినీడి శివరామయ్య, రైతు, సారవ, మొగల్తూరు మండలం నిలువునా ముంచేశారు రుణమాఫీ పేరుచెప్పి రైతుల్ని నిలువునా ముంచేశారు. బాకీలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూస్తే.. వడ్డీల భారం పెరిగి రైతులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. బకాయిలు కట్టలేదని బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. జిల్లాలోని రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా ఉంది. - నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, రైతు నాయకులు, పెంటపాడు